Begin typing your search above and press return to search.

అగ్రిగోల్డ్ పై కీలక నిర్ణయం.. డిపాజిటర్ల డబ్బు తిరిగి చెల్లించేలా రూట్ మ్యాప్

దశాబ్ద కాలానికి పైగా అలుపెరగని పోరాటం చేస్తున్న అగ్రిగోల్డ్ బాధితులకు ఎట్టకేలకు ఊరట లభించనుంది.

By:  Tupaki Desk   |   6 Aug 2026 9:59 AM IST
అగ్రిగోల్డ్ పై కీలక నిర్ణయం.. డిపాజిటర్ల డబ్బు తిరిగి చెల్లించేలా రూట్ మ్యాప్
X

దశాబ్ద కాలానికి పైగా అలుపెరగని పోరాటం చేస్తున్న అగ్రిగోల్డ్ బాధితులకు ఎట్టకేలకు ఊరట లభించనుంది. డిపాజిటర్లకు న్యాయం చేసే ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా సంస్థకు చెందిన భూములను బహిరంగ వేలం వేసి, తద్వారా వచ్చే నిధులను బాధితులకు పంపిణీ చేసేలా ప్రత్యేక కార్యాచరణను సిద్ధం చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. అమరావతి సచివాలయంలో అగ్రిగోల్డ్ సమస్యపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన కేబినెట్ సబ్‌ కమిటీ సమావేశమై కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ భేటీ అనంతరం పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ మీడియాతో మాట్లాడుతూ అగ్రిగోల్డ్ బాధితుల పరిహారానికి సంబంధించిన విధివిధానాలను వెల్లడించారు.

రాష్ట్రవ్యాప్తంగా అగ్రిగోల్డ్ సంస్థకు సుమారు 20,450 ఎకరాల స్థిరాస్తులు ఉన్నట్లు ప్రభుత్వం గుర్తించింది. ఇందులో భాగంగా తొలి విడతగా 6,330 ఎకరాలను బహిరంగ వేలం వేయాలని ప్రాథమికంగా నిర్ణయం తీసుకున్నారు. ఈ వేలంలో సమకూరిన ఆదాయాన్ని బాధితులకు చెల్లించాలని నిర్ణయించారు. వేలానికి సంబంధించిన విధివిధానాలను ఈ నెలలోనే ఖరారు చేయనున్నారు. అంతేకాకుండా వచ్చేనెల 15 నాటికి తొలి విడత డబ్బు చెల్లింపు ప్రక్రియను ప్రారంభించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ నెల 11న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో మంత్రివర్గ ఉపసంఘం సమావేశమై ఆస్తుల వేలానికి సంబంధించిన విధివిధానాలతో పాటు అంతర్‌రాష్ట్ర సమస్యలపై చర్చిస్తుందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.

బాధితులకు న్యాయం చేయడంలో పూర్తి పారదర్శకతను పాటిస్తున్నట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ప్రతి విషయంపై ప్రజలకు స్పష్టమైన సమాచారం ఇచ్చేలా ప్రత్యేకంగా ఒక వెబ్‌సైట్ రూపొందిస్తున్నట్లు వెల్లడించారు. డిపాజిట్ల సేకరణ ద్వారా అగ్రిగోల్డ్‌ భారీ మోసానికి పాల్పడిందనే ఆరోపణలు ఉన్నాయి. దేశవ్యాప్తంగా 5.85 లక్షల మంది ఏజెంట్ల ద్వారా సుమారు 32 లక్షల మంది ప్రజల నుంచి రూ. 6,380 కోట్లు సేకరించగా.. ఒక్క ఆంధ్రప్రదేశ్‌లోనే రూ. 3,944 కోట్ల మేర డిపాజిట్లు వసూలు చేశారు. మొత్తం 18,57,290 మందికి ప్లాట్లు ఇస్తామని ఆశ చూపిన యాజమాన్యం, కేవలం 5,76,579 ప్లాట్లను మాత్రమే చూపించి డిపాజిట్లను పక్కదారి పట్టించింది.

అగ్రిగోల్డ్ కేసుల పరిష్కారం కోసం ప్రత్యేకంగా కేటాయించిన కోర్టు భవనాన్ని ఈ నెల 15 నాటికి సిద్ధం చేయనున్నారు. దీనికి అవసరమైన న్యాయ నిపుణులు, సిబ్బందిని కేటాయించాలని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని కోరనున్నారు. అలాగే, ఏజెంట్ల వద్ద ఉండిపోయిన సుమారు రూ. 2 వేల కోట్ల విలువైన బాండ్లను తిరిగి సేకరించేందుకు సీఐడీ చీఫ్‌తో చర్చించి ప్రత్యేక సెల్స్‌ ఏర్పాటు చేయనున్నారు. వేర్వేరు రాష్ట్రాల నుంచి ఏజెంట్లు ఇబ్బంది పడకుండా ఆయా ప్రాంతాల్లోనే బాండ్లు అప్పగించే వెసులుబాటు కల్పిస్తున్నారు. దశాబ్ద కాలంగా తమ కష్టార్జితాన్ని కోల్పోయి రోడ్డున పడిన లక్షలాది మంది అగ్రిగోల్డ్ డిపాజిటర్లకు, ప్రభుత్వం తీసుకున్న ఈ తాజా నిర్ణయాలు గట్టి భరోసానిస్తుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.