బీజేపీ తీర్థం పుచ్చుకోనున్న మీనా.. ఈసారి పక్కానా?
తాజాగా ఆమె ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్ కడ్ ను కలిశారు. ఆయన్ను కలిసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
By: Tupaki Desk | 25 Jun 2025 11:23 AM ISTసినీ నటి మీనా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వనున్నారా? ఆమె భారతీయ జనతాపార్టీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారా? అన్నదిప్పుడు తాజా చర్చగా మారింది. నిజానికి మీనా బీజేపీలో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారంటూ గత ఏడాది మొదట్లోనూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. కట్ చేస్తే.. మళ్లీ ఇప్పుడు కూడా ఇదే చర్చ మొదలైంది. దీనికి కారణం లేకపోలేదు.
తాజాగా ఆమె ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్ కడ్ ను కలిశారు. ఆయన్ను కలిసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఒకప్పుడు తెలుగు.. తమిళ సినీ రంగంలో అగ్రనటిగా వెలుగొందిన మీనా వ్యక్తిగత జీవితంలో తీవ్ర విషాదం నెలకొంది. ఆమె భర్త 2022లో అనారోగ్యంతో మరణించారు. అప్పటినుంచి ఆమె ఒంటరిగానే ఉన్నారు. మీనా కుమార్తె నైనిక ఇటీవల అగ్రహీరో విజయ్ నటించిన మూవీలో యాక్ట్ చేయటం తెలిసిందే.
ఈ మధ్యన దేశ రాజధాని ఢిల్లీ వెళ్లిన మీనా.. అక్కడ ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్ ఖడ్ ను కలిశారు. వీరి భేటీకి సంబంధించిన ఫోటోలు బయటకురావటంతో మీనా బీజేపీలోకి చేరేందుకు ఆసక్తిని చూపుతున్నట్లు వార్తల జోరు పెరిగింది. అయితే.. ఆమె గతాన్ని చూస్తే.. గత ఏడాది (2024) జనవరిలో ఆమె ఢిల్లీకి వెళ్లారు.అక్కడ జరిగే కార్యక్రమానికి అటెండ్ అయ్యారు. ఈ కార్యక్రమానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ హాజరయ్యారు.
గత ఏడాది కేంద్రమంత్రి మురుగన్ పొంగల్ వేడుకల్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మీనాకు ఇన్విటేషన్ ఉండటం.. ఆమె ఆ ప్రోగ్రాంకు హాజరుకావటం అప్పట్లో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. అయితే.. ఆమె మౌనంగా ఉండిపోయారు. తాజాగా మాత్రం ఉప రాష్ట్రపతితో ఆమె భేటీ.. రాజకీయాల్లోకి రావటానికి ముందే పక్కా గ్రౌండ్ వర్కు చేసేందుకు వీలుగా ఆమె ప్లానింగ్ ఉందా? అన్నది ప్రశ్నగా మారింది. తమిళనాడు రాజకీయాల్లో స్పేస్ ఉండటం.. కొత్త నాయకత్వం దిశగా అడుగులు వేసి.. అధికారాన్ని సొంతం చేసుకోవాలంటే ఇదే సరైన సమయంగా చెబుతున్నారు.
ఎందుకంటే.. మరికొద్ది నెలల్లో తమిళనాడు రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతున్నాయి. విపక్ష అన్నాడీఎంకేతో కలిసి బీజేపీతో పొత్తు ఖాయం చేసుకున్నారు. యువ నటుడు విజయ్ తో కలిసి ఒక ఈ మూడు పార్టీలు కూటమిగా ఏర్పడే ఆలోచనలు జోరుగా తాగుతున్నాయి. మరోవైపుఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సైతం బీజేపీ నేతలు నిర్వహించే కార్యక్రమానికి పవన్ కల్యాణ్ హాజరు కావటం.. తన ప్రసంగంతో ఆకట్టుకుంటున్నారు. ఈ నేపథ్యంలో పార్టీకి మరింత సినీ గ్లామర్ ను జోడించటం ద్వారా ఈసారి ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం కొలువు తీరేలా కమలనాథులు ప్లాన్ చేస్తున్నారు. అందుకు తగ్గట్లే సినీ నటి మీనాను పొలిటికల్ ఎంట్రీ ఇచ్చేలా ప్లాన్ చేస్తున్నట్లుగా కనిపిస్తోంది.
