Begin typing your search above and press return to search.

రిపోర్టు: గుర్తింపు లేని పార్టీల ఆదాయం పెరిగిన లెక్క తెలిస్తే అవాక్కే

ఆసక్తికర అంశం ఒకటి వెలుగు చూసింది. అసోసియేషన్ ఫర్ డెమాక్రటిక్ రిఫామ్స్ సింఫుల్ గా చెప్పాలంటే ఏడీఆర్ సంస్థ దేశంలోని రాజకీయ పార్టీల ఆదాయం వ్యవహారాల మీద అధ్యయనం చేసింది.

By:  Tupaki Desk   |   19 July 2025 1:00 PM IST
రిపోర్టు: గుర్తింపు లేని పార్టీల ఆదాయం పెరిగిన లెక్క తెలిస్తే అవాక్కే
X

ఆసక్తికర అంశం ఒకటి వెలుగు చూసింది. అసోసియేషన్ ఫర్ డెమాక్రటిక్ రిఫామ్స్ సింఫుల్ గా చెప్పాలంటే ఏడీఆర్ సంస్థ దేశంలోని రాజకీయ పార్టీల ఆదాయం వ్యవహారాల మీద అధ్యయనం చేసింది. దేశంలోని ఎన్నికల సంఘం రికార్డుల్లో నమోదైనప్పటికీ.. ఎలాంటి గుర్తింపు లేని రాజకీయ పార్టీల ఆదాయం భారీగా పెరిగిన ఆసక్తికర విషయాన్ని వెల్లడించింది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో గుర్తింపు లేని రాజకీయ పార్టీల ఆదాయం ఏకంగా 223 శాతం పెరిగినట్లుగా గుర్తించారు. మొత్తం పార్టీల్లో 73 శాతం పార్టీలు తమ ఆదాయ వివరాల్ని వెల్లడించలేదు. మిగిలిన 26.7 శాతం పార్టీలు (సుమారు 739 వరకు) మాత్రం తమ ఆదాయ వివరాల్ని వెల్లడించాయి.

ఈ నేపథ్యంలో వీటిపై అధ్యయనం చేసిన సదరు సంస్థ పలు అంశాల్ని వెల్లడించింది. దేశంలో గుర్తింపు లేని రాజకీయ పార్టీల్లో అత్యధికం ఉత్తరప్రదేశ్.. ఢిల్లీ.. బిహార్ రాష్ట్రాల్లోనే ఉన్నట్లుగా పేర్కొన్నారు. పంజాబ్ లో మొత్తం 74 గుర్తింపు లేని రాజకీయ పార్టీలు ఉంటే.. వాటిల్లో ఒక్కటీ తమ ఆడిట్ నివేదికల వివరాల్ని బయటపెట్టలేదని చెబుతున్నారు. గుజరాత్ లో గుర్తింపు లేని రాజకీయ పార్టీల మొత్తం ఆదాయం రూ.1158.11 కోట్లుగా పేరకొన్నారు.

అదే సమయంలో చాలామందికి పరిచయం లేని భారతీయ నేషనల్ జనతాదళ్ తమ ఆదాయాన్నిరూ.576.45 కోట్లుగా చూపింది. రాజకీయ పార్టీలకు రూ.20 వేల కంటే అధిక విలువ ఉన్న మొత్తాల్ని విరాళాలుగా పరిగణిస్తారు. ఆసక్తికరమైన మరో అంశం ఏమంటే.. రూ.407 కోట్ల ఆదాయం వచ్చిన న్యూ ఇండియా యునైటెడ్ పార్టీకి అందిన విరాళాల్లో వంద శాతం పెద్ద విరాళాలుగా ఏడీఆర్ గుర్తించింది.మరో అంశం ఏమంటే.. అత్యధిక ఆదాయం అందుకున్న పార్టీల్లో ఎక్కువగా 2015 తర్వాతే ఏర్పాటు చేసినట్లు గుర్తించారు.

మరో విచిత్రమైన అంశం ఏమంటే.. భారతీయ నేషనల్ జనతాదళ్ అనే పార్టీకి 2019-20 నుంచి 2023-24 మధ్య కాలంలో రూ.957.4 కోట్లు విరాళాల రూపంలో అందాయి.అంతేకాదు.. ఈ పార్టీ తరహీలోనే సత్యావాదీ రక్షక పార్టీకి రూ.85.6 కోట్లు.. ఈ పార్టీకి 2023-24లో అయితే ఏకంగా రూ.3309 కోట్లకు పైనే ఆదాయం లభించింది. విచిత్రమైన అంశం ఏమంటే.. ఇంత భారీగా విరాళాలు అందుకునే పార్టీలు.. ఎన్నికల్లో మాత్రం ఇప్పటివరకు పోటీ చేయలేదు. ఇదో విచిత్రంగా చెప్పక తప్పదు. తాము చేసిన అధ్యయన వివరాల్ని వెల్లడించిన ఏడీఆర్ కీలక సూచన చేసింది. ఐదేళ్లకు పైగా క్రియాశీలకంగా లేని పార్టీలను జాబితాలో నుంచి తొలగించాలని కోరింది. మరి.. దీనికి ఎన్నికల సంఘం ఎలా రియాక్టు అవుతుందో చూడాలి.