టేకాఫ్ టూ మేడే... ఎయిరిండియా ప్రాథమిక నివేదిక పూర్తి సారాంశం!
ఆ సమయంలో అహ్మదాబాద్ లోని అంతర్జాతీయ విమానాశ్రయ పరిశరాల్లోని వాతావరణం ప్రశాంతంగానే ఉంది.. ఆకాశం స్పష్టంగా ఉంది.
By: Tupaki Desk | 12 July 2025 6:47 PM ISTజూన్ 12న అహ్మదాబాద్ లో ఘోర విమాన ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. టెకాఫ్ అయిన కొన్ని క్షణాల్లోనే ఎయిరిండియా విమానం ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ఈ ఘటనలో విమానంలో ఉన్న 242 మంది ఉండగా.. అందులో ఒకరు మినహా 241 మంది మరణించారు. విమానం జనావాసాలపై కూలడంతో అక్కడున్న 19 మంది మరణించారు. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టిన ఏఏఐబీ.. తన ప్రాథమిక నివేదికను విడుదల చేసింది. ఆ నివేదిక పూర్తి సారాంశం చూద్దామ్..!
అవును... జూన్ 12న అహ్మదాబాద్ లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి లండన్ గాట్విక్ కు ఎయిరిండియా విమానం 171, బోయింగ్ 787-8 డ్రీమ్ లైనర్.. మధ్యాహ్నం 1:39 గంటలకు బయలుదేరిన 32 సెకన్లలోపు విమానం కూలిపోయింది. ఈ ఘటనలో 11ఏ సీటులో కూర్చున్న వ్యక్తి మాత్రం ప్రాణాలతో బయటపడ్డారు. 2011లో వాణిజ్యపరంగా అరంగేట్రం చేసిన తర్వాత బోయింగ్ 787 విమానంలో ఈ స్థయిలో ప్రమాదం జరగడం ఇదే తొలిసారి!
టెకాఫ్...!:
మధ్యాహ్నం 01:37:37 గంటలకు విమానం 153 నాట్లు లేదా సుమారు 283 కి.మీ. వేగంతో టేకాఫ్ అయ్యింది. విమానం గ్రౌండ్ సెన్సార్లు ఎయిర్ మోడ్ లోకి మారాయి. విమానం గాల్లోకి లేచి, ప్రయాణం ప్రారంభించింది. ఆ తర్వాత అది గరిష్టంగా 180 నాట్లు లేదా సుమారు 333 కి.మీ. వేగంతో దూసుకెళ్లింది, స్థిరంగా పైకి ఎగిరింది. ఫ్లాప్ సెట్టింగ్ ఐదు డిగ్రీల వద్ద నమోదు చేయబడింది.. ల్యాండింగ్ గేర్ లివర్ ‘డౌన్’ స్థానంలోనే ఉంది.. ఇవి రెండూ ప్రామాణిక టేకాఫ్ విధానాలు.
ఆ సమయంలో అహ్మదాబాద్ లోని అంతర్జాతీయ విమానాశ్రయ పరిశరాల్లోని వాతావరణం ప్రశాంతంగానే ఉంది.. ఆకాశం స్పష్టంగా ఉంది.. దృశ్యమానత బాగుంది.. గాలులు ప్రయాణానికి అనుకూలంగా తేలికగా ఉన్నాయి. అయినప్పటికీ కొన్ని సెకన్లలో ఇంజిన్ 1, ఇంజిన్ 2 లకు సంబంధించిన ఫ్యుయల్ కంట్రోల్ స్విచ్ లు "రన్" నుండి "కటాఫ్" స్థానానికి ఒకదాని తర్వాత ఒకటి సెకను గ్యాప్ లో కదిలాయి!
కాక్ పీట్ వాయిస్ రికార్డర్!:
ఈ సమయంలో బ్లాక్ బాక్స్ లోగల రెండు భాగాలలో ఒకటైన కాక్ పిట్ వాయిస్ రికార్డర్ (సీవీఆర్).. పైలట్ల మధ్య జరిగిన సంభాషణను రికార్డ్ చేసింది! ఇందులో భాగంగా... ఇంజిన్లు తడబడటంతో ఒక పైలట్ (ఎవరనేది కన్ఫాం కాలేదు!) మరో పైలెట్ తో "స్విచ్ లు ఎందుకు ఆపివేసారు?" అని అడిగాడు.. దీనికి సమాధానంగా మరో పైలెట్.. "నేను ఆపలేదు" అని సమాధానం ఇచ్చారు. ఇది స్పష్టంగా రికార్డయ్యింది!
ఇంజిన్ 1, ఇంజిన్ 2 స్విచ్ లు రెండింటినీ "రన్" స్థానానికి తిరిగి మార్చారు. ఈ విషయాన్ని బ్లాక్ బాక్స్ సూచిస్తుంది. ఈ సమయంలో ఇంజిన్ లోకి ఇంధనం వచ్చి థ్రస్ట్ రికవరీ అవుతుంది. అయితే మొదటి ఇంజిన్ తిరిగి ఆన్ అవడం ప్రారంభించింది కానీ, ఎంత ప్రయత్నించినా రెండో ఇంజిన్ మాత్రం నిర్దిష్ట వేగాన్ని అందుకునేలా చేయలేకపోయింది!
డ్యూయల్ ఇంజిన్ వైఫల్యం సంభవించినప్పుడు ఒక చిన్న ప్రొపెల్లర్ అయిన రామ్ ఎయిర్ టర్బైన్ (ఆర్.ఏ.టీ) టేకాఫ్ సమయంలో యాక్టివేట్ చేశారు. ఇది యాక్టివేట్ అయినట్లు సీసీటీవీ దృశ్యాల్లో కన్పించింది. వాస్తవానికి ఆర్.ఏ.టీ.. కీలకమైన వ్యవస్థలను నిలబెట్టడానికి అత్యవసర శక్తిని అందిస్తుంది. అయితే.. ఇంజిన్ లకు థ్రస్ట్ ను మాత్రం ఉత్పత్తి చేయదు. అప్పటికే విమానం భూమి నుండి కొన్ని వందల అడుగుల ఎత్తులో ఉంది.
ఈ క్రమంలో... పైలట్ నుంచి "మేడే మేడే మేడే" కాల్ ఏటీసీకి వచ్చింది. ఏటీసీ నుంచి రియాక్షన్ వచ్చినా, పైలట్ నుంచి స్పందన లేదు! తర్వాత... మధ్యాహ్నం 01:39:11 గంటలకు డేటా రికార్డింగ్ ఆగిపోయింది. 1:39:32 గంటలకు విమానం రన్ వేకు కేవలం 0.9 నాటికల్ మైళ్ల దూరంలోని హాస్టల్ ను ఢీకొట్టింది. దానితో ఒక అగ్నిగోళంలా మారిపోయింది.
ఇద్దరు పైలట్లు!:
ఇక పైలట్ల విషయానికొస్తే... కమాండర్, పైలట్ పర్యవేక్షణ కెప్టెన్ సుమీత్ సభర్వాల్, పైలట్ ఫ్లయింగ్ ఫస్ట్ ఆఫీసర్ క్లైవ్ కుందర్ ఇద్దరూ అనుభవజ్ఞులు.. ఆరోగ్యంగా ఉన్నారు. ఇందులో భాగంగా... కెప్టెన్ సబర్వాల్ కు 11,500 గంటలకు పైగా అనుభవం ఉండగా... ఫస్ట్ ఆఫీసర్ క్లైవ్ కు 3,400 గంటలకు పైగా విమానయాన అనుభవం ఉంది. ఇద్దరూ కూడా చాలా అద్భుతమైన, గొప్ప నిపుణులు!
రెండు ఇంజన్లు!:
ఈ విమానంల్లోని రెండు ఇంజిన్లు బాగానే ఉన్నాయి! ఇందులో భాగంగా.. కుడి ఇంజిన్ కొత్తది కాగా దాన్ని 2025 మార్చిలోనే అమర్చారు! ఇక ఎడమ ఇంజిన్ విషయానికొస్తే.. దీన్ని చివరిసారిగా 2023లో సర్వీస్ చేశారు.. దాని నెక్స్ట్ మెయింటినెన్స్ 2025 డిసెంబర్ లో జరగాల్సి ఉంది.
ప్రమాదానికి ముందు ఇంధనం, బరువు పరిమితుల్లోనే ఉన్నాయి.. విమానంలో ప్రమాదకరమైన వస్తువులు ఏమీ లేవు.. విమానంలో ఇంధనం కూడా స్వచ్ఛంగానే ఉంది.. కలుషితమైన ఆనవాళ్లు లేవు! మరోవైపు.. ప్రమాదానికి సంబంధించిన ఫొటోలు, వీడియోల పరిశీలన పూర్తయ్యింది. తదుపరి విచారణ జరుగుతుంది!
మానవ తప్పిదం - యాంత్రిక వైఫల్యం!:
ప్రాథమిక నివేదిక సంగతి అలా ఉంటే... ఈ సమయంలో రెండు సందేహాలు తెరపైకి వస్తున్నాయి. ఇందులో భాగంగా... ఒక పైలట్ ఉద్దేశపూర్వకంగా లేదా అనుకోకుండా ఫ్యుయల్ స్విచ్ లను మార్చారా? స్విచ్ లు వాటికవే ఆటోమెటిక్ గా కదిలితే అందుకు సాంకేతిక లోపమే కారణమా? ఇదే సమయంలో.. స్విచ్ లు రన్ లో ఉన్నప్పటికీ ఇంజిన్ లోకి ఇంధన సరఫరా ఆగిపోయిందా? అనే సందేహాలు తెరపైకి వస్తున్నాయి.
అప్పుడే ఒక నిర్ణయానికి రావొద్దు!:
ఈ సందర్భంగా స్పందించిన పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు... ప్రపంచంలోనే అత్యంత ప్రతిభ కలిగిన పైలట్లు, సిబ్బంది మన దగ్గర ఉన్నారని.. వారు పౌర విమానయానానికి వెన్నెముక వంటివారని.. ఈ రంగానికి వారే ప్రధాన వనరులని అన్నారు. అలాంటి వారి సంక్షేమం, శ్రేయస్సు కోసం తమ ప్రభుత్వం పనిచేస్తుందని.. ఇలాంటి సమయంలో ఎలాంటి నిర్ధారణకు రాకుండా తుది నివేదిక కోసం వేచిచూద్దామని అన్నారు.
