Begin typing your search above and press return to search.

విజయ్ కాంత్‌ ఆరోగ్యం విషమం... వైద్యులు ఇచ్చిన రిపోర్ట్ వైరల్!

కోలీవుడ్ స్టార్ హీరో, డీఎండీకే అధినేత విజయ్ కాంత్ గతకొంతకాలంగా అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్న సంగతి తెలిసిందే

By:  Tupaki Desk   |   29 Nov 2023 12:44 PM GMT
విజయ్ కాంత్‌ ఆరోగ్యం విషమం... వైద్యులు ఇచ్చిన రిపోర్ట్ వైరల్!
X

కోలీవుడ్ స్టార్ హీరో, డీఎండీకే అధినేత విజయ్ కాంత్ గతకొంతకాలంగా అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా హాస్పిటల్లో జాయిన్ అయ్యి చికిత్స పొందుతున్నారు. ఇంద్లో భాగంగా చెన్నైలోని ఎం.ఐ.ఓ.టీ. ఆస్పత్రిలో ప్రత్యేక వైద్యుల బృందం ఆయనకు చికిత్స అందిస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా ఆయన హెల్త్ పై రిపోర్ట్ వెలుగులోకి వచ్చింది.

అవును... విజయ్ కాంత్ ఆరోగ్యం విషమంగా మారుతున్నట్లు నివేదికలు వస్తున్నాయి. దీంతో ఆయన వీలైనంత త్వరగా, వేగంగా కోలుకునేలా ప్రార్ధించమని వేడుకుంటున్నారు. వాస్తవానికి గత కొంతకాలంగా విజయ్ కాంత్ డయాబెటిస్ తో బాధపడుతున్నారు. ఇదే సమయంలో ఆయనకు లివర్ సంబంధిత సమస్య కూడా ఉందని చెబుతున్నారు.

ఈ క్రమంలో డయాబెటిస్ కారణంగా ఇప్పటికే వైద్యులు ఆయన మూడు వేళ్లను తొలగించారు! ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఆయన ఆరోగ్యం బాగా క్షీణించినట్టు వైద్యులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా విజయ్ కాంత్ ఆరోగ్య పరిస్థితి గురించి చెన్నైలోని ఎం.ఐ.ఓ.టీ ఆస్పత్రి వైద్యులు హెల్త్ బులిటెన్ విడుదల చేశారు.

ఈ బులిటెన్ లో... విజయ్ కాంత్ ఆరోగ్యం కాస్త కుదుటపడినప్పటికీ.. గత 24 గంటలుగా కాస్త విషమంగా మారినట్లు వెల్లడించారు. ఇదే సమయంలో చికిత్సకు ఆయన కాస్త సహకరిస్తున్నప్పటికీ... పరిస్థితి మాత్రం ఇంకా నిలకడగా లేదని వైద్యులు తెలిపారు. ఈ నేపథ్యంలో... ఆయనకు పల్మనరీ చికిత్సను వైద్య నిపుణులు సిఫార్సు చేసినట్లు వెల్లడించారు.

ప్రస్తుతం ఆయన ఉన్న పరిస్థితుల్లో కోలుకోవడానికి మరో 14 రోజుల పాటు నిరంతర చికిత్స అవసరం అని వైద్యులు వెల్లడించారు. దీంతో అటు అభిమానులు, ఇటు డీఎండీకే వర్గాల్లో ఆందోళన నెలకొందని తెలుస్తుంది. ఈ క్రమంలో తమ నాయకుడి ఆరోగ్యం త్వరగా కుదుట పడాలని పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు.

మరోపక్క గెట్ వెల్ సూన్ అంటూ ఆయన అభిమానులు సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు. వీలైనంత తొందరగా ఆయన ఆరోగ్యం కుదుటపడాలని భగవంతుడిని వేడుకుంటున్నారు. ఈ సమయంలో కొంతమంది నేతలు ఆస్పత్రివద్దకు చేరుకుంటున్నారని అంటున్నారు.

కాగా... ఆనారోగ్యం కారణంగా విజయ్ కాంత్ గతకొంతకాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో చాలా మంది పార్టీ నాయకులు, కార్యకర్తలు విజయ్ కాంత్ ను చూడాలని విజ్ఞప్తి చేయడంతో ఆయన ఇటీవల పార్టీ కార్యాలయంలో జరిగిన తన జన్మదిన వేడుకల్లో కార్యకర్తలను కలిశారు. ఆ సమయంలో ఆయన ఆరోగ్య పరిస్థితిని చూసినవారు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.