ఎయిరిండియా విమాన ప్రమాదంలో తగ్గిన మృతుల సంఖ్య!
అవును... అహ్మదాబాద్ విమాన ప్రమాదానికి సంబంధించి మృతదేహాల గుర్తింపు ప్రక్రియ పూర్తయ్యింది.
By: Tupaki Desk | 28 Jun 2025 11:37 PM ISTఅహ్మదాబాద్ లో జూన్ 12న జరిగిన ఎయిరిండియా విమాన ప్రమాదంలో మొత్తం 275 మంది ప్రాణాలు కోల్పోయినట్లు ఇటీవల గుజరాత్ ఆరోగ్యశాఖ అధికారికంగా వెల్లడించిన సంగతి తెలిసిందే. ఇందులో 241 మంది ప్రయాణికులు కాగా.. 34 మంది స్థానికులు ఉన్నట్లు తెలిపింది. అయితే... తాజాగా మృతుల సంఖ్యను 260గా నిర్ధారించారు.
అవును... అహ్మదాబాద్ విమాన ప్రమాదానికి సంబంధించి మృతదేహాల గుర్తింపు ప్రక్రియ పూర్తయ్యింది. ఇందులో భాగంగా... డీఎన్ఏ పరీక్షల ద్వారా ఆఖరి మృతదేహాన్ని గుర్తించి, కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు అధికారులు వెల్లడించారు. ఈ ఘటనలో మృతుల సంఖ్యను 260 గా తేల్చారు. ఇందులో ప్రయాణికులు 241 మంది కాగా... స్థానికులు 19 మంది!
ఈ సందర్భంగా స్పందించిన అహ్మదాబాద్ సివిల్ హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ రాకేష్ జోషి... విమాన ప్రమాదానికి సంబంధించి ఆఖరి మృతదేహానికి డీ.ఎన్.ఏ మ్యాచింగ్ పూర్తయ్యిందని తెలిపారు. అనంతరం ఆ మృతదేహాన్ని కుటుం సభ్యులకు అప్పగించినట్లు వెల్లడించారు. దీంతో.. మొత్తం మృతుల సంఖ్య 260కి చేరినట్లు ప్రకటించారు.
ఈ సందర్భంగా... విమాన ప్రమాదంలో మృతదేహాలు గుర్తుపట్టరాని విధంగా మారాయని.. ఎక్కువ సంఖ్యలో మృతులను గుర్తించాల్సి రావడంతో డీఎన్‌ఏ పరీక్షల ప్రక్రియ సంక్లిష్టంగా మారిందని.. ఇటువంటి సందర్భాల్లో మృతులను గుర్తించేందుకు నెలల సమయం పడుతుంది కానీ, ఈ కేసులో ఆ ప్రక్రియ తొందర్లోనే పూర్తయ్యిందని ప్రభుత్వం తెలిపింది.
కాగా... జూన్ 12న అహ్మదాబాద్ నుంచి లండన్ బయల్దేరిన ఎయిరిండియా విమానం టేకాఫ్ తీసుకున్న కొద్ది క్షణాల్లోనే కుప్పకూలిపోయిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా... విమానాశ్రయం సమీపంలోని ఓ మెడికల్ కాలేజీ హాస్టల్ బిల్డింగ్స్ పై కూలిపోయింది. అనంతరం.. పెద్ద అగ్నిగోళంలా మారిపోయింది.
ఈ ప్రమాదంలో విమానంలో ప్రయాణిస్తున్నవారిలో ఒకరు మినహా మిగతా 241 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇదే సమయంలో స్థానికుల్లో 19 మంది మరణించారని తాజాగా ప్రభుత్వం తేల్చింది.
