Begin typing your search above and press return to search.

ఆర్టికల్ 370 రద్దుతో మార్పులు... తెరపైకి సుప్రీంలో ఆసక్తికర చర్చ!

ఈ నాలుగేళ్లలో అక్కడ వచ్చిన కొన్ని మార్పుల వివరాలు, ఈ సందర్భంగా సుప్రీం లో జరుగుతున్న వాదనలు, అమర్నాథ్ యాత్రకు కలిగిన ఆటంకాలు ఇప్పుడు చూద్దాం!

By:  Tupaki Desk   |   5 Aug 2023 5:56 AM GMT
ఆర్టికల్  370 రద్దుతో మార్పులు... తెరపైకి సుప్రీంలో ఆసక్తికర చర్చ!
X

జమ్మూకశ్మీర్ కు స్వయంప్రతిపత్తిని కల్పించిన ఆర్టికల్ 370 ని కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన విషయం తెలిసిందే. ఈ నిర్ణయానికి నేటితో నాలుగేళ్లు పూర్తయ్యాయి. జమ్మూకశ్మీర్ అభివృద్ధి కోసమే ఆర్టికల్ 370ని రద్దు చేశామని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. ఈ నాలుగేళ్లలో అక్కడ వచ్చిన కొన్ని మార్పుల వివరాలు, ఈ సందర్భంగా సుప్రీం లో జరుగుతున్న వాదనలు, అమర్నాథ్ యాత్రకు కలిగిన ఆటంకాలు ఇప్పుడు చూద్దాం!

సరిగ్గా నాలుగేళ్ల క్రితం ఆర్టిక‌ల్ 370ని ర‌ద్దు చేసిన కేంద్రం.. జమ్మూ, కశ్మీర్ లను రెండు కేంద్ర పాలిత ప్రాంతాలలుగా ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. త్వరలో ఎన్నికలు నిర్వహించి ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. ఈ నాలుగేళ్లలో ఆ ప్రాంతాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి.

జమ్మూ కశ్మీర్ లోని చీనాబ్ నది పై కేంద్ర ప్రభుత్వం రైల్వే బ్రిడ్జి నిర్మించింది. ఇది ప్రపంచంలోనే ఎత్తైన రైల్వే బ్రిడ్జిగా రికార్డయింది. ఈఫిల్ టవర్ కన్నా ఈ బ్రిడ్జి ఎత్తు 29 మీటర్లు ఎక్కువ కావడం గమనార్హం. జమ్మూ-కశ్మీర్ రీజియన్ లను కలుపుతూ ఈ బ్రిడ్జిని నిర్మించారు.

జమ్మూ కశ్మీర్ కు రెండు ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) దక్కాయి. ఇదే సమయంలో దాదాపు 75 ఏళ్ల తర్వాత శారదా మాత ఆలయంలో దీపావళి వేడుకలు.. 34 ఏళ్ల తర్వాత శ్రీనగర్ వీధుల్లో మొహర్రం ఊరేగింపు జరిగాయి! ఇదే క్రమంలో సుమారు 30 ఏళ్ల తర్వాత సినిమా హాల్ ప్రారంభమైంది.

ఇక భూతల స్వర్గం గా చెప్పే జమూ కాశ్మీర్ లలో గతం లో ఎన్నడూ లేనంతగా టూరిజం జరిగింది. ఈ ఏడాది మొదటి రెండు నెలల్లోనే సుమారు 4.70 లక్షల మంది పర్యాటకులు జమ్మూ కశ్మీర్ ను సందర్శించగా.. గడిచిన 7 నెలల్లో 1.27 కోట్ల మంది పర్యటించారు.

అమర్నాథ్‌ యాత్రకు బ్రేక్:

2023 ఆగస్టు 5న అమర్నాథ్‌ యాత్రను రద్దు చేస్తున్నట్లుగా అధికారులు వెల్లడించారు. ఆర్టికల్ 370 , 35ఏ రద్దు చేసి ఆగస్టు 5కు నాలుగేళ్లు పూర్తయిన క్రమంలో ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఈ యాత్రను రద్దు చేసినట్లుగా ప్రకటించారు.

ఆర్టికల్ 370, 35ఏ రద్దు నాలుగో వార్షికోత్సవం సందర్భంగా వివిధ గూఢచార సంస్థల నుండి అందిన భద్రతా ఇన్‌ పుట్‌ లను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా అధికారులు తెలిపారు.

ఛీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ వర్సెస్ కపిల్ సిబల్:

ఆర్టికల్ 370 రద్దు విషయమై సుప్రీం లో తాజాగా ఛీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్, కపిల్ సిబల్ మధ్య జరిగిన ఆసక్తికరమైన వాదన జరిగింది. జమ్ము కశ్మీర్‌ కు ప్రత్యేక హోదా కల్పించే ఆర్టికల్ 370 రద్దుకు వ్యతిరేకంగా దాఖలైన పిటీషన్‌ పై సుప్రీంకోర్టులో విచారణ జరుగుతోంది.

ఈ సందర్భంగా జమ్ము కశ్మీర్ ప్రజలు కోరుకున్న ప్రత్యేక హోదాను కల్పించే ఆర్టికల్ 370 రద్దు చేసే వ్యవస్థ ఉందా లేదా అనేది ప్రశ్నార్ధకంగా మారింది. ఒకవేళ ఆ అధికారమే లేకుంటే రాజ్యాంగ మౌళిక స్వరూపం తరహా లో ఆర్టికల్ 370కు ప్రత్యేక కేటగరీ సృష్టిస్తున్నామా అని సందేహం వ్యక్తం చేసింది సుప్రీంకోర్టు.

ఈ సందర్భంగా... ఆర్టికల్ 370 రద్దు చేయడం లేదా మార్పు చేసే అధికారం 1957లో రద్దైన "జమ్ము కశ్మీర్ రాజ్యాంగ సభ"కు మాత్రమే ఉందని తెలిపిన కపిల్ సిబల్... ఇప్పుడు ఆ సభ లేనందున ప్రత్యేక హోదా తొలగించే హక్కు కూడా లేదని వాదించారు. దీంతో.. కపిల్ సిబల్ వాదనపై జస్టిస్ డీవై చంద్రచూడ్ జోక్యం చేసుకున్నారు.

రాజ్యాంగ సవరణ చేసే అధికారాన్ని పార్లమెంట్‌ కు కట్టబెట్టే ఆర్టికల్ 368 కిందకు కూడా ఇది రాదా అని ప్రశ్నించారు. ఆర్టికల్ 370 రద్దుకు అసలైన, సరైన ప్రక్రియ ఏంటని ప్రశ్నించించారు. ఇందులో మొదటిప్రశ్నకు కపిల్ సిబల్ "రాదనే సమాధానమిచ్చారు".

అనంతరం ఆర్టికల్ 370ని సరైన పద్ధతి లో రద్దు చేసేందుకు సమాధానాలు వెతకడం కాదని.. కేంద్ర ప్రభుత్వం ఈ ఆర్టికల్ రద్దుకు అనుసరించిన పద్ధతి సరైందా కాదా అనేది తేల్చాలని కపిల్ సిబల్ బదులిచ్చారు. ఆర్టికల్ 370 మార్పులనేవి కేవలం రాజ్యాంగ సభతోనే సాధ్యమని.. పార్లమెంట్‌ తో కాదనేది కపిల్ సిబల్ అంతిమంగా సమాధానమిచ్చారు.

దీంతో... ఇప్పుడీ అంశం పై కేంద్ర ప్రభుత్వం తమ వాదనలు వినిపించాల్సి ఉంది. ఈ కేసు లో తదుపరి వాదనలు ఆగస్టు 8న జరగనున్నాయి.