నటి రమ్యశ్రీపై దాడి.. అసలేం జరిగింది?
ఈ నేపథ్యంలో సదరు లేఔట్ లో ఉన్న రోడ్లు.. పార్కులు గుర్తు పట్టలేని విధంగా మార్చేయటంతో వాటిని పునరుద్ధరించాలని ప్లాట్ యజమానులు హైడ్రా కమిషనర్ రంగనాథ్ కు విన్నవించారు.
By: Tupaki Desk | 18 Jun 2025 9:39 AM ISTగచ్చిబౌలిలో నటి రమ్యశ్రీ మీదా.. ఆమె సోదరుడి మీదా దాడి జరిగింది. దీని వెనుక సంధ్యా కన్వెన్షన్ సెంటర్ యజమాని శ్రీధర్ రావు ఉన్నట్లుగా ఆమె ఆరోపిస్తున్నారు. ఇంతకూ రమ్యశ్రీ మీద శ్రీధర్ రావు మనుషులు ఎందుకు దాడి చేశారు? అసలేం జరిగిందన్న విషయంలోకి వెళితే.. గచ్చిబౌలి ప్రధాన రహదారిని ఆనుకొని (డీఎల్ఎఫ్ చౌరస్తా) ఫెర్టిలైజర్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎంప్లాయిస్ కో-ఆపరేటివ్ హౌజింగ్ సొసైటీ లేఅవుట్ ఉంది.
అందులో సంధ్యా కన్వెన్షన్ అనుమతులు లేకుండా మినీ హాల్.. పలు గదులు.. షెడ్లను నిర్మించారు. దీనిపై అందిన ఫిర్యాదును తీసుకొని విచారించిన హైడ్రా.. గత నెలలో (మే) వాటిని నేలమట్టం చేశారు.
ఈ నేపథ్యంలో సదరు లేఔట్ లో ఉన్న రోడ్లు.. పార్కులు గుర్తు పట్టలేని విధంగా మార్చేయటంతో వాటిని పునరుద్ధరించాలని ప్లాట్ యజమానులు హైడ్రా కమిషనర్ రంగనాథ్ కు విన్నవించారు. దీంతో రంగంలోకి దిగిన హైడ్రా.. లేఔట్ పునరుద్దరణకు రంగంలోకి దిగారు. ఈ ప్లాట్ యజమానుల్లో ఒకరైన సినీ నటి రమ్యశ్రీ తన సోదరుడితో కలిసి వచ్చారు. హైడ్రా అధికారులు చేపట్టిన లేఔట్ పునరుద్ధరణ పనుల్ని వీడియోలు తీశారు. తిరిగి వెళుతున్న వేళలో శ్రీధర్ రావుకు చెందిన మనుషులు వారిని అడ్డుకున్నారు.
వీడియోలు ఎందుకు తీశారంటూ ఫోన్ లాక్కొని దాడికి ప్రయత్నించగా.. రమ్య శ్రీ సోదరుడు ప్రశాంత్ అడ్డుకునే ప్రయత్నం చేశారు. తమపై దాడి చేసిన సంధ్యా శ్రీధర్ రావు మనుషులపై చర్యలు తీసుకోవాలంటూ రమ్య శ్రీ గచ్చిబౌలి పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరోవైపు పోలీసుల బందోబస్తు నడుమ మార్కింగ్ పూర్తి చేశారు.అయితే.. సదరు గొడవ హైడ్రా అధికారులు పనులు చేస్తున్న సమయంలో జరగలేదని హైడ్రా కమిషనర్ రంగనాథ్ వెల్లడించారు.
