Begin typing your search above and press return to search.

విమాన ప్రయాణమంటేనే భయం.. దాని పేరు ‘ఏవియో ఫోబియా’

విమాన ప్రయాణం అంటే చాలా మందికి సరదా.. జీవితంలో ఒక్కసారి అయినా విమాన ప్రయాణం చేయాలని కలలు కంటుంటారు.

By:  Tupaki Desk   |   28 Jun 2025 2:00 AM IST
విమాన ప్రయాణమంటేనే భయం.. దాని పేరు ‘ఏవియో ఫోబియా’
X

విమాన ప్రయాణం అంటే చాలా మందికి సరదా.. జీవితంలో ఒక్కసారి అయినా విమాన ప్రయాణం చేయాలని కలలు కంటుంటారు. మరికొందరు ప్రపంచం మొత్తం చుట్టేయాలన్న ఆలోచనతో విమాన ప్రయాణాన్ని ఒక హాబీగా మార్చుకుంటారు. అయితే అహ్మదాబాద్ విమాన ప్రయాణం తర్వాత ఈ హాబీలు, సరదాలు అన్నీ పక్కకు పోయాయట.. విమానం పేరెత్తితేనే చాలా మంది హడలిపోతున్నారు. ఈ అతి తీవ్ర ఆందోళనలను ‘ఏవియో పోబియాగా పిలుస్తున్నారు నిపుణులు. ఈ ఫోబియాతో సతమతమవుతున్న చాలా మంది విమాన ప్రయాణాల ఊసెత్తితేనే భయంతో వణికిపోతున్నారని చెబుతున్నారు.

అహ్మదాబాద్ విమాన ప్రమాదం తర్వాత ఈ ఏవియో ఫోబియాపై ఎక్కువగా చర్చ జరుగుతోంది. ఆ ప్రమాద తీవ్రతతో భయపడుతున్న చాలా మంది తీవ్ర ఒత్తిడి, గుండెలో గుబులు, అసహనంతో ఇబ్బంది పడుతున్నట్లు చెబుతున్నారు. ఈ ఫోబియా వల్ల చాలా మంది విమాన ప్రయాణాలు మానుకుంటున్నారని అంటున్నారు. గతంలో ప్రయాణికులు ఏ విమానంలో ప్రయాణిస్తున్నామని పెద్దగా పట్టించుకునేవారు కాదని, కానీ ఇప్పుడు ఆ ఆలోచన మారిందని ప్రముఖ ట్రావెల్ ఏజెన్సీలు చెబుతున్నాయి. టికెట్ బుక్ చేసుకునే ముందే విమాన రకం, మోడల్, విమానయాన కంపెనీ వంటి అంశాలను పరిశీలిస్తున్నారని పేర్కొంది. బోయింగ్, డ్రీమ్ లైనర్ అనే పేర్లు వినడానికి కూడా ప్రయాణికులు ఇష్టపడటం లేదని వెల్లడించింది.

అహ్మదాబాద్ ప్రమాదంలో 274 మంది ప్రాణాలు కోల్పోవడం, ఆ ప్రమాద దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ఏవియో ఫోబియోతో బాధపడుతున్న వారిలో భయం రెట్టింపు అయిందని చెబుతున్నారు. అదేవిధంగా అహ్మదాబాద్ ప్రమాదంతో కొత్తగా ఏవియో ఫోబియా సోకిన వారు ఎక్కువయ్యారని చెబుతున్నారు. ప్రధానంగా భారతీయ ప్రయాణికుల్లో ఎక్కువగా అహ్మదాబాద్ సంఘటన ఏవియో ఫోబియో పెంచిందని మానసిక నిపుణులు విశ్లేషిస్తున్నారు. అహ్మదాబాద్ ఘటన జరిగిన తర్వాత దేశంలో ‘ఫ్లయింగ్ ఫియర్’ అనే పదం గూగుల్ లో ఎక్కువగా సెర్చ్ చేశారని గూగుల్ ట్రెండ్స్ చూపిస్తోంది.

ప్రపంచ వ్యాప్తంగా ఏడాదికి సగటున 40 కోట్ల మంది విమానాల్లో ప్రయాణిస్తుంటారని, కానీ ఒక్క ప్రమాదంతో ఏవియో ఫోబియో పెరిగిపోవడం అంతుచిక్కడం లేదని ట్రావెల్ ఏజెంట్లు చెబుతున్నారు. ఈ ఫోబియా కారణంగా అహ్మదాబాద్ ఘటన తర్వాత సుమారు 30 నుంచి 40 శాతం మంది తమ విమాన ప్రయాణాలను రద్దు చేసుకున్నారని గణాంకాలు చెబుతున్నాయి. ఇక ఇలాంటి పరిస్థితి అధిగమించడానికి మానసిక నిపుణులు కొన్ని సలహాలిస్తున్నారు. సానుకూల ఆలోచనలతో మనసును ప్రశాంతంగా ఉంచుకోవడం, సంగీతం వినడం వంటివి చేయాలని సూచిస్తున్నారు.