రీల్స్ మోజులో ఘోరం.. ఆరుగురు అక్కాచెల్లెళ్లు మృతి.. ఆగ్రాలో విషాదం!
ఒకప్పుడు టిక్‌టాక్ రీల్స్ అంటే ఎంత పిచ్చి మోజు ఉండేదో తెలిసిందే. సెలబ్రిటీలం అయిపోవాలనే ఆశతో చాలా మంది ప్రాణాలకు తెగించి ప్రమాదకరమైన విన్యాసాలు చేసేవారు.
By: Tupaki Desk | 4 Jun 2025 5:32 PM ISTఒకప్పుడు టిక్‌టాక్ రీల్స్ అంటే ఎంత పిచ్చి మోజు ఉండేదో తెలిసిందే. సెలబ్రిటీలం అయిపోవాలనే ఆశతో చాలా మంది ప్రాణాలకు తెగించి ప్రమాదకరమైన విన్యాసాలు చేసేవారు. ఈ క్రమంలో ప్రాణాలు కోల్పోయిన వారు కూడా ఉన్నారు. టిక్‌టాక్‌ను నిషేధించిన తర్వాత, ఆ స్థానాన్ని ఇన్‌స్టాగ్రామ్ ఆక్రమించింది. ఇప్పుడు చిన్నపిల్లల నుంచి పండు ముసలి వాళ్ళ వరకు అందరూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఫేమస్ అవ్వాలనే కోరికతో ప్రమాదకరమైన స్టంట్స్ చేస్తూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. తాజాగా, అలాంటి ఘోరమైన సంఘటన ఒకటి ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది.
ఆరుగురు అక్కాచెల్లెళ్లు బలి
ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ వీడియో చేస్తుండగా ఆరుగురు యువతులు ఒకేసారి ప్రమాదానికి గురై, నదిలో మునిగి మరణించారు. ఈ విషాద ఘటన ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రా సమీపంలో మంగళవారం జరిగింది. ఈ ఘటన పూర్తి వివరాల్లోకి వెళ్తే...ఆగ్రా దగ్గరలోని నాగ్లా స్వామి గ్రామానికి చెందిన ఆరుగురు యువతులు, ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ వీడియోలు చేసుకోవడానికి తమ ఇంటి నుండి 800 మీటర్ల దూరంలో ఉన్న యమునా నదికి వెళ్లారు. వీరంతా ఒకే కుటుంబానికి చెందిన అక్కాచెల్లెళ్ళు.
వీడియో తీస్తూ ఆరుగురు చేతులు పట్టుకొని నదిలోకి దిగారు. అనుకోకుండా, వారిలో ఒక అమ్మాయి లోతైన ప్రదేశంలోకి జారిపోయింది. ఆమె నీటిలో మునిగిపోవడం చూసి, మిగిలిన ఐదుగురు ఆమెను కాపాడటానికి ప్రయత్నించారు. అయితే దురదృష్టవశాత్తు వారు కూడా నీటిలో మునిగిపోయారు. అక్కడే ఉన్న ఇద్దరు అబ్బాయిలు వారిని రక్షించడానికి ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. దీంతో ఆరుగురు యువతులు నది ప్రవాహంలో కొట్టుకుపోయారు.
ఈ విషయం తెలుసుకున్న బంధువులు, గ్రామస్తులు, పోలీసులు వెంటనే నది వద్దకు చేరుకున్నారు. నీటిలో కొట్టుకుపోయిన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. గాలింపు అనంతరం ఘటన జరిగిన ప్రదేశం నుండి 1.5 కిలోమీటర్ల దూరంలో ఆరుగురినీ గుర్తించారు. వారిలో నలుగురు అప్పటికే మరణించి ఉన్నారు. మిగిలిన ఇద్దరిని ఆసుపత్రికి తరలించారు. వైద్యులు సీపీఆర్ (CPR) చేసి వారి ప్రాణాలు కాపాడటానికి ప్రయత్నించారు. అయితే, కొన్ని గంటల తర్వాత వారు కూడా మరణించారు.
చనిపోయిన వారిలో ముస్కాన్ అనే యువతికి కొద్ది రోజుల క్రితమే నిశ్చితార్థం జరిగింది. ఆమెకు నవంబర్‌లో వివాహం జరగాల్సి ఉంది. ఇంతలోనే ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ఈ ఆరుగురు యువతులు ఒకే కుటుంబానికి చెందిన అక్కాచెల్లెళ్ళు కావడంతో, వారి మరణాలు కుటుంబంలోను గ్రామంలోను తీవ్ర విషాదఛాయలు నింపాయి. సోషల్ మీడియా మోజులో ప్రాణాలు కోల్పోవడం పట్ల గ్రామస్తులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.
