కూటమి కమ్మగా ఉంది...బీజేపీ నేత ఆది సంచలన వ్యాఖ్యలు
కాంగ్రెస్ లో పుట్టి వైసీపీలో కొనసాగి టీడీపీ మీదుగా బీజేపీలో చేరిన కడప జిల్లా జమ్మలమడుగు ఆదినారాయణ రెడ్డి అంటే రాజకీయాల గురించి అవగాహన ఉన్న వారికి తెలిసిన విషయమే.
By: Satya P | 8 Feb 2026 5:01 PM ISTకాంగ్రెస్ లో పుట్టి వైసీపీలో కొనసాగి టీడీపీ మీదుగా బీజేపీలో చేరిన కడప జిల్లా జమ్మలమడుగు ఆదినారాయణ రెడ్డి అంటే రాజకీయాల గురించి అవగాహన ఉన్న వారికి తెలిసిన విషయమే. హాట్ కామెంట్స్ చేయడంతో ముందుంటారు. తాజాగా ఆదివారం కడప జిల్లా జమ్మలమడుగులో నిర్వహించిన బీజేపీ సమావేశంలో ఆదినారాయణ రెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం మీద సంచలన కామెంట్స్ చేశారు. సొంత పార్టీ మీద ఆయన మాట్లాడారు. కూటమి ఏలుబడిలో అంతా కమ్మ కమ్మగా ఉందంటూ ఆదినారాయణ రెడ్డి మాట్లాడటం విశేషం.
ఎన్టీఆర్ హయాం కంటే :
అప్పట్లో పత్రికా ప్రముఖుడు గజ్జల మల్లారెడ్డి 1983లో ఎన్టీఆర్ పాలన గురించి మాట్లాడుతూ కమ్మగా ఉందని చెప్పేవారని, ఇపుడు ఏపీలో కూటమి పాలన అంతకంటే కమ్మగా ఉందని ఆదినారాయణరెడ్డి పోల్చి చెప్పడం మరో విశేషం. కమ్మగా ఉందంటే మీ అందరికీ అర్థమైంది కదా అని ఆదినారాయణ రెడ్డి పార్టీ క్యాడర్ కి రెట్టించి మరీ అడగడం గమనార్హం.
కమ్మతనం పోవాలి :
కూటమి పాలనలో కమ్మతనం పోవాలని ఆదినారాయణ రెడ్డి చెప్పుకొచ్చారు. కమ్మతో పాటు అన్ని కుల్లాలు ఉన్నాయని గుర్తించాలని అన్నారు పనిచేసే వారికే పదవులుఇవ్వాలని ఆయన స్పష్టం చేశారు. అందరికీ న్యాయం చేయాలని కూడా ఆయన గట్టిగా కోరుతున్నారు.
బీజేపీ లేకపోతే :
ఏపీ రాజకీయాల్లో బీజేపీ చాలా ప్రధానమైనది అని ఆదినారాయణ రెడ్డి చెప్పడం విశేషం. బీజేపీ లేకపోతే టీడీపీ జనసేన లేనే లేవని ఆయన అన్నారు. అంటే బీజేపీ కేంద్రంలో ఉంటూ తన బలాన్ని ఏపీకి అందిస్తోందని ఆయన చెప్పదలచారు అన్న మాట. అంతే కాదు బీజేపీకి ఏపీ రాజకీయాల్లో రావాల్సినంత గుర్తింపు కానీ ఇవ్వాల్సినంత ప్రాముఖ్యత కానీ ఇవ్వడం లేదని కూడా ఆదినారాయణ రెడ్డి భావనగా ఉంది అని అంటున్నారు.
అసంతృప్తి ఉందా :
ఏపీలో పదవుల విషయంలో బీజేపీకి అన్యాయం జరుగుతోంది అని గతంలో ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజు కూడా ప్రస్తావించారు. ఇపుడు అదే పార్టీకి చెందిన ఆదినారాయణ రెడ్డి సైతం అంటున్నారు. అందుకే ఆయన ఏపీ బీజేపీ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ హాజరైన సమావేశంలో మాట్లాడుతూ ఈ రకంగా బీజేపీకి పదవులు అంటూ గుర్తు చేశారు అని అంటున్నారు. అదే సమయంలో బీజేపీ లేకపోతే కూటమి లేదు, ఎవరూ లేరు అన్నట్లుగా ఒక సందేశాన్ని పంపించారు అని అంటున్నారు. ఇక కూటమిలోని మిత్రులుగా ఉన్న జనసేనలో పదవుల విషయంలో ఆవేదన ఉందని అంటున్నారు. బీజేపీ కూడా ఇదే విషయం మీద మధన పడుతోంది అంటే కూటమి పెద్దలు ఈ విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉందని అంటున్నారు. ఏది ఏమైనా ఆదినారాయణ రెడ్డి చేసిన హాట్ కామెంట్స్ చర్చనీయాంశం అవుతున్నాయి.
