Begin typing your search above and press return to search.

తీవ్రంగా అవమానించి.. 'భారత రత్నం' అంటే చెల్లుతుందా!

ఆడ్వాణీ బీజేపీ వ్యవస్థాపకుల్లో ఒకరు. కేవలం 2 సీట్లకు పరిమితమైన పార్టీని 200 సీట్లకు చేర్చినవారిలో ఆయన ఒకరు

By:  Tupaki Desk   |   3 Feb 2024 11:06 AM GMT
తీవ్రంగా అవమానించి.. భారత రత్నం అంటే చెల్లుతుందా!
X

సహజంగా భారత రత్న అవార్డును గణతంత్ర దినోత్సం ముందు రోజు ప్రకటిస్తారు. దేశ అత్యున్నత పౌర పురస్కారమైన ఈ అవార్డును దేశం గణతంత్రంగా మారిన సందర్భాన్ని కలిసివచ్చేలా ప్రకటిస్తారు. అంటే, విదేశీ పాలన నుంచి విముక్తి పొందిన మనం.. ఒక దేశంగా ఎంతటి శక్తిసామర్థ్యాలు సాధించామో పరోక్షంగా చెప్పడం అన్నమాట. అయితే, ఈఏడాది భారత రత్న అవార్డును గణతంత్ర దినోత్సవాన బిహార్ మాజీ సీఎం కర్పూరీఠాకూర్ ప్రకటించారు. వారం వ్యవధిలోనే బీజేపీ సీనియర్ నేత ఎల్ కే ఆడ్వాణీకి ఇచ్చారు.

అరెరె.. ఆయనను మర్చిపోయామే..?

ఆడ్వాణీ బీజేపీ వ్యవస్థాపకుల్లో ఒకరు. కేవలం 2 సీట్లకు పరిమితమైన పార్టీని 200 సీట్లకు చేర్చినవారిలో ఆయన ఒకరు. 97 ఏళ్ల ఆడ్వాణీ జీవత చరమాంకంలో ఉన్నారు. 1927 నవంబరు 8న అవిభక్త భారత్‌ లోని, ప్రస్తుతం పాకిస్థాన్ లో ఉన్నకరాచీ పుట్టిన లాల్‌ కృష్ణ అడ్వాణీ 14 ఏళ్ల వయసులోనే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్)లో చేరారు. దేశ విభజనకు ప్రస్తుతం ఉన్న సజీవ సాక్షుల్లో ఆయన ఒకరు. కరాచీలోని సెయింట్‌ పాట్రిక్స్‌ హైస్కూల్‌లో చదివి.. అక్కడి హైదరాబాద్‌ లో డీజీ నేషనల్ కాలేజీలో న్యాయ విద్య పూర్తి చేశారు. 1941లో పద్నాలుగేళ్ల వయసులో సంఘ్ లో చేరారు. 1947లోనే సంఘ్ కరాచీ విభాగం కార్యదర్శిగా విధులు నిర్వర్తించారు. అప్పటికి ఆయనకు 20 ఏళ్లు మాత్రమే. అదే సమయంలో దేశ విభజనతో భారత్‌ కు వచ్చేశారు. రాజస్థాన్‌ లో ప్రచారక్‌ గా పనిచేశారు. 1957లో ఢిల్లీ వెళ్లి జన సంఘ్‌ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టారు. 1966లో ఢిల్లీ మెట్రోపాలిటన్‌ కౌన్సిల్‌ మధ్యంతర ఎన్నికల్లో పోటీకి దిగి విజయం సాధించారు. ఆ తర్వాత కౌన్సిల్‌ అధ్యక్షుడిగానూ గెలిచారు. 1970-72లో జన సంఘ్‌ ఢిల్లీ చీఫ్. సంఘ్ పత్రిక ఆర్గనైజర్‌ లో నేషనల్ ఎగ్జిక్యూటివ్‌ సభ్యుడిగా పనిచేశారు. ఇక అప్పటినుంచి ఆయన చురుకైన రాజకీయ ప్రస్థానం మొదలైంది. 1970లో ఢిల్లీ నుంచి,1976లో గుజరాత్‌ నుంచి రాజ్యసభకు వెళ్లారు. 1977-80లో జనతా పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. కేంద్ర ప్రభుత్వంలో 1977-79మధ్య సమాచార, ప్రసార శాఖ మంత్రిగా పనిచేశారు. 1980లో జనతా పార్టీకి రాజ్యసభలో ప్రతిపక్ష నేతగా వ్యవహరించారు. 1980లో వాజ్‌ పేయీతో కలిసి బీజేపీని స్థాపించారు. 1982లో మధ్యప్రదేశ్‌ నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు. 1996 ఎన్నికల్లో బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించింది. వాజ్‌పేయీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. 1998లో మిత్రపక్షాలతో కలిసి మళ్లీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. 1999 ఎన్నికల్లో గాంధీనగర్‌ నుంచి అడ్వాణీ గెలిచారు.

ప్రధానిగా త్రుటిలో చాన్స్ మిస్

2002 సమయంలో అడ్వాణీని ప్రధాని చేయాలని సంఘ్ భావించింది. కానీ, ఎందుకనో ఉప ప్రధానితో సరిపెట్టారు. ఇక 2004 ఎన్నికల్లో జీజేపీ ఓటమితో ఆయన ప్రతిపక్ష నాయకుడిగా మిగిలారు. 2009లోనూ పార్టీ విజయం సాధించకపోవడంతో ప్రధాని కావాలన్న కల నెరవేరలేదు. 2014లోనూ గాంధీనగర్‌ నుంచి గెలిచిన అడ్వాణీ ఆ తర్వాత వర్తమాన రాజకీయాల్లో లేరు.

హిందూత్వ ప్రతినిధి

అడ్వాణీని హిందూత్వ ప్రతినిధిగా దేశంలోని కోట్లాదిమంది భావిస్తారు. బీజేపీకి 'హిందూత్వ' రంగు అద్దిందే ఆయన. అలా అలా 2 సీట్ల పార్టీని 200 సీట్లు దాటించారు. కాగా.. అయోధ్యలో రామ మందిరాన్ని నిర్మించాలంటూ 1989లో దేశవ్యాప్త రథయాత్రకు శ్రీకారం చుట్టారు. ఇలా ఆయన ఆరు యాత్రలు చేశారు. ఇదంతా 1991 ఎన్నికల్లో కలిసొచ్చింది. లోక్‌ సభలో రెండో అతి పెద్ద పార్టీగా బీజేపీ అవతరించింది. అడ్వాణీ ప్రతిపక్ష నేతగా ఆయన బాధ్యతలు చేపట్టారు. 1992లో బాబ్రీ విధ్వంసం.. కాషాయ పార్టీని తొలుత ఉత్తరప్రదేశ్‌లో, ఆ తర్వాత కేంద్రంలో అధికారానికి దగ్గర చేసింది. అయితే, 2005లో ప్రతిపక్ష నేతగా ఉంటూ పాకిస్థాన్ లో పర్యటించిన అడ్వాణీ ఆ దేశ జాతిపిత జిన్నాను పొగడడం సంఘ్ కు కోపం తెప్పించింది. దీంతోనే ఆయన రాజకీయంగా వెనుకబాటుకు గురయ్యారు.

పక్కనపెట్టేసి.. ఇప్పుడు గౌరవిస్తారా?

2002 గుజరాత్ అల్లర్ల సమయంలో ముఖ్యమంత్రి గా ఉన్న మోదీని అప్పటి ప్రధాని వాజ్ పేయీ తప్పుబట్టారు. ఓ దశలో మోదీ రాజీనామా చేయాల్సిన పరిస్థితి వచ్చింది. కానీ, అడ్వాణీ అడ్డు చక్రం వేశారు. అదే జరిగి ఉంటే మోదీ రాజకీయ జీవితం దాదాపు ముగిసేదే. కానీ, మోదీ 2014లో ప్రధాని అయ్యాక అడ్వాణీని పక్కనపెట్టారు. గాంధీనగర్ ఎంపీగా ఉన్న ఆయనను కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకోలేదు. ప్రణబ్ ముఖర్జీ, రామ్ నాథ్ కోవింద్ దిగిపోయాక రాష్ట్రపతిగానూ అవకాశం ఇవ్వలేదు. అడ్వాణీని కనీసం రామమందిర ప్రారంభం సందర్భంగానూ సరిగా పిలవలేదు. అయోధ్య ట్రస్టు కాకుండా వీహెచ్ పీ ద్వారా ఆహ్వానం పంపారు. చివరకు ఆయన వయో భారం, చలి కారణంగా రాలేదని చెప్పారు. చివరకు భారత రత్న విషయంలోనూ అంతే చేశారు. కర్పూరీ ఠాకూర్ కు ఇవ్వడాన్ని తప్పుబట్టలేం కానీ.. తాను ఈ స్థితిలో ఉండేందుకు కారణమైన అడ్వాణీని మోదీ విస్మరించడమే చర్చనీయాంశమైంది. అయితే, కర్పూరీకి ఇచ్చి.. అడ్వాణీని విస్మరించారని ఉత్తరాదిన కొన్ని వర్గాలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నాయి. దీంతోనే నష్ట నివారణకు దిగినట్లు తెలుస్తోంది. అంతేకాక.. మోదీ మీడియా ముందుకు వచ్చి ప్రకటన చేయకుండా కేవలం ట్వీట్ చేసి వదిలేశారు.