Begin typing your search above and press return to search.

ఏలియన్స్ మేటర్... సాక్ష్యాలున్నాయి కానీ అమెరికా దాస్తోంది!

అగ్రరాజ్యం అమెరికా దగ్గర సాక్ష్యాలు కూడా ఉన్నాయని అంటున్నాడు ఓ మాజీ నిఘా అధికారి

By:  Tupaki Desk   |   27 July 2023 11:38 AM GMT
ఏలియన్స్ మేటర్... సాక్ష్యాలున్నాయి కానీ అమెరికా దాస్తోంది!
X

గ్రహాంతరవాసులు ఉన్నారా.. లేదా.. అనే ప్రశ్నపై చాలా ఏళ్లుగా చర్చ జరుగుతోన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో... చాలా మంది ఆకాశంలో తాము ఎగిరే పళ్లాలను చూశామని చెబుతూ ఉంటారు. కొందరైతే తాము గ్రహాంతరవాసుల్ని కూడా చూశాం అని అంటుంటారు. మరికొంతమందైతే... అదంతా వట్టి ట్రాష్ అని కొట్టిపారేస్తుంటారు.

ఈ పరిశోధనల పరిణామ క్రమంలో... అమెరికాలోని ఏరియా 51లో గ్రహాంతరవాసులు ఉన్నారనీ.. వారిపై పరిశోధనలు జరుగుతున్నాయని.. గ్రహాంతరవాసుల రహస్య ప్రపంచం ఊర్ట్ క్లౌడ్ వెనుక దాగి ఉందని.. ఈ మేరకు నాసా శాస్త్రవేత్తలు పరిశోధనలు జరుపుతున్నారని కథనాలొస్తోన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అమెరికా మాజీ నిఘా అధికారి కీలక విషయాలు వెల్లడించారు.

అవును... మనుషులే కాదు.. ఇతర గ్రహాలపైనా జీవులు ఉన్నాయని.. ఇందుకు సంబంధించి అగ్రరాజ్యం అమెరికా దగ్గర సాక్ష్యాలు కూడా ఉన్నాయని అంటున్నాడు ఓ మాజీ నిఘా అధికారి. అయితే ఆ సాక్ష్యాలను బయటకు రాకుండా అమెరికా దాచిపెడుతోందని ఆరోపించారు ఆ అధికారి. దీంతో ఈ విషయం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

యూ.ఎఫ్‌.వో.లు.. అందులో నుంచి సేకరించిన మానవేతర అవశేషాలు.. మొదలైన విషయాలపై పరిశోధనలు కొనసాగుతున్నాయని.. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను నిఘా వర్గాలు గతంలోనే ప్రభుత్వానికి సమర్పించాయని సంచలన ఆరోపణలు చేశారు అమెరికా మాజీ నిఘా అధికారి డేవిడ్ గ్రుష్!

ఇదే సమయంలో టాస్క్ ఫోర్స్ మిషన్ కు సంబంధించిన అత్యంత క్లాసిఫైడ్ ప్రోగ్రామ్‌ లను గుర్తించామని.. ఏలియన్స్ ఉపయోగించే వాహనం గురించి సమాచారం తన దగ్గర ఉందని.. 2019లో యూఎస్ గూఢచారి ఉపగ్రహాలను నిర్వహించే నేషనల్ రికనైసెన్స్ ఆఫీస్ కు ఈ విషయాన్ని చెప్పానని కీలక వ్యాఖ్యలు చేశారు.

అయితే జూన్‌ లోనే ఆయన అమెరికా ప్రభుత్వంపై ఈమేరకు ఆరోపణలు చేశారు. దీంతో రిపబ్లికన్‌ కమిటీ ఒకటి ఆయన ఆరోపణలపై దర్యాప్తు కొనసాగిస్తోంది. అయితే.. తాను ప్రత్యక్షంగా వాటిని చూడకపోయినప్పటికీ, హైలెవల్‌ ఇంటెలిజెన్స్‌ అధికారుల నుంచి తనకు సమాచారం ఉందని చెబుతున్నారు.

అయితే.. అమెరికా ప్రభుత్వం మాత్రం సాక్ష్యాలను దాచిపెడుతుందన్న గ్రుష్‌ ఆరోపణలను తోసిపుచ్చింది. పరిశోధకులకు ఎలాంటి ఆధారాలు దొరకలేదని తెలియజేసింది.