Begin typing your search above and press return to search.

గ్రీన్ ఎనర్జీ పార్క్ గురించి అదానీ మాట వింటే ఆశ్చర్యమే

గుజరాత్ లోని గ్రీన్ ఎనర్జీ పార్కును నిర్మిస్తున్న అదానీ సంస్థ.. ఆ ప్రాజెక్టు ఎంత భారీ అన్న విషయాన్ని ఒక చిన్న పోలిక ద్వారా అందరికి అర్థమయ్యేలా చెప్పేశారు.

By:  Tupaki Desk   |   8 Dec 2023 4:18 AM GMT
గ్రీన్ ఎనర్జీ పార్క్ గురించి అదానీ మాట వింటే ఆశ్చర్యమే
X

అదానీ అంటే మాటలా? ఆయన ఆలోచనలు ఎంత భారీగా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు. ఏం చేసినా సరే.. అందరూ తన గురించి మాట్లాడుకునేలా చేయటం ఆయనకు చెల్లు. వ్యాపారంలో ఆయన దూకుడు ఎంతలా ఉంటుందన్న దానికి కంపెనీల్ని విస్తరించే తీరు చూస్తే అర్థమవుతుంది. ఒకటి తర్వాత మరొకటి అన్నట్లుగా విరామం అన్నది అక్కర్లేదన్నట్లుగా ఆయన ప్రాజెక్టులు ఉంటాయి. ఈ తీరుతోనే అతి తక్కువ సమయంలోనే ప్రపంచ కుబేరుల టాప్ ఫైవ్ జాబితాలోకి ఆయన దూసుకెళ్లారు. అలాంటి గౌతమ్ అదానీ తనకు చెందిన అదానీ గ్రూప్ పరిధిలోమరో భారీ ప్రాజెక్టును చేపట్టిన సంగతి తెలిసిందే.

గుజరాత్ లోని గ్రీన్ ఎనర్జీ పార్కును నిర్మిస్తున్న అదానీ సంస్థ.. ఆ ప్రాజెక్టు ఎంత భారీ అన్న విషయాన్ని ఒక చిన్న పోలిక ద్వారా అందరికి అర్థమయ్యేలా చెప్పేశారు. తాము నిర్మిస్తున్న గ్రీన్ ఎనర్జీ పార్క్ ను అందరిక్షం నుంచి చూసినా కనిపిస్తుందని చెప్పటం ద్వారా.. ఆ ప్రాజెక్టు ఎంత భారీ అన్నది ఇట్టే అర్థమైపోతుంది.గుజరాత్ లోని రాణ్ ఆఫ్ కచ్ ఏడారిలో ప్రపంచంలోనే అతి పెద్దదైన గ్రీన్ ఎనర్జీ పార్క్ను ఏర్పాటు చేస్తోంది.

ఈ పార్క్ ను 726 చదరపు కిలోమీటర్ల పరిధిలో నిర్మిస్తున్నారు. ఈ పార్క్ విశేషాల్ని ఆయన తాజాగా పంచుకుంటూ అంతరిక్షం నుంచి చూసినా కనిపిస్తుందని చెప్పిన ఆయన.. పునరుత్పాదన ఇంధన రంగంలో భారతదేశ అద్భుత పురోగతికి సంబంధించి అదానీ సంస్థ కీలక పాత్ర పోషిస్తున్నట్లుగా పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టు నిర్మాణంతో రెండు కోట్ల ఇళ్లకు సరిపడా 30 గిగావాట్ల విద్యుత్ ను ఉత్పత్తి చేస్తున్నట్లుగా పేర్కొన్నారు. ముంద్రాకు కేవలం 150కి.మీ. దూరంలో నిర్మిస్తున్నామని.. పునరుత్పాదక విద్యుత్ రంగానికి సంబంధించి స్థిరమైన శక్తి.. సాధనగా ఆయన పేర్కొన్నారు.

ఈ ప్లాంట్ ద్వారా ఇండియా గ్రీన్ ఎనర్జీ సామర్థ్యం పెద్ద ఎత్తున పెరుగుతుంది. అంతేకాదు.. కాప్ సదస్సు హామీల్ని సైతం నెరవేర్చటంలో కీలకభూమిక పోషించనుంది. 2021లో జరిగిన కాప్ 26వ సదస్సులో భారత్ 2030 లోపు వాతావరణంలో ఒక బిలియన్ టన్నుల కాలుష్య ఉద్గారాలను తగ్గించటం.. 500 గిగావాట్ల శిలాజ రహిత విద్యుత్ ఉత్పత్తి చేయటం లాంటివి ఉన్నాయి. దీనికి అదానీ గ్రీన్ ఎనర్జీ పార్కు కీలక భూమిక పోషించనుంది.