విమాన ప్రమాదంపై మరోసారి స్పందించిన టాటా గ్రూపు.. ఛైర్మన్ కీలక లేఖ!
అహ్మదాబాద్ నుంచి లండన్ బయలుదేరిన ఎయిరిండియా విమానం గురువారం ఒక్కసారిగా కుప్పకూలిపోయిన సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 14 Jun 2025 9:28 AM ISTఅహ్మదాబాద్ నుంచి లండన్ బయలుదేరిన ఎయిరిండియా విమానం గురువారం ఒక్కసారిగా కుప్పకూలిపోయిన సంగతి తెలిసిందే. ఈ ఘోర ప్రమాదంలో విమానంలోని 241 మందితో పాటు బయట ఉన్న 24 మంది మరణించారు. దీంతో.. ఇది భారతదేశ చరిత్రలోని ఘోర విమాన ప్రమాదాల్లో ఒకటిగా చెబుతున్నారు. ఈ సమయంలో టాటా గ్రూపు ఛైర్మన్ స్పందించారు.
అవును... అహ్మదాబాద్ లో ఎయిరిండియా విమాన ఘోర ప్రమాదంపై టాటా గ్రూప్ మరోసారి స్పందించింది. ఇందులో భాగంగా.. ఉద్యోగులకు సంస్థ ఛైర్మన్ నటరాజన్ చంద్రశేఖరన్ లేఖ రాశారు. ఈ సందర్భంగా సంస్థ చరిత్రలో ఇదొక చీకటి రోజు అని పేర్కొన్నారు. ప్రయాణికుల భద్రత విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని తెలిపారు.
ఈ సందర్భంగా ఇది తమకు చాలా కష్టమైన సమయమే అయినప్పటికీ.. బాధ్యతల విషయంలో వెనక్కి తగ్గబోమని తెలిపారు. ఈ విమాన ప్రమాద దర్యాప్తు అంశంలో పూర్తి పారదర్శకంగా వ్యవహరిస్తామని స్పష్టం చేశారు. జరిగిన ఘటన వర్ణించలేనిదని చెబుతూ.. తామంతా ఇంకా షాక్ లోనే ఉన్నామని.. ఇది చాలా కఠిన సమయమని పేర్కొన్నారు.
తెలిసిన ఓ వ్యక్తిని కోల్పోతేనే ఎంతో బాధపడతాం అని, అలాంటిది.. ఒకేసారి ఇంతమంది చనిపోవడం నిజంగా జీర్ణించుకోలేనిదని చెప్పిన చంద్రశేఖరన్... టాటా గ్రూపు చరిత్రలో ఇదో చీకటి రోజని.. ఈ మాటలు ప్రస్తుతం ఓదార్పును ఇవ్వలేవని.. ప్రమాదంలో చనిపోయిన వారి కుటుంబీకులకు, గాయాలతో బాధపడుతున్న వారికి అండగా నిలుస్తామని తెలిపారు.
అక్కడ ఏం జరిగిందో అనే విషయంపై ప్రస్తుతానికి సమాచారం లేనప్పటికీ.. అన్ని విషయాలు తప్పకుండా తెలుస్తాయని పేర్కొన్నారు. ఇదే సమయంలో.. ప్రమాద ఘటనపై దర్యాప్తు జరిపేందుకు అమెరికా, బ్రిటన్ నుంచి దర్యాప్తు బృందాలు అహ్మదాబాద్ కు చేరుకున్నాయని, వారికి తమ నుంచి పూర్తి సహకారం ఉంటుందని స్పష్టం చేశారు.
ఇదే క్రమంలో... సమాజం పట్ల బాధ్యత కలిగి ఉండే విషయంలో టాటా గ్రూపు నిక్కచ్చిగా ఉంటుందని చెప్పిన చంద్రశేఖరన్.. దర్యాప్తులో వెల్లడయ్యే విషయాలపైనా పూర్తి పారదర్శకంగా ఉంటామని పునరుద్ఘాటించారు! ప్రమాదానికి సంబంధించిన విషయాలను తెలుసుకునే క్రమంలో ఎన్నో ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయని అభిప్రాయపడ్డారు.
అయితే.. వాటిలో కొన్ని సరైనవి, మరికొన్ని తప్పు కావచ్చని.. ఏదేమైనా ప్రమాదానికి సంబంధించిన విషయాలు స్పష్టంగా తెలిసేవరకూ కొంత సహనంతో ఉండాలని ఆయన విజ్ఞప్తి చేశారు. విశ్వాసం, సంరక్షణ అనే ప్రాతిపదికతోనే ఈ గ్రూపు నిర్మితమైందని.. కష్టకాలమైనప్పటికీ బాధ్యతల నుంచి వెనక్కి తగ్గబోమని.. ఈ నష్టాన్ని తాముకూడా భరిస్తామని లేఖలో పేర్కొన్నారు.
కాగా... అహ్మదాబాద్ విమాన ప్రమాద ఘటనపై ఎయిరిండియా యాజమాన్యమైన టాటా గ్రూప్ తొలుత స్పందిస్తూ... మరణించిన వారి కుటుంబాలకు పరిహారం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా... కోటి రూపాయల చొప్పున ఎక్స్ గ్రేషియాగా అందించనున్నట్లు వెల్లడించింది. గాయపడిన వారి వైద్య ఖర్చులను తామే భరిస్తామని తెలిపింది.
