Begin typing your search above and press return to search.

పైలెట్ నుంచి ఏటీసీకి 'మేడే కాల్' వచ్చింది... ఏమిటిది?

అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్తున్న ఎయిరిండియా (ఏఐ171) విమానం ఘోర ప్రమాదానికి గురైంది. మధ్యాహ్నం 1:39 గంటలకు రన్ వే 23 నుంచి టెకాఫ్ అయిన కొన్ని క్షణాల్లోనే కుప్పకూలిపోయింది.

By:  Tupaki Desk   |   12 Jun 2025 4:20 PM IST
పైలెట్ నుంచి ఏటీసీకి మేడే కాల్ వచ్చింది... ఏమిటిది?
X

అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్తున్న ఎయిరిండియా (ఏఐ171) విమానం ఘోర ప్రమాదానికి గురైంది. మధ్యాహ్నం 1:39 గంటలకు రన్ వే 23 నుంచి టెకాఫ్ అయిన కొన్ని క్షణాల్లోనే కుప్పకూలిపోయింది. ఆ సమయంలో విమానంలో 230 మంది ప్రయాణికులు, ఇద్దరు పైలెట్లు, 10 మంది క్యాబిన్ క్రూ ఉన్నారు. ఈ సమయంలో ‘మేడే కాల్’ పై వివరణ వచ్చింది.

అవును.. అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్తున్న ఎయిరిండియా విమానం టేకాఫ్ అయిన కొన్ని క్షణాల్లోనే కుప్పకూలిపోయింది. ఆ సమయంలో పైలట్ల నుంచి ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ఏటీసీ)కి "మేడే కాల్" వచ్చినట్లు పౌర విమానయానశాఖ వర్గాలు వెల్లడించాయి. అయితే.. తిరిగి పైలట్లను ఏటీసీ సంప్రదించేందుకు ప్రయత్నించగా.. అప్పటికే స్పందన కరువైనట్లు పేర్కొన్నాయి.

అనంతరం మరికొన్ని క్షణాల్లోనే ఎయిర్ పోర్టుకు సమీపంలో దట్టమైన బూడిదరంగు పొగలు పెద్ద ఎత్తున అలుముకున్నాయి. కూలిన సమయంలో విమానం 825 అడుగుల ఎత్తుల్లో ఉన్నట్లు అంచనా వేస్తున్నారు.

ఏమిటీ మేడే కాల్?:

అత్యవసర ప్రమాద పరిస్థితిని ఎదుర్కొంటున్నామనే విషయాన్ని రేడియో కమ్యునికేషన్ ద్వారా సమీపంలోని ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ కి తెలియజేయడానికి చేసేదే మేడే కాల్.. దీన్నే డిస్ట్రెస్ కాల్ అని కూడా అంటారు. అంటే... తాము ఆపదలో ఉన్నామని, తక్షణమే సాయం కావాలని విజ్ఞప్తి చేయడం అన్నమాట. ఎమర్జెన్సీ సమయాల్లో పైలెట్లు ‘మేడే’ అనే పదాన్ని మూడు సార్లు చెబుతారు!

దీని అర్ధం "సాయం చేయండి" అని కాగా.. ఇది ఫ్రెంచ్ పదం "మైడెర్" నుంచి వచ్చింది! ఈ మేడే కాల్ ను విమానాలతో పాటు నౌకల్లోనూ వాడతారు.

రంగంలోకి ఏఏఐబీ!:

తాజాగా జరిగిన ఈ ఎయిరిండియా విమాన ప్రమాదంపై దర్యాప్తు చేయనున్నట్లు పౌరవిమానయాన శాఖ వర్గాలు వెల్లడించాయి. దీనికోసం ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (ఏఏఐబీ) రంగంలోకి దిగింది! ఈ సమయంలో.. ఏఏఐబీ డైరెక్టర్ జనరల్, ఇతర అధికారులు ఘటనా స్థలానికి బయలుదేరారు!