ఏడాది గడిచినా మాయని గాయం.. ఎయిరిండియా ప్రమాద మృత్యుంజయుడి కన్నీటి గాథ
ఆ భయానక ఘటనలో విమానంలోని 241 మంది ప్రయాణికుల్లో ఒక్కరు మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారు. అతడే విశ్వాస్ కుమార్ రమేశ్. అయితే ప్రాణాలతో బయటపడటం అతని జీవితానికి కొత్త ఆరంభం కాలేదు. ఏడాది గడిచినా ఆ ప్రమాదం అతని మనసులో మిగిల్చిన గాయాలు ఇంకా మానలేదు.
By: A.N.Kumar | 13 Jun 2026 1:30 PM ISTగుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో గత ఏడాది జూన్ 12న జరిగిన ఎయిరిండియా విమాన ప్రమాదం దేశాన్ని తీవ్ర విషాదంలో ముంచెత్తింది. లండన్‌కు బయలుదేరిన ఎయిరిండియా ఏఐ-171 విమానం టేకాఫ్ అయిన కొన్ని క్షణాల్లోనే కుప్పకూలడంతో వందలాది కుటుంబాలు శోకసంద్రంలో మునిగిపోయాయి. ఆ భయానక ఘటనలో విమానంలోని 241 మంది ప్రయాణికుల్లో ఒక్కరు మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారు. అతడే విశ్వాస్ కుమార్ రమేశ్. అయితే ప్రాణాలతో బయటపడటం అతని జీవితానికి కొత్త ఆరంభం కాలేదు. ఏడాది గడిచినా ఆ ప్రమాదం అతని మనసులో మిగిల్చిన గాయాలు ఇంకా మానలేదు.
ప్రజలందరూ తనను అదృష్టవంతుడిగా చూస్తున్నారని.. కానీ తాను అనుభవిస్తున్న మానసిక వేదన గురించి ఎవరికీ తెలియదని విశ్వాస్ ఆవేదన వ్యక్తం చేశాడు. ప్రమాదం జరిగిన రోజు నుంచి తన జీవితం పూర్తిగా మారిపోయిందని చెప్పాడు. ప్రశాంతంగా నిద్రపోలేకపోతున్నానని.. ఆ భయానక దృశ్యాలు తరచూ కళ్లముందు మెదులుతున్నాయని తెలిపాడు. శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నానని భావోద్వేగానికి గురయ్యాడు. "నేను బతికిపోయినందుకు దేవుడికి కృతజ్ఞుడిని. కానీ బతికి ఉండటమే అసలైన పోరాటంగా మారింది. ఏడాది గడిచినా నా జీవితాన్ని మళ్లీ సరిదిద్దుకునేందుకు ప్రయత్నిస్తూనే ఉన్నాను. నా కుటుంబానికి కూడా అండగా నిలవలేకపోతున్నాను" అంటూ అతను చెప్పిన మాటలు హృదయాలను కదిలిస్తున్నాయి.
విశ్వాస్ కుటుంబ సలహాదారు సంజీవ్ పటేల్ వెల్లడించిన వివరాలు మరింత కలచివేస్తున్నాయి. ప్రస్తుతం విశ్వాస్ తన భార్య, ఐదేళ్ల కుమారుడితో కూడా సరిగా మాట్లాడలేకపోతున్నాడని, ఎక్కువ సమయం ఇంట్లోని ఒక గదిలో ఒంటరిగా గడుపుతున్నాడని చెప్పారు. ప్రమాదం తాలూకు భయాలు ఇంకా అతన్ని వెంటాడుతున్నాయని, తీవ్ర ట్రామాలో ఉన్నాడని తెలిపారు.
అహ్మదాబాద్ విమానాశ్రయం నుంచి బయలుదేరిన ఆ విమానం సమీపంలోని మెడికల్ హాస్టల్‌పై కుప్పకూలడంతో విమాన ప్రయాణికులతో పాటు హాస్టల్‌లో ఉన్న విద్యార్థులు కూడా ప్రాణాలు కోల్పోయారు. మొత్తం 271 మంది ఈ ఘోర ప్రమాదంలో మరణించారు. మృతుల్లో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ కూడా ఉన్నారు.
ఒక ప్రమాదం కేవలం ప్రాణాలను మాత్రమే కాదు.. బతికి మిగిలిన వారి జీవితాలను కూడా ఛిద్రము చేస్తుందనే వాస్తవానికి విశ్వాస్ కుమార్ రమేశ్ జీవితం ప్రత్యక్ష ఉదాహరణగా నిలుస్తోంది. కాలం గడుస్తున్నా, అతని మనసులో మిగిలిన గాయాలు మాత్రం ఇంకా రక్తమోడుతూనే ఉన్నాయి.
