సహారాలో హృదయ విదారక ఘటన.. 49 మంది మృతి, 60 మంది?
ప్రపంచంలోనే అతిపెద్ద ఎడారి అయిన సహారాలో ఒక ఊహించని ఘోర విషాదం జరిగింది.
By: Madhu Reddy | 6 Jun 2026 11:58 PM ISTప్రపంచంలోనే అతిపెద్ద ఎడారి అయిన సహారాలో ఒక ఊహించని ఘోర విషాదం జరిగింది. పండుగ కోసం సొంతూరికి బయల్దేరిన ప్రయాణికుల ట్రక్కు ఎడారి మధ్యలో పాడైపోవడంతో, నీటి చుక్క దొరక్క విపరీతమైన వేడికి 49 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరోవైపు ఇంకో ట్రక్కులో చిక్కుకున్న 60 మంది ప్రాణాలను రెస్క్యూ టీమ్స్ సమయానికి కాపాడగలిగాయి. అసలు ఎడారి ప్రయాణంలో ఏం జరిగింది? అక్కడ ప్రయాణించడం ఎంత ప్రమాదకరమో తెలుసుకుందాం.
పండుగ పూట విషాదం:
మృతులంతా పశ్చిమ ఆఫ్రికా దేశమైన నైజర్ కు చెందినవారు. తమ కుటుంబ సభ్యులతో కలిసి బక్రీద్ పండుగను జరుపుకోవడానికి వీరంతా ఒక ట్రక్కులో సంతోషంగా బయల్దేరారు. కానీ, అస్సామాకా పట్టణానికి 80 కిలోమీటర్ల దూరంలో, సహారా ఎడారిలోని ఒక నిర్జన ప్రాంతంలో ఆ ట్రక్కు హఠాత్తుగా చెడిపోయింది.
ప్రాణాలు తీసిన ఉష్ణోగ్రతలు:
ట్రక్కును రిపేర్ చేయడానికి డ్రైవర్, ప్రయాణికులు చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. ఇక చుట్టుపక్కల ఎలాంటి గ్రామాలు లేవు, కనీసం ఫోన్ సిగ్నల్ కూడా లేదు. విపరీతమైన ఉక్కపోత, ఎండ తీవ్రతకు తోడు తాగడానికి చుక్క నీరు కూడా లేకపోవడంతో రోజులు గడుస్తున్న కొద్దీ ప్రయాణికులు ఒక్కొక్కరుగా ప్రాణాలు విడిచారు.
నీటి కోసం 50 కిలోమీటర్ల నడక:
ట్రక్కులో ఉన్నవారిలో ఇద్దరు వ్యక్తులు ఎలాగైనా ప్రాణాలు దక్కించుకోవాలని, నీటి కోసం ఎడారిలో ఏకంగా 50 కిలోమీటర్లకు పైగా నడిచారు. చివరకు ఒక నీటి ప్రాంతానికి చేరుకుని, అక్కడి నుండి అధికారులకు సమాచారం అందించారు. సహాయక బృందాలు వచ్చేసరికే 49 మంది చనిపోయారు. దాంతో వారికి ఎడారిలోనే సామూహిక ఖననం చేశారు.
మరో 60 మంది ప్రాణాలు సేఫ్:
ఈ ప్రమాదంలో ఒక అద్భుతం కూడా జరిగింది. చనిపోయిన వారి మృతదేహాలను తీసుకొని సహాయక బృందాలు తిరిగి వస్తుండగా, సమీపంలోనే మరో ట్రక్కు చెడిపోయి ఉండటాన్ని గమనించారు. అందులో 60 మంది ప్రయాణికులు మూడు రోజులుగా నీరు లేక నరకం చూస్తున్నారు. అదృష్టవశాత్తూ రెస్క్యూ టీమ్ వారికి సమయానికి నీరు, ఆహారం అందించి ప్రాణాలు కాపాడారు.
ఎడారి ప్రయాణం.. మృత్యువుతో ఆట:
సహారా ఎడారిలో ప్రయాణించడం అంటే ప్రాణాలను చేతిలో పెట్టుకుని వెళ్లడమే. పగటిపూట ఇక్కడ ఉష్ణోగ్రతలు 50 డిగ్రీల దాకా నమోదవుతాయి. ఒకసారి దారి తప్పినా, వాహనం పాడైనా మైళ్ల దూరం వరకు మనుషుల జాడ ఉండదు. ఇసుక తుఫానులు వస్తే దారులు కూడా కనపడవు.
ప్రయాణంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు:
ఇలాంటి ప్రమాదాల నుండి బయటపడాలంటే ఎడారి ప్రయాణాల్లో కొన్ని కఠినమైన జాగ్రత్తలు తప్పనిసరి ఇక మొదట అదనపు నీరు, ఆహారం ఉండాలి ప్రయాణానికి సరిపడా కాకుండా, అత్యవసర పరిస్థితుల కోసం కనీసం వారం రోజులకు సరిపోయే నీటిని వెంట ఉంచుకోవాలి. ఇక సాధారణ మొబైల్ సిగ్నల్స్ ఉండవు కాబట్టి శాటిలైట్ కమ్యూనికేషన్ సాధనాలు వాడాలి. అంతేకాక వాహన కండిషన్ ముఖ్యం ఎడారి ప్రయాణానికి ముందు వాహనాన్ని పూర్తిగా చెక్ చేసుకోవాలి.
పండుగ సంతోషాల మధ్య జరిగిన ఈ ఘటన కుటుంబాల్లో తీవ్ర శోకాన్ని నింపింది. ప్రకృతి ముందు మనుషులు ఎంత బలహీనులో సహారా ఎడారి విషాదం మరోసారి నిరూపించింది. ఇక టెక్నాలజీ ఎంత పెరిగినా.. ప్రకృతి విసిరే సవాళ్లను తట్టుకోవాలంటే సరైన ముందస్తు జాగ్రత్తలు, భద్రతా ప్రమాణాలు పాటించడం ఒక్కటే మార్గం అంటున్నారు నిపుణులు.
