Begin typing your search above and press return to search.

పాక్ ను వణికించిన భారత సైన్యం టీమ్ గురించి తెలుసా?

ఇందులో భాగంగా... ప్రధానంగా అటు వైపు నుంచి వచ్చిన డ్రోన్లు, క్షిపణులను గాల్లొనే నిర్వీర్యం చేసింది. ఈ కీలక పాత్రం పోషించినవారు అగ్నివీరులు అనే విషయం తాజాగా తెరపైకి వచ్చింది.

By:  Tupaki Desk   |   22 May 2025 11:00 PM IST
పాక్ ను వణికించిన భారత సైన్యం టీమ్ గురించి తెలుసా?
X

పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ రెండు రకాలుగా పాక్ ని వణికించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా పాక్, పాక్ ఆక్రమిత కశ్మీర్ లోని ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేసి, సుమారు 100 మంది ముష్కరులను మట్టుబెట్టగా.. అనంతరం పాక్ చేసిన దాడులకు ప్రతీకార దాడులు చేసింది.

ఆ సమయంలో భారత్ పై వందల సంఖ్యలో డ్రోన్లు, క్షిపణులతో విరుచుకుపడింది పాకిస్థాన్. ఈ సమయంలో రివర్స్ లో పాక్ ఎయిర్ బేస్ లను, గగనతల రక్షణ వ్యవస్థలను భారత్ నాశనం చేసింది. ఇప్పుడు అవన్నీ ఐసీయూలో ఉన్నాయని మోడీ ఎద్దేవా చేస్తున్నారు. ఈ సమయంలో పాక్ ఆటకట్టించి, డ్రోన్లను నాశనం చేసిన సైన్యం గురించి తెలుసుకుందాం..!

అవును... ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించి, భారత్ పైకి ఉసిగొల్పి పంపుతోన్న పాకిస్థాన్ ను ఆపరేషన్ సిందూర్ తో చావుదెబ్బ కొట్టింది భారత సైన్యం. ఇందులో భాగంగా... ప్రధానంగా అటు వైపు నుంచి వచ్చిన డ్రోన్లు, క్షిపణులను గాల్లొనే నిర్వీర్యం చేసింది. ఈ కీలక పాత్రం పోషించినవారు అగ్నివీరులు అనే విషయం తాజాగా తెరపైకి వచ్చింది.

ఈ సమయంలో ఆర్మీలోని కీలక ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలో పనిచేసిన వేల మంది అగ్నివీరులు పాకిస్థాన్ దాడిని సమర్థంగా ఎదుర్కొనట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఈ క్రమంలో సరిహద్దుల్లోని ఒక్కో గగనతల రక్షణ వ్యవస్థ యూనిట్ లోనూ సుమరు 150 నుంచి 200 మంది చొప్పున మొత్తంగా సుమారు 3,000 మంది అగ్ని వీరులు ఆపరేషన్ లో పాల్గొన్నట్లు చెబుతున్నారు.

కీలకమైన సైనిక స్థావరాలు, ఎయిర్ బేస్ ల్లో విధులు నిర్వర్తించే వీరు.. పాకిస్థాన్ క్షిపణులు, డ్రోన్లను ఎప్పటికప్పుడు నేల కూలుస్తూ సమర్థంగా విధులు నిర్వర్తించినట్లు చెబుతున్నారు. ఈ క్రమంలో.. ఫైర్ కంట్రోల్ ఆపరేటర్లు, రేడియో ఆపరేటర్లు, క్షిపణులు - గన్స్ అమర్చిన భారీ వాహనాలకు డ్రైవర్లుగా వీరు ఆపరేషన్ లో ముందుండి పోరాట పటిమ చూపించారని అంటున్నారు.

కాగా... అగ్నివీర్ పథకాన్ని కేంద్రం 2022 జూన్ లో ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ పథకంలో అగ్నివీరులుగా నియమితులయ్యే సిబ్బంది నాలుగేళ్ల పాటు సాయుధ బలగాల్లో పనిచేస్తారు. ఆ తర్వాత 25శాతం మందిని ఎంపిక చేసి, 15 ఏళ్ల కాలవ్యవధిలో రెగ్యులర్ సర్వీసుల్లోకి తీసుకుంటారు. ఇలా గత మూడేళ్లలో సుమారు లక్షమంది అగ్నివీరులను తీసుకున్నారు.