Begin typing your search above and press return to search.

'క‌డ‌ప రెడ్డ‌ప్ప‌' ఎవ‌రి మాటా విన‌డా ..!

బిజెపి నాయకుడు, కడప జిల్లా జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి దూకుడు చూస్తుంటే ఆయన ఎవరికీ అంతుచిక్కడం లేదు.

By:  Tupaki Desk   |   22 April 2025 11:49 AM IST
క‌డ‌ప రెడ్డ‌ప్ప‌ ఎవ‌రి మాటా విన‌డా ..!
X

బిజెపి నాయకుడు, కడప జిల్లా జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి దూకుడు చూస్తుంటే ఆయన ఎవరికీ అంతుచిక్కడం లేదు. ఆయన ఎవరి మాట వినిపించుకోవ‌డ‌మూ లేదు. ఇప్పటికి రెండుసార్లు ఆయన పతాకశీర్షకల్లో వివాదాస్పద వార్తల్లో నిలిచారు. ఈ రెండు విషయాలు కూడా సిమెంట్ కంపెనీలను టార్గెట్ గా చేసుకొని ఆయన సాగించిన వ్యవహారాలే కావడం గమనార్హం. గతంలో టిడిపి నాయకుడు జెసి ప్రభాకర్ రెడ్డితో వివాదం పెట్టుకుని ఫ్లై యాష్ విషయంలో ఆయన రోడ్డు ఎక్కారు.

దీనిని చంద్రబాబు చాలా వరకు కంట్రోల్ చేయాలని అనుకుని ప్రయత్నం అయితే చేశారు. అయితే ఈ విషయంలో ప్రభాకర్ రెడ్డి తప్పుకున్నారు కానీ ఆదినారాయణ రెడ్డి మాత్రం తన హ‌వాను కొనసాగిస్తున్నా రు. ఆయనకు కిట్టని వారు ఎవరు నియోజకవర్గంలో ఉండటానికి వీలు లేదని, ఆయనకు నచ్చని వారు ఎవరు కాంట్రాక్టులు చేయకూడదని పెద్ద ఎత్తున దూకుడు ప్రదర్శిస్తున్నారు. కానీ రాజకీయాల్లో నచ్చని వారు కిట్టని వారు ఉంటే ఉండొచ్చు వ్యాపార పరంగా చూసుకున్నప్పుడు ఎవరి వ్యాపారాలు వారివి. ఈ విషయంలో ఆదినారాయణ రెడ్డి చేస్తున్న వ్యవహారం అటు బీజేపీకి ఇటు టిడిపికి కూడా ఇబ్బందిగానే మారింది.

పోనీ ఆయనను కంట్రోల్ చేద్దామంటే రాష్ట్ర బీజేపీ నాయకులకు ఆయనకు మధ్య భారీ గ్యాప్ పెరిగిపోయింది. ముఖ్యంగా రాష్ట్ర బిజెపి అధ్యక్షురాలు పురందేశ్వరి జిల్లాకు వచ్చినా, పార్టీ కార్యక్రమాలు నిర్వహించినా ఆదినారాయణ రెడ్డి డుమ్మా కొడుతున్నారు. పైగా అసలు పట్టించుకోవడమే లేదు. మీరు నాకు చెప్పేది ఏంటి? నేను పార్టీలో మీ అందరికన్నా ముందే ఉన్నాను అన్నట్టుగా ఆయన సందేశాలు పంపిస్తున్నారు. దీంతో పురందేశ్వరి కూడా మౌనం వహిస్తున్నారు.

అనంతపురం జిల్లాలో మంత్రి సత్య కుమార్ యాదవ్ ఉన్నప్పటికీ ఆయన ఇలాంటి విషయాల్లో జోక్యం చేసుకొని తన పేరుని చెడగొట్టుకునే ఉద్దేశం లేనట్టుగానే వ్యవహరిస్తున్నారు. తాజాగా అల్ట్రాటెక్ సిమెంట్ విషయంలో అన్ని కాంట్రాక్టులు తమకే ఇవ్వాలని వైసిపి నాయకులకు ఒక్కటి కూడా ఇవ్వడానికి వీల్లేదని హుకుమ్‌ జారీ చేశారు ఆది. ఇది పెను విభాగానికి దారితీసింది. ఎందుకంటే వైసిపి హయాంలో అల్ట్రాటెక్ సిమెంట్ కు కొన్ని అనుమతులు మంజూరు చేసిన మాట వాస్తవం.

ఇది అసంబద్ధంగా ఇచ్చిన అనుమతులు కావు. అధికారికంగానే ప్రభుత్వం జీవోలు జారీ చేసి అల్ట్రాటెక్ సిమెంట్‌కు కొన్ని గ‌నుల‌ను కేటాయించింది. దీంతో తమకు అనుకూలంగా ఉన్న వైసిపి నాయకులకు అల్ట్రాటెక్ సంస్థ కొన్ని కాంట్రాక్టులు కేటాయించింది. ఇప్పుడు వాటిని రద్దు చేసుకుని అన్నీ తన వారికే ఇవ్వాలని వైసిపి నేతలు ఒక్కరు కూడా కాంట్రాక్టులు చేయడానికి వీలు లేదని ఆదినారాయణ రెడ్డి పట్టుబడుతున్నారు. ఇదే ఇప్పుడు పెద్ద వివాదంగా మారిపోయింది.

ఇది రాజకీయంగా అటు బిజెపికి, ప్ర‌భుత్వ‌ పరంగా టిడిపికి కూడా చాలా నష్టం కలిగిస్తోంది. సాధారణంగా ఒక నాయకుడు తప్పు చేస్తే పార్టీ నిర్దేశం ప్రకారం తనను తాను మార్చుకోవాలి. లేదా పార్టీ చెప్పినట్టు అయినా వినాలి. ఈ రెండు విషయాల్లోనూ ఆదినారాయణ రెడ్డి ధిక్కారస్వరాన్ని వినిపిస్తున్నారు. దీంతో ఆయనకు చెప్పేందుకు కూడా ఎవరూ సాహసించడం లేదు. పైగా చెప్పిన వారిపై బండబూతులతో విరుచుకుపడుతున్నారని సోషల్ మీడియాలో తీవ్రంగా విమర్శలు చేయిస్తున్నారని స్థానికంగా పెద్ద చర్చ నడుస్తోంది.

దీంతో ఆదిని అదుపు చేయడం ఎవరి వల్ల కావడం లేదని బిజెపి నాయకులు చెబుతున్నారు. మరి ఈ పరిస్థితి ఇలాగే ఉంటే బిజెపి.. రాయలసీమలో అవినీతి పార్టీగా పేరు తెచ్చుకోవడం ఖాయమని తెలుస్తోంది. ఇటు ప్రభుత్వం పరంగా కూడా ఇంత జరుగుతున్నా చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారన్న విమర్శలు కూడా వస్తున్నాయి. ఈ పరిణామాలను దృష్టిలో పెట్టుకొని ఆదినారాయణ రెడ్డిని అదుపు చేయాలని పార్టీ నాయకులు కోరుతున్నారు. మరి ఈ విషయంలో ఎవరు జోహ్యం చేసుకుంటారు? ఎవరు ఆయన్ను అదుపు చేస్తారో? చూడాలి.