Begin typing your search above and press return to search.

ఫస్ట్ ప్లేస్ లో బీఆర్ఎస్.. 4వ స్థానంలో టీడీపీ, ఆ తర్వాతే వైసీపీ.. ఈ లెక్కలు ఏంటో తెలుసా?

దేశంలోని ప్రాంతీయ పార్టీల ఆదాయంపై అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్(ADR) నివేదిక విడుదలైంది

By:  Tupaki Desk   |   11 Sept 2025 10:23 AM IST
ఫస్ట్ ప్లేస్ లో బీఆర్ఎస్.. 4వ స్థానంలో టీడీపీ, ఆ తర్వాతే వైసీపీ.. ఈ లెక్కలు ఏంటో తెలుసా?
X

దేశంలోని ప్రాంతీయ పార్టీల ఆదాయంపై అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్(ADR) నివేదిక విడుదలైంది. ఇందులో పలు సంచలన, ఆసక్తికర విశేషాలు బయపడ్డాయి. మొత్తం 40 ప్రాంతీయ పార్టీలు తమ ఆదాయ, వ్యయాలు బయటపెట్టగా, తొలి ఐదు స్థానాల్లో మూడు తెలుగు రాష్ట్రాలకు చెందిన పార్టీలే ఉండటం విశేషం. ఇందులో ఒకటి అధికార పార్టీ కాగా, మిగిలిన రెండు విపక్షాలే. అయితే దేశంలో అత్యధిక ఆదాయం ఉన్న పార్టీగా తెలంగాణకు చెందిన బీఆర్ఎస్ ఫస్ట్ ప్లేసులో నిలిచింది. దీని తర్వాత పశ్చిమబెంగాల్ అధికార పార్టీ త్రుణమూల్ కాంగ్రెస్ నిలిచింది.

దేశంలో రాజకీయ పార్టీల పనితీరు, నేతల నేర చరిత్ర, ఇతర అంశాలపై ఏడీఆర్ అధ్యయనం చేస్తుంటుంది. ఇటీవల నేరచరితులు, క్రిమనల్ కేసులు నమోదైన నేతల జాబితా విడుదల చేసిన ఏడీఆర్.. తాజాగా సంపన్న పార్టీల జాబితా విడుదల చేసింది. దేశంలో మొత్తం 40 ప్రాంతీయ పార్టీల ఆదాయం రూ.2,532 కోట్లుగా చూపింది. 2023-24 ఆర్థిక సంవత్సరానికి చెందిన ఈ లెక్కల్లో ఆయా పార్టీలు ఎన్నికల బాండ్ల ద్వారా ఆదాయం సేకరించినట్లు తెలియజేసింది.

ఏడీఆర్ రిపోర్టు ప్రకారం తెలంగాణకు చెందిన భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పార్టీ 2023-24 ఆర్థిక సంవత్సరంలో ఎన్నికల బాండ్ల ద్వారా రూ.685.51 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. ప్రాంతీయ పార్టీలు అన్నింటిలోనూ బీఆర్ఎస్ పార్టీకే ఎక్కువ విరాళాలు వచ్చినట్లు ఏడీఆర్ తన నివేదికలో స్పష్టం చేసింది. దేశంలో అన్ని పార్టీల మొత్తం ఆదాయంలో ఐదు పార్టీలకు కలిపి 81 స్థానం దక్కించుకోగా, అందులో బీఆర్ఎస్ ఎక్కువ ఆదాయం సంపాదించినట్లు తాజా నివేదిక చెబుతోంది.

ఇక బీఆర్ఎస్ తర్వాతి స్థానంలో త్రుణమూల్ కాంగ్రెస్ రూ.646.39 కోట్లతో రెండో స్థానంలో నిలిచింది. ఒడిసాలోని ప్రధాన ప్రతిపక్షం బీజేడీ రూ.297.81 కోట్లతో మూడో స్థానం దక్కించుకున్నాయి. త్రుణమూల్ కాంగ్రెస్, బీజేడీ సుదీర్ఘకాలం ఆయా రాష్ట్రాల్లో అధికారంలో కొనసాగిన విషయం తెలిసిందే. బెంగాల్ లో త్రుణమూల్ ఇప్పటికీ అధికారంలో ఉండగా, బిజూ జనతాదళ్ గత ఏడాది జరిగిన ఎన్నికల్లో అధికారం కోల్పోయింది.

మరోవైపు ఏపీలో అధికార పక్షంలో కీలక భాగస్వామి అయిన టీడీపీ ఈ జాబితాలో నాలుగో స్థానంలో నిలిచింది. రూ.285.07 కోట్ల విరాళాలను సేకరించిన టీడీపీ దేశంలోనే సంపన్న పార్టీల్లో నాలుగోదిగా గుర్తింపు పొందింది. టీడీపీ తర్వాత వైసీపీ ఐదో స్థానంలో నిలిచింది. వైసీపీకి రూ.191.04 కోట్ల ఆదాయం వచ్చింది. అయితే వైసీపీ తన ఆదాయం కన్నా ఎక్కువ ఖర్చు చేసినట్లు ఏడీఆర్ నివేదికలో హైలెట్ చేసింది. మొత్తం ఆదాయం కంటే సుమారు 55 శాతం అధికంగా వైసీపీ ఖర్చు చేసినట్లు చూపింది. ఇలా డీఎంకే, సమాజ్ వాదీ, జనతాదళ్ (యు)వంటి 12 పార్టీలు తమ ఆదాయాన్ని మించి ఖర్చు చేయడం విశేషం. అదేవిధంగా ఆదాయం నుంచి ఖర్చు చేయని పార్టీలు కూడా కొన్ని ఉన్నాయి. బీఆర్ఎస్ తన ఆదాయంలో రూ.430.60 కోట్లు ఖర్చు చేయలేదని నివేదించింది.