Begin typing your search above and press return to search.

వ్యభిచారం కేసులో స్త్రీపురుషులిద్దరికీ శిక్ష... పార్లమెంటరీ కమిటీ ప్రతిపాదన?

స్వలింగ సంపర్కాన్ని మళ్లీ నేరంగా పరిగణించాలని పార్లమెంటరీ కమిటీ ప్రభుత్వానికి సిఫారసు చేసే అవకాశం ఉందని అంటున్నారు.

By:  Tupaki Desk   |   27 Oct 2023 4:34 PM GMT
వ్యభిచారం కేసులో స్త్రీపురుషులిద్దరికీ శిక్ష... పార్లమెంటరీ కమిటీ ప్రతిపాదన?
X

ప్రస్తుతం ఉన్న క్రిమినల్ చట్టాల స్థానంలో మూడు బిల్లులను సమీక్షించిన పార్లమెంటరీ ప్యానెల్ శుక్రవారం జరిగిన సమావేశంలో కీలక విషయాలను చర్చించి, ముఖ్యమైన సవరణలను సూచించిందని తెలుస్తుంది. బీజేపీ ఎంపి బ్రిజ్ లాల్ నేతృత్వంలోని హోం వ్యవహారాల పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ తన ముసాయిదా నివేదికలో వ్యభిచారం, స్వలింగ సంపర్కాన్ని మళ్లీ నేరంగా పరిగణించాలని ప్రభుత్వానికి సిఫారసు చేసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది.

అవును... వలసవాద కాలం నాటి క్రిమినల్ చట్టాల సవరణలో భాగంగా వ్యభిచారం, స్వలింగ సంపర్కాన్ని మళ్లీ నేరంగా పరిగణించాలని పార్లమెంటరీ కమిటీ ప్రభుత్వానికి సిఫారసు చేసే అవకాశం ఉందని అంటున్నారు. భారతీయ శిక్షాస్మృతి – క్రిమినల్ ప్రొసీజర్ కోడ్, భారతీయ సాక్ష్యాధారాల చట్టం – భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక్ సురక్షా సంహిత - భారతీయ సాక్ష్యా అధినియం వంటి మూడు బిల్లులను కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే.

ఈ మూడు బిల్లులను మూడు నెలల గడువుతో ఆగస్టు నెలలో తదుపరి పరిశీలన కోసం బీజేపీ ఎంపీ బ్రిజ్ లాల్ నేతృత్వంలోని హోం వ్యవహారాల స్టాండింగ్ కమిటీకి పంపారు. ఈ నేపథ్యంలో శుక్రవారం సమావేశమైన కమిటీ.. మరో మూడు నెలలు పొడగించాలని ప్రతిపక్ష సభ్యులు కోరడంతో ముసాయిదా రిపోర్టును ఆమోదించలేదు. దీంతో తదుపరి సమావేశం నవంబర్ 6న జరగనుంది.

ఇందులో భాగంగా... 2018లో వ్యభిచారంపై సుప్రీంకోర్టు కొట్టేసిన చట్టాన్ని పునరుద్ధరించడం లేదా కొత్త చట్టాన్ని ఆమోదించడం ద్వారా వ్యభిచారాన్ని మళ్లీ క్రిమినల్ నేరంగా పరిగణించాలని కమిటీ సిఫార్సు చేస్తుందని భావిస్తున్నారు. కాగా.. 2018లో ఐదుగురు సభ్యుల బెంచ్ వ్యభిచారం నేరం కాదు, కాకూడదని తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇదే సమయంలో... ఇది సివిల్ నేరానికి, విడాకులకు కారణమవుతుంది అని అప్పటి ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రా అన్నారు.

ఇదే క్రమంలో... భర్త అనుమతి లేకుండా వివాహితతో ఓ వ్యక్తి సంబంధం పెట్టుకుని.. ఆ నేరం రుజువైతే సదరు వ్యక్తికి ఐదేళ్లు జైలు శిక్ష అని చట్టం చెబుతోంది! అయితే ఈ నేరంలో స్త్రీకి శిక్ష పడదు. అయితే... వ్యభిచారంపై సుప్రీం కొట్టేసిన నిబంధనలను తిరిగి తీసుకువస్తే మాత్రం... లింగ తటస్థంగా ఉండాలని నివేదిక సిఫారసు చేసే అవకాశంఉందని అంటున్నారు. అంటే వ్యభిచారం కేసులో స్త్రీ, పురుషులు ఇద్దరు శిక్షను ఎదుర్కోవాల్సి ఉంటుందన్నమాట!

ఇదే సమయంలో... స్వలింగ సంపర్కాన్ని నేరంగా పరిగణించే బ్రిటిష్ కాలం నాటి నిబంధనను ఐదేళ్ల క్రితం సుప్రీంకోర్టు కూడా కొట్టివేసింది! దీంతో... 377, 497 రెండింటినీ నేరరహితం చేయడాన్ని వ్యతిరేకిస్తూ.. ఐపీసీ లోని సెక్షన్ 377ని తిరిగి ప్రవేశపెట్టడం, కొనసాగించడం తప్పనిసరి అని కమిటీ ప్రభుత్వానికి సిఫార్సు చేసే అవకాశం కూడా ఉందని అంటున్నారు!

కాగా... భారతదేశంలో నేర న్యాయశాస్త్రం బ్యాక్ బోన్ ను పూర్తిగా మార్చే లక్ష్యంతో మూడు ప్రతిపాదిత క్రిమినల్ చట్టాలను పార్లమెంటు వర్షాకాల సమావేశంలో ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా... భారతీయ శిక్షాస్మృతి (ఐపీసీ), ది కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ - 1973, ఇండియన్ ఎవిడెన్స్ చట్టం - 1872లను వరుసగా భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక్ సురక్షా సంహిత, భారతీయ సాక్ష్యా అధినియంతో భర్తీ చేయాలని కేంద్రం కోరింది.