Begin typing your search above and press return to search.

విమాన ప్రమాదం... బాధిత కుటుంబాల్లో మరో దారుణ వేదన!

ఈ నెల 12న అహ్మదాబాద్ లో జరిగిన ఎయిరిండియా ఘోర విమాన ప్రమాదం వందల కుటుంబాల్లో తీవ్ర విషాదం నింపిన సంగతి తెలిసిందే.

By:  Tupaki Desk   |   22 Jun 2025 9:15 AM IST
విమాన ప్రమాదం... బాధిత కుటుంబాల్లో మరో దారుణ వేదన!
X

ఈ నెల 12న అహ్మదాబాద్ లో జరిగిన ఎయిరిండియా ఘోర విమాన ప్రమాదం వందల కుటుంబాల్లో తీవ్ర విషాదం నింపిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో 274 మంది మరణించగా.. మృతుల కుటుంబాల్లో తాజాగా మరో దారుణ వేదన చోటు చేసుకుంది. ఇందులో భాగంగా.. చాలా మృతదేహాలకు డీ.ఎన్.ఏ నమూనాలు సరిపోలడం లేదని అధికారులు వెల్లడించారు.

అవును.. అహ్మదాబాద్ లో జరిగిన ఘోర విమాన ప్రమాదం వందల కుటుంబాల్లో ఘోర విషాదాన్ని నింపింది. ఇదే సమయంలో ఆ కుటుంబాల్లో మరో దారుణ వేదన చోటు చేసుకుంటుంది. ఇప్పటికే తమ వారిని కోల్పోయిన బాధతో ఉన్న వారికి.. కనీసం వారి మృతదేహాలు పూర్తిగా దొరకడం లేదు సరికదా.. దొరికిన వాటిలో కొన్నింటికి డీ.ఎన్.ఏ నమూనాలు సరిపోలడం లేదు.

ఈ ప్రమాదం జరిగి సుమారు 10 రోజులు కావొస్తున్నా.. ఇప్పటికీ తమ వారికి అంతిమ సంస్కారాలు నిర్వహించలేని పరిస్థితి! ఈ సమయంలో... ఇప్పటివరకు 231 మృతదేహాలను గుర్తించగా.. మరికొందరి డీ.ఎన్‌.ఏ నమూనాలు సరిపోలడం లేదని అధికారులు వెల్లడించారు. దీంతో మిగతా రక్త సంబంధీకుల నమూనాలు ఇవ్వాలని ఎనిమిది కుటుంబాలకు సూచించారు!

ఈ సందర్భంగా... డీ.ఎన్‌.ఏ సరిపోలితేనే మృతదేహాలను అప్పగిస్తామని స్పష్టం చేసిన అధికారులు.. డీ.ఎన్‌.ఏ సరిపోల్చే ప్రక్రియ అత్యంత సున్నితమైందని, వీటిలో చట్టపరమైన అంశాలు ఇమిడి ఉంటాయని పేర్కొన్నారు. దీంతో... 10 రోజులు గడిచినా తమవారి మృతదేహాలు ఇంకా అందకపోవడంతో ఆ కుటుంబాల్లో తీవ్ర ఆవేదన వ్యక్తమవుతోంది.

ఈ సందర్భంగా స్పందించిన అహ్మదాబాద్ ప్రభుత్వ ఆస్పత్రి వైద్యులు... సాధారణంగా తండ్రి లేదా పిల్లలు (కుమారుడు లేదా కుమార్తె) నమూనాలు తీసుకుంటామని.. డీ.ఎన్‌.ఏ తో సరిపోలని పక్షంలో మరో రక్త సంబంధీకుల నమూనాలు ఇవ్వాలని అడుగుతామని తెలిపారు. ఈ క్రమంలో.. గతంలో ఒక తోడపుట్టిన వారి నమూనా ఇచ్చినట్లయితే, ఇప్పుడు మరొకరి డీ.ఎన్‌.ఏ నమూనా ఇవ్వాలని కోరారు.

ఇదే సమయంలో.. విమాన ప్రమాదంలో మరణించిన వారిని గుర్తించేందుకు డీ.ఎన్‌.ఏ పరీక్ష ఒక్కటే మార్గమని పేర్కొన్న అధికారులు.. అత్యంత జాగ్రత్తగా ఈ ప్రక్రియ కొనసాగుతోందని తెలిపారు. బాధిత కుటుంబాలకు మృతదేహాలు అందించేందుకు అన్ని విభాగాలు తీవ్రంగా కృషి చేస్తున్నాయని తెలిపారు.