కారే కదిలే కూలరు.. ఎండలకు తాళలేక తాలిబన్ డ్రైవర్ల తెలివైన ఆలోచన
మౌలిక వసతుల్లో ఒకటైన రోడ్ల వంటి వాటిలో అఫ్ఘాన్ ఇంకా వెనుకబడే ఉంది. అలాంటిచోట వాహనాలు నడపడం అంత కష్టం కాదు.
By: Tupaki Desk | 19 July 2025 9:20 AM ISTసరిగ్గా నాలుగేళ్ల కిందట తాలిబాన్ల వశమైంది అఫ్ఘానిస్థాన్. మిలిటెంట్ గ్రూప్ పాలనలో ఎలా మనగలుగుతుందోనని ఆందోళనలు వ్యక్తమైనా.. ఇప్పటికైతే తీవ్రస్థాయి పరిణామాలు ఏమీ జరగలేదు. ఈ క్రమంలోనే ప్రపంచంలోనే అతిపెద్ద దేశమైన రష్యా నుంచి గుర్తింపు పొందింది తాలిబన్ ప్రభుత్వం. ఒకప్పుడు సోవియట్ యూనియన్ (నేటి రష్యా) ఆక్రమణకు గురైన అఫ్ఘానిస్థాన్‌లో మిలిటెన్సీని ప్రోత్సహించారు. మళ్లీ ఇప్పుడు అదే రష్యా నుంచి గుర్తింపు పొందడం యాదృచ్ఛికమే అనుకోవాలి. ఇక వాతావరణం పరంగా అఫ్ఘాన్ కాస్త భిన్నమైనదే. ఎందుకంటే.. చలి ఎంతగా ఉంటుందో ఎండలు కూడా అంతే తీవ్రం. ఇప్పుడు ఈ ఎండలను తట్టుకోలేక అఫ్ఘాన్ డ్రైవర్లు భిన్నమైన ఆలోచన చేస్తున్నారు. ఇది ఏసీని మించి ప్ర‘యోగం’ అని చెబుతున్నారు. ఇంతకూ వారు ఏం చేశారంటే..?
మౌలిక వసతుల్లో ఒకటైన రోడ్ల వంటి వాటిలో అఫ్ఘాన్ ఇంకా వెనుకబడే ఉంది. అలాంటిచోట వాహనాలు నడపడం అంత కష్టం కాదు. పైగా తీవ్రమైన ఎండలు. దీంతో అఫ్ఘాన్‌లోని కాందహార్ నగర ట్యాక్సీ డ్రైవర్లు ప్రత్యేక ఏర్పాట్లు చేసుకున్నారు. కాందహార్‌లో ఇప్పుడు 40 డిగ్రీలపైనే ఎండలున్నాయి. అయితే, కారు ఏసీలు సరిగా పనిచేయడం లేదు. దీంతో క్యాబ్ డ్రైవర్ల కష్టాలు రెట్టింపు అవుతున్నాయి. దీంతో వారు తమ వాహనాలపై వెడల్పైన గొట్టాలు, ఎగ్జాస్ట్ ట్యూబ్‌లు బిగించారు. ఇక కారుపైన కూలర్ పెట్టి.. దానికి బిగించిన గొట్టాన్ని కారులోకి పెట్టి టేప్ చేశారు. ఈ కొత్త ఏర్పాటు ఏసీ కంటే బాగా ఉందని చెబుతున్నారు. కొన్నేళ్ల నుంచే ఈ ప్రయత్నం చేస్తున్నారు. ఏసీతో కారు ముందుభాగమే కూల్ అవుతుందని.. కూలర్లతో మొత్తం చల్లగా అవుతుందని చెబుతున్నారు. పైగా ఎండలకు ఏసీల రిపేర్ కూడా చాలా ఖర్చు అవుతోందని పేర్కొంటున్నారు.
మరి కూలరంటే మామూలుగా ఉండదు కదా..? దానికి ఎప్పటికప్పుడు నీళ్లు పోయాలి కదా..? దీనికోసం రోజుకు రెండుసార్లు నీళ్లు నింపడమే కష్టమైన పని అని కాందహార్ డ్రైవర్లు వివరిస్తున్నారు. కాగా, అఫ్ఘాన్‌లో మిగతా దేశాల తరహాలో ప్రకృతి సంరక్షణ, మొక్కల పెంపకం ఉంటుందని భావించలేం. ఎందుకంటే దశాబ్దాలుగా యుద్ధాలతో ఆ దేశం అతలాకుతలం అయింది. పైగా రష్యా, అమెరికా సర్వనాశనం చేశాయి. దీంతో కటిక పేదరికంలో మగ్గుతోంది. వాతావరణ మార్పుల ప్రభావం ఎదుర్కొంటోంది. మున్ముందు ఉష్ణోగ్రతలు బాగా పెరుగుతాయనే హెచ్చరికలు ఉన్నాయి. ఈ ఏడాది ఏప్రిల్-జూన్ మధ్యలో అఫ్ఘాన్‌లో ఎండలు అల్లాడించాయి.
కొసమెరుపుః తాలిబన్లు అధికారం చేపట్టాక.. వాతావరణ చర్చల నుంచి అఫ్ఘాన్‌ను ఐక్యరాజ్య సమితి తొలగించింది
