Begin typing your search above and press return to search.

వ‌ణికిస్తున్న 'ఎబోలా'.. ఏపీ అలెర్ట్‌.. అస‌లేంటీ వైర‌స్‌?

ఎబోలా.. బుండి బ్యూగో.. ఇప్పుడు దాదాపు ఎవ‌రి నోట విన్నా ఇదే మాట వినిపిస్తోంది. ప్ర‌పంచ దేశాలు అప్ర‌మ‌త్త‌మ‌య్యాయి.

By:  Garuda Media   |   25 May 2026 12:43 AM IST
వ‌ణికిస్తున్న ఎబోలా.. ఏపీ అలెర్ట్‌.. అస‌లేంటీ వైర‌స్‌?
X

ఎబోలా.. బుండి బ్యూగో.. ఇప్పుడు దాదాపు ఎవ‌రి నోట విన్నా ఇదే మాట వినిపిస్తోంది. ప్ర‌పంచ దేశాలు అప్ర‌మ‌త్త‌మ‌య్యాయి. ఈ వైర‌స్ కార‌ణంగా.. ఇప్ప‌టి వ‌ర‌కు కేవ‌లం 15 రోజుల్లోనే 210 మంది మృతి చెందారు. 1000 మంది వ‌ర‌కు ఆసుప‌త్రుల్లో చికిత్స పొందుతున్నారు. ప్ర‌స్తుతం ఈ వైర‌స్ ద‌క్షిణ సూడాన్‌, కాంగో, ఉగాండా వంటి ద‌క్షిణాఫ్రికా దేశాల‌కు మాత్ర‌మే ప‌రిమిత మైనా.. ర‌వాణా.. ప్ర‌జ‌ల రాక‌పోక‌ల కార‌ణంగా.. ఇది మ‌రిన్ని దేశాల‌కు విస్త‌రించే అవ‌కాశం ఉంది. దీంతో ప్ర‌పంచ దేశాల మ‌ధ్య ర‌వాణా సేవ‌ల‌ను కూడా నిలిపివేసే అవ‌కాశం క‌నిపిస్తోంది.

ఇక‌, ఈ వైర‌స్ వ్యాప్తిని క‌ట్ట‌డి చేసేందుకు భార‌త ప్ర‌భుత్వం కూడా చ‌ర్య‌లు తీసుకుంది. ఉగాండా, కాంగో, ద‌క్షిణ సూడాన్ స‌హా.. ఎబోలా వైర‌స్ వ్యాప్తి ఉన్న దేశాల‌కు ప్ర‌యాణాల‌ను నిలువ‌రించాల‌ని నిర్ణ‌యించింది. ఈ క్ర‌మంలో ప్ర‌జ‌ల‌కు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ అడ్వైజ‌రీని కూడా జారీ చేసింది. ఇక‌, ఏపీ ప్ర‌భుత్వం కూడా అప్ర‌మ‌త్త‌మైంది. కాంగో, ఉగాండా, ద‌క్షిణ‌ సూడాన్‌ నుంచి ఏపీకి త‌ర‌లి వచ్చేవారికి వైద్య పరీక్షలు చేయాలని ఆదేశించింది. ముఖ్యంగా అంత‌ర్జాతీయ విమానాశ్రయాలైన‌ విశాఖప‌ట్నం, తిరుపతి, విజయవాడ ల‌లో ప్ర‌త్యేక కేంద్రాల‌ను ఏర్పాటు చేసి.. ప్ర‌యాణికుల‌కు వైద్య ప‌రీక్ష‌లు నిర్వ‌హిస్తారు. కేవ‌లం విమానాశ్ర‌యాలే కాకుండా.. ఓడరేవులతో పాటు రోడ్డు మార్గాల్లోనూ రాష్ట్ర ప్ర‌భుత్వం చ‌ర్య‌లు చేప‌ట్ట‌నుంది.

అస‌లేంటీ ఎబోలా?

ఎబోలా అనేది వైరస్ వల్ల వచ్చే ఒక తీవ్రమైన, ప్రాణాంతక వ్యాధి. వైరస్ సోకిన 2 నుంచి 21 రోజుల మధ్యలో దీని లక్షణాలు బయటపడతాయి. దాదాపు చికెన్ గున్యా, క‌రోనా ల‌క్ష‌ణాలే క‌నిపిస్తాయి. ఒక‌రి నుంచి మ‌రొక‌రికి అత్యంత‌వేగంగా విస్త‌రించ‌డం.. దీని ల‌క్ష‌ణం. అయితే, ఎబోలా ప్ర‌పంచానికి కొత్త‌కాదు. కానీ, ఇప్పుడు వ‌చ్చిన బుండి బ్యూగో వేరియంట్ మాత్ర‌మే చాలా కొత్త‌ద‌ని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఈ క్ర‌మంలో ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ కూడా.. ఈ వైర‌స్‌ను అత్యంత తీవ్ర‌మైన వ్యాధి జాబితాలో చేర్చింది. అంతేకాదు.. ప్ర‌పంచ దేశాలు అత్యంత అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని కూడా పేర్కొంది.

ల‌క్ష‌ణాలు ఇవీ..

ప్రాథమిక లక్షణాలు: ఆకస్మికంగా తీవ్రమైన జ్వరం వ‌స్తుంది. విపరీతమైన అలసట, నీరసం క‌నిపిస్తుంది. కండరాల నొప్పులు వ‌స్తాయి. ఒళ్లు నొప్పులు, తీవ్రమైన తలనొప్పి, గొంతు నొప్పి క‌నిపిస్తాయి. ఇక‌, రెండో ద‌శ‌కు వ‌చ్చే స‌రికి.. విరేచనాలు (నీళ్ల విరేచనాలు), తీవ్రమైన కడుపు నొప్పి, వాంతులు, చర్మంపై దద్దుర్లు, మూత్రపిండాలు, కాలేయం పనితీరు మందగించడం, ముక్కు, చిగుళ్లు, నోటి ద్వారా రక్తం కారడం, శరీరంపై ఎర్రటి మచ్చలు ఏర్ప‌డ‌తాయి. దీనిని అశ్ర‌ద్ధ చేస్తే.. ప్రాణాల‌కే ప్ర‌మాదం పొంచి ఉంటుంది. వ్యాధి ల‌క్ష‌ణాలు క‌నిపించ‌గా.. వైద్యుల‌ను సంప్ర‌దించ‌డంతోపాటు.. క్వారంటైన్ కావాలి. త‌ద్వారా .. తొలి ద‌శ‌లోనే దీనిని త‌గ్గించుకునేందుకు ప్ర‌య‌త్నించాలి.