పాక్ అబద్ధాలకు చెక్.. ఆదంపుర్‌లో ఎస్-400 క్షేమం.. ప్రధాని మోదీ సందేశం!
ఆదంపుర్ వైమానిక స్థావరాన్ని 1950లలో ఏర్పాటు చేశారు. ఇది పంజాబ్‌లోని జలంధర్ నగరానికి అతి దగ్గరలో ఉంటుంది
By: Tupaki Desk | 15 May 2025 12:45 PM ISTపాకిస్థాన్ ఆర్మీ హెడ్‌క్వార్టర్స్‌కు కేవలం కొద్ది దూరంలో ఉన్న నూర్ ఖాన్ ఎయిర్‌బేస్‌ను భారత్ చావు దెబ్బ తీయడంతో, కంగుతిన్న పాకిస్థాన్.. తమ పరువు కాపాడుకోవడానికి ఆదంపుర్‌పై దాడి చేసి ఎస్-400ని ధ్వంసం చేశామని ఒక పచ్చి అబద్ధాన్ని ప్రచారం చేయడం మొదలుపెట్టింది. అయితే, భారత ప్రధాని మోదీ స్వయంగా ఆదంపుర్‌ను సందర్శించి, అక్కడ ఎస్-400, మిగ్-29 యుద్ధ విమానాలు క్షేమంగా ఉన్నాయని ప్రపంచానికి చాటిచెప్పారు. వాస్తవానికి వ్యూహాత్మకంగా ఆదంపుర్ వైమానిక స్థావరానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. భారత్-పాకిస్థాన్ మధ్య జరిగిన ప్రతి యుద్ధంలోనూ శత్రుదేశానికి ఇది మొదటి టార్గెట్‌గా మారినా, తన ఉక్కు సంకల్పంతో అన్ని దాడులను తట్టుకొని గంభీరంగా నిలబడింది.
ఆదంపుర్ వైమానిక స్థావరాన్ని 1950లలో ఏర్పాటు చేశారు. ఇది పంజాబ్‌లోని జలంధర్ నగరానికి అతి దగ్గరలో ఉంటుంది. ఇక్కడి నుంచి పాకిస్థాన్ సరిహద్దు కేవలం 100 కిలోమీటర్ల దూరం మాత్రమే. ఇది భారతదేశంలోని రెండవ అతిపెద్ద వైమానిక స్థావరంగా గుర్తింపు పొందింది. గడిచిన 75 ఏళ్లుగా పాకిస్థాన్ రాడార్‌లో నిత్యం గురిపెట్టినా, ఈ స్థావరం మాత్రం చెక్కుచెదరని ఉక్కు కోటలా నిలబడింది. పాకిస్థాన్ ఎల్లప్పుడూ దీని భద్రతా వ్యవస్థలోకి చొరబడాలని కుట్రలు పన్నుతూనే ఉంటుంది. ఈ నెల 9-10 తేదీల్లో పాకిస్థాన్ ఏకంగా 6 క్షిపణులను ప్రయోగించగా, వాటన్నింటినీ భారత రక్షణ వ్యవస్థ కేవలం ఏడు కిలోమీటర్ల దూరంలోనే నేలకూల్చింది.
ఈ స్థావరం భారత వైమానిక దళానికి చెందిన అత్యంత కీలకమైన 47వ స్క్వాడ్రన్‌కు ప్రధాన స్థావరం. ఈ స్క్వాడ్రన్‌ను 'బ్లాక్ ఆర్చర్స్' అని కూడా పిలుస్తారు. దీనితో పాటు, 'ఫస్ట్ సూపర్‌సోనిక్స్'గా పేరుగాంచిన 28వ స్క్వాడ్రన్ కూడా ఇక్కడే ఉంటుంది. ఈ రెండు స్క్వాడ్రన్‌లు ఈ స్థావరం రోజువారీ కార్యకలాపాలకు వెన్నెముకలాంటివి.
వ్యూహాత్మకంగా ఆదంపుర్ ఒక తిరుగులేని శక్తి కేంద్రం. దీని చుట్టుపక్కల కేవలం 150 కిలోమీటర్ల పరిధిలోనే అత్యాధునిక ఆపాచీ హెలికాప్టర్లు ఉన్న పఠాన్‌కోట్, సుఖోయ్-30 ఎంకేఐ యుద్ధ విమానాలు ఉన్న హల్వారా, పాకిస్థాన్ సరిహద్దుల్లోని అమృత్‌సర్, రఫేల్ యుద్ధ విమానాల కేంద్రమైన బఠిండా, చండీగఢ్ వైమానిక స్థావరాలు ఉన్నాయి. వీటన్నింటినీ ఒక గ్రిడ్ వలె అనుసంధానిస్తూ ఆదంపుర్ ఎయిర్‌బేస్ తనదైన ముద్ర వేస్తోంది. ఈ నేపథ్యంలోనే అత్యాధునిక ఎస్-400 గగనతల రక్షణ వ్యవస్థ మొదటి రెజిమెంట్‌ను ఇక్కడే మోహరించారు. దీనితో పశ్చిమ సరిహద్దులు ఈ శక్తివంతమైన రక్షణ ఛత్రం కిందకు వచ్చాయి.
1965లో పాకిస్థాన్ వైమానిక దళం ఆదంపుర్‌పై ముందస్తు దాడికి తెగబడింది. ఆ తర్వాత 135 మంది స్పెషల్ సర్వీస్ గ్రూప్ పారా కమాండోలను ఇక్కడ ఎయిర్ డ్రాప్ చేసింది. కానీ, అప్రమత్తమైన భారత గ్రామీణ ప్రజలు ఆ కమాండోలలో చాలా మందిని పట్టుకొని మన దళాలకు అప్పగించారు. మిగిలిన కమాండోలు ప్రాణాలతో బయటపడటానికి పాకిస్థాన్‌కు పారిపోయారు. ఆ సమయంలో ఈ ఎయిర్‌బేస్‌లో వైమానిక దళం 1వ స్క్వాడ్రన్ ఉండేది. అది సర్గోదా సహా పాకిస్థాన్ ఇతర కీలక వైమానిక స్థావరాలను ధ్వంసం చేసింది.
ఇక 1971 యుద్ధ సమయంలో పఠాన్‌కోట్‌లోని రన్‌వేను పాకిస్థాన్ ధ్వంసం చేయగా, ఆదంపుర్ నుంచే యుద్ధ విమానాలు గాల్లోకి ఎగిరి ఆ ఎయిర్‌బేస్‌కు రక్షణ కల్పించాయి. ఆ యుద్ధం మొత్తం ఈ స్థావరం పూర్తి శక్తి సామర్థ్యాలతో పనిచేసింది. 1999 కార్గిల్ యుద్ధంలో కూడా ఇక్కడి నుంచే మిరాజ్ 2000 విమానాలు బయల్దేరి శత్రువుల బంకర్లను ధ్వంసం చేశాయి. టైగర్ హిల్స్, టోలోలింగ్ శిఖరాలను తిరిగి స్వాధీనం చేసుకోవడంలో ఈ స్థావరం కీలక పాత్ర పోషించింది.