Begin typing your search above and press return to search.

అఫ్గాన్‌లో భూకంప విలయం.. 600 మందికి పైగా మృతి

అఫ్గానిస్థాన్‌ మరోసారి ప్రకృతి కోపానికి గురైంది. ఆదివారం అర్ధరాత్రి చోటుచేసుకున్న ఘోర భూకంపం కేవలం నేలను కాదు, అనేక కుటుంబాల ఆశలను, కలలను కూడా కూలగొట్టింది.

By:  Tupaki Desk   |   1 Sept 2025 1:10 PM IST
అఫ్గాన్‌లో భూకంప విలయం.. 600 మందికి పైగా మృతి
X

అఫ్గానిస్థాన్‌ మరోసారి ప్రకృతి కోపానికి గురైంది. ఆదివారం అర్ధరాత్రి చోటుచేసుకున్న ఘోర భూకంపం కేవలం నేలను కాదు, అనేక కుటుంబాల ఆశలను, కలలను కూడా కూలగొట్టింది. రిక్టర్‌ స్కేల్‌పై 6.0 తీవ్రతతో సంభవించిన ఈ భూకంపం కునార్‌ ప్రావిన్స్‌ను కేంద్రంగా చేసుకుని చుట్టుపక్కల ప్రాంతాలను విపరీతంగా దెబ్బతీసింది. అధికారిక సమాచారం ప్రకారం, కనీసం 500 మంది ప్రాణాలు కోల్పోగా, వెయ్యి మందికి పైగా గాయపడ్డారు. ప్రతి ఇంట్లోనూ విలాపమే వినిపిస్తోంది.

రోడ్డున పడ్డ వందలాది కుటుంబాలు

ఈ విపత్తు వల్ల ఇళ్లు నేలమట్టమవ్వడంతో, తలదాచుకోడానికి కూడా ఆసరా లేక వందలాది కుటుంబాలు రోడ్డున పడ్డాయి. చిన్నారులు ఆకలితో ఏడుస్తుండగా, వృద్ధులు శక్తిలేక కూలిపోతున్నారు. గాయాలపాలైన మహిళలు వైద్య సాయం కోసం ఎదురుచూస్తున్నారు. కూలిన ఇళ్ల శిథిలాల కింద నుంచి మృతదేహాలను వెలికి తీస్తున్న రక్షక బృందాల దృశ్యాలు హృదయాలను కలచివేస్తున్నాయి. ఈ దృశ్యాలు కేవలం ఒక దేశానికే కాకుండా, మానవాళికి గాయపరుస్తున్నాయి.

చావుబతుకుల మధ్య...

మాజీ మేయర్‌ జరీఫా ఘఫ్పారీ సోషల్‌ మీడియా ద్వారా చేసిన విజ్ఞప్తి మరింత మానవతా కోణాన్ని ప్రతిబింబిస్తోంది. "కునార్‌, నోరిస్థాన్‌, నంగర్హార్‌ ప్రాంతాల ప్రజలు చావుబతుకుల మధ్య ఉన్నారు. ఆహారం, మందులు, ఆశ్రయం అత్యవసరం. ఈ సమయంలో తాలిబన్‌ ప్రభుత్వానికి అవసరమైన వనరులు లేకపోవడం బాధాకరం. అందుకే అంతర్జాతీయ సమాజం ముందుకు రావాలి" అని ఆమె అభ్యర్థించారు.

క్రికెటర్‌ రహ్మానుల్లా గుర్బాజ్‌ కూడా తన హృదయాన్ని వ్యక్తం చేస్తూ బాధితుల కోసం ప్రార్థనలు చేశారు. "మరణించిన వారి ఆత్మలకు శాంతి కలగాలి, గాయపడిన వారు త్వరగా కోలుకోవాలి" అని భావోద్వేగంతో రాశారు.

సాయం కోసం ఎదురుచూపులు

ప్రకృతి విపత్తులు సరిహద్దులు చూడవు, మతం గాని జాతి గాని చూడవు. ఇవి కేవలం మనిషి బలహీనతను గుర్తు చేస్తాయి. అఫ్గానిస్థాన్‌ ప్రజలు ఎదుర్కొంటున్న ఈ బాధలో, ప్రపంచ మానవతా దృష్టి వారిపైనే నిలవాలి. ఆహారం, వైద్యం, ఆశ్రయం అందించడం ఈ క్షణంలో అత్యవసరం. ఎందుకంటే ప్రాణాలను కాపాడటం కంటే గొప్ప మానవతా ధర్మం మరొకటి లేదు.