Begin typing your search above and press return to search.

అదానీని వదల బొమ్మాళీ అంటున్న ఆరోపణలు..

మారిషస్ లో ఆఫ్‌ షోర్ సంస్ధలను వాడుకుని అదానీ లిస్టెడ్‌ స్టాక్ లో పెట్టుబడులు పెట్టినట్లు హిండెన్ బర్గ్ ఆరోపించిన సంగతి తెలిసిందే

By:  Tupaki Desk   |   31 Aug 2023 11:48 AM GMT
అదానీని వదల బొమ్మాళీ అంటున్న ఆరోపణలు..
X

సరిగ్గా ఏడాది కిందట ఆయన పేరు ప్రపంచవ్యాప్తంగా మార్మోగింది.. ఆరు నెలల కిందట అంతా తలకిందులైంది. మళ్లీ పుంజుకుంటున్న క్రమంలో ఆరోపణల పిడుగు పడింది. ఆయన గ్రూప్ లోని స్టాక్స్ లో గతంలో విదేశీ పెట్టుబడులకు సంబంధించి హిండెన్ బర్గ్ రిసెర్చి సంస్థ పెద్దఎత్తున ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. దాదాపు అదే తీరున మరో అంతర్జాతీయ నివేదిక వచ్చింది. అదానీ కుటుంబానికి సన్నిహితులైన కొందరు వ్యాపార భాగస్వాములు మారిషస్ లోని డొల్ల కంపెనీల ద్వారా అదానీ స్టాక్స్ లో పెట్టుబడులు పెట్టినట్లు ఆర్గనైజ్డ్ క్రైమ్ అండ్ కరప్షన్ రిపోర్టింగ్ ప్రాజెక్ట్ (OCCRP) తన కథనంలో వెల్లడించింది. పన్ను స్వర్గధామాలైన దేశాలు, అంతర్గత అదానీ గ్రూప్ ఇమెయిల్ ల నుంచి తీసుకున్న ఫైళ్ల ద్వారా ఓసీసీఆర్పీ వీటిని విశ్లేషించింది. పెట్టుబడిదారులు ఆఫ్‌ షోర్ కంపెనీల ద్వారా అదానీ స్టాక్‌ లను కొనుగోలు చేసి విక్రయించిన రెండు కేసులు కనుగొన్నట్లు వెల్లడించింది.

మారిషస్ లో ఆఫ్‌ షోర్ సంస్ధలను వాడుకుని అదానీ లిస్టెడ్‌ స్టాక్ లో పెట్టుబడులు పెట్టినట్లు హిండెన్ బర్గ్ ఆరోపించిన సంగతి తెలిసిందే. ఓసీసీఆర్పీ కూడా దాదాపు ఇలాంటి ఆరోపణలే చేసింది. హిండెన్ బర్గ్ రిపోర్ట్ తర్వాత స్పందించిన అదానీ.. ఇది నిరాధారమని, పెట్టుబడిదారుల్ని తప్పుదోవ పట్టించేలా ఉందని ఖండించింది. అయితే, మార్కెట్ 150 బిలియన్ డాలర్లను కోల్పోయింది. ఇందులో 100 బిలియన్ డాలర్ల వరకూ కోలుకున్నాయి. ఓసీసీఆర్పీ చేసిన ఆరోపణలపై స్పందించిన అదానీ గ్రూప్.. గతంలో హిండెన్ బర్గ్ రిపోర్ట్ లో ఆరోపించిన విషయాలే తాజా కథనంలోనూ ఉన్నాయని తెలిపింది. ఇవన్నీ నిరాధారమేనని వెల్లడించింది. అదానీ గ్రూప్ పబ్లిక్ లిస్టెడ్ కంపెనీలు తమ పబ్లిక్ షేర్ హోల్డింగ్‌లకు సంబంధించిన నియంత్రణతో సహా వర్తించే అన్ని చట్టాలకు లోబడి ఉన్నాయని స్పష్టం చేసింది. కాగా ,ఈ కథనాన్ని వెల్లడించిన రాయిటర్స్ వార్తా సంస్ధ మాత్రం దీన్ని స్వతంత్రంగా నిర్ధారించలేదని తెలిపింది. మరోవైపు గతంలో వెలువడిన హిండెన్ బర్గ్ రిపోర్ట్ పై ఇప్పటికీ సుప్రీంకోర్టు ఆదేశాలతో సెబీ దర్యాప్తు చేస్తూనే ఉంది. ఈ నేపథ్యంలో తాజా రిపోర్ట్ కలకలం రేపింది.

పాత చింతకాయ పచ్చడి ఆరోపణలు

ఓసీసీఆర్పీ ఆరోపణలపై అదానీ గ్రూప్ స్పందించింది. హిండెన్ బర్గ్ ఆరోపణల తరహాలోనే ఖండించింది. జార్జి సోరోస్ ఫండింగ్ చేసిన సంస్థ చేస్తున్న తాజా ఆరోపణలు గతంలోనివేనని కొట్టిపారేసిది. హిండెన్ బర్గ్ నివేదికను పునరుద్ధరించడమే దీని ఉద్దేశమని ధ్వజమెత్తింది. విదేశీ మీడియా ఈ విషయాన్ని కావాలనే రాద్దాంతం చేస్తోందని ఖండించింది. దశాబ్ధాల కిందట డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ ఓవర్ ఇన్వాయిసింగ్ గురించి దర్యాప్తు చేసి మూసివేసిన కేసు ఆధారంగా చేస్తున్న ఆరోపణలు ఇవని వెల్లడించింది.