Begin typing your search above and press return to search.

వైద్య రంగంలోకి అదానీ ఎంట్రీ.. తొలుత ఎక్కడంటే?

అనతి కాలంలోనే కార్పొరేట్ ప్రపంచం అవాక్కు అయ్యేలా ఫలితాల్ని చూపిన అదానీ గ్రూపు ఇప్పుడు మరో కొత్త వ్యాపారంలోకి అడుగు పెట్టనుంది.

By:  Tupaki Desk   |   12 July 2025 10:15 AM IST
వైద్య రంగంలోకి అదానీ ఎంట్రీ.. తొలుత ఎక్కడంటే?
X

అనతి కాలంలోనే కార్పొరేట్ ప్రపంచం అవాక్కు అయ్యేలా ఫలితాల్ని చూపిన అదానీ గ్రూపు ఇప్పుడు మరో కొత్త వ్యాపారంలోకి అడుగు పెట్టనుంది. దీనికి సంబంధించిన వివరాల్ని గౌతమ్ అదానీ వెల్లడించారు. ఆసక్తికరమైన అంశం ఏమంటే.. మూడేళ్ల క్రితం తన పుట్టినరోజు సందర్భంగా ఆయన చెప్పిన మాటల్ని ఇప్పుడు కార్యరూపంలోకి దాల్చటమే కాదు.. త్వరలో ఈ రంగంలోకి అడుగు పెట్టనున్న విషయాన్ని చెప్పుకొచ్చారు.

ఇంతకూ అదానీ గురి పెట్టిన కొత్త వ్యాపారం ఆరోగ్య రంగం. అదానీ హెల్త్ కేర్ టెంపుల్స్ కింద అందుబాటులోకి రానున్న ఈ భారీ ఆసుపత్రులు ఏఐతోనూ పని చేయనున్నాయి. ప్రపంచ స్థాయి నాణ్యతా ప్రమాణాలతో సేవల్ని అందించే ఈ ఆసుపత్రులు అందుబాటు ధరల్లో సేవలు అందించనున్నట్లుగా పేర్కొన్నారు. ఆరోగ్య సంరక్షణ.. విద్య.. నైపుణ్యాభివ్రద్ధి కోసం తమ ఫ్యామిలీ రూ60 వేల కోట్లు ఖర్చు పెట్టనున్న విసయాన్ని చెప్పిన సంగతి తెలిసిందే.

తాను చెప్పిన మాటల్ని కార్యరూపంలోకి తీసుకొచ్చారు గౌతమ్ అదానీ. తమ ప్రాజెక్టులో భాగంగా తొలుత ముంబయి.. అహ్మదాబాద్ లలో వెయ్యి పడకల ఆసుపత్రిని నిర్మించనున్నారు. ఆరోగ్య సంరక్షణ రంగంలో పెరుగుదల సరైన స్థాయిలో లేదన్నది గౌతమ్ అదానీ వాదన. ఆ కొరతను తీర్చేందుకు తాము హెల్త్ కేర్ లోకి అడుగు పెట్టనున్నట్లుగా ఆయన చెబుతున్నారు.

మన దేశంలో ప్రది పదివేల మందికి కేవలం 20.6 మంది వైద్యులు.. నర్సులే ఉన్నారని.. ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచన చేసిన 44.5 కంటే సగానికి పైగా తక్కువగా పేర్కొన్న గౌతమ్ అదానీ.. ‘‘మనకున్న వైద్యుల్లో 74 శాతం మంది పట్టణ ప్రాంతాలకే పరిమితం అవుతున్నారు. గ్రామాల్లోని వారికి వైద్య సేవలు అందటం లేదు. ఈ అంతరాన్ని పూడ్చటానికి ఆరోగ్య సంరక్షణ రంగాన్ని రీడిజైన్ చేయాల్సి ఉంది’’ అని పేర్కొంటూ ఈ వ్యాపారంలో తన విజన్ ను వెల్లడించారు.

భవిష్యత్ అవసరాల కోసం ఆరోగ్య రంగంలో వేగాన్ని తీసుకురావటమే తమ పనిగా చెప్పిన అదానీ.. వ్యవస్థ మొత్తాన్ని మార్చాల్సి ఉందని.. అందుకు ఒక విప్లవమే తీసుకురావాల్సి ఉంటుందని చెబుతున్నారు. తాము తొలుత ఏర్పాటు చేసే రెండు ఆసుపత్రుల్లో క్లినికల్ కేర్.. రీసెర్చ్ అండ్ అకడమిక్ ట్రైనింగ్ గా పని చేస్తాయని చెబుతన్నారు. వైద్యులు రోబోటిక్స్.. ఏఐ.. సిస్టమ్స్ థింకింగ్.. హెల్త్ కేర్ మేనేజ్ మెంట్ లోనూ నైపుణ్యం సాధించటమే తమ ఉద్దేశంగా చెబుతున్నారు.