Begin typing your search above and press return to search.

వ్యూహాత్మకంగా మొహరిస్తున్న జగన్... వైసీపీ ఎంపీ అభ్యర్థిగా సుమన్?

ఎన్నికలు సమీపిస్తున్న వేళ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వేగంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు

By:  Tupaki Desk   |   28 Jan 2024 3:45 AM GMT
వ్యూహాత్మకంగా మొహరిస్తున్న జగన్... వైసీపీ ఎంపీ అభ్యర్థిగా సుమన్?
X

ఎన్నికలు సమీపిస్తున్న వేళ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వేగంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. ప్రధానంగా... వై నాట్ 175 నినాదంతో ముందుకు వెళ్తున్న ఆయన సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే పలు నియోజకవర్గాల్లో ఇన్ ఛార్జ్ ల మార్పులు, చేర్పులు చేస్తున్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే 58 అసెంబ్లీ 10 లోక్ సభ స్థానాల విషయంలో నిర్ణయాలు తీసుకుని ప్రకటించారు.

ఇదే క్రమంలో మిగిలిన నియోజకవర్గాలపైనా కసరత్తులు చేస్తున్నారని తెలుస్తుంది. ఈ నేపథ్యంలో... ప్రధానంగా లోక్ సభ అభ్యర్థుల విషయంలో జగన్ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. గత ఎన్నికల్లో గెలిచిన 23 మందిలో ముగ్గురి స్థానాలను మాత్రమే కన్ ఫాం చేస్తూ.. మిగిలిన అన్ని స్థానాల్లోనూ మార్పులు, చేర్పులు చేపడుతున్నారు. ఈ సమయంలో... రాజమండ్రి వైసీపీ ఎంపీ అభ్యర్థి వ్యవహారం తెరపైకి వచ్చింది.

అవును... ఈ దఫా రాజమండ్రి సిట్టింగ్ ఎంపీ మార్గాని భరత్ అసెంబ్లీ స్థానానికి బరిలోకి దిగుతున్నారని తెలుస్తున్న వేళ.. ఎంపీ అభ్యర్థిగా గతకొంతకాలంగా తీవ్ర చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా... గతంలో పలు పేర్లు తెరపైకి వచ్చాయి. ఇందులో భాగంగా... రాజమండ్రి సిటీ ఇన్ ఛార్జ్ గా ఉన్న డాక్టర్ గూడూరి శ్రీనివాస్ పేరు తెరపైకి వచ్చింది. ఈ దఫా ఈయనను ఎంపీ టిక్కెట్ కన్ ఫాం అనే కామెంట్లూ వినిపించాయి.

బీసీ సామాజిక వర్గానికి చెందిన డాక్టర్ గూడూరి శ్రీనివాస్ కు వైద్యుడిగా మంచి పేరుండటంతోపాటు విజయభారతి ఛారిటబుల్ ట్రస్టు పేరుతో సేవా కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు. ఇదే సమయంలో ఆయన సతీమణి రాధిక ప్రముఖ న్యాయవాదిగా ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో నగర పాలక సంస్థ కార్పోరేటర్ గా పోటీ చేసి విజయం సాధించారు గూడూరి శ్రీనివాస్.

కట్ చేస్తే... ఇప్పుడు తాజాగా మరో పేరు తెరపైకి వచ్చింది. ఈసారి రాజమండ్రి లోక్ సభ స్థానానికి సినీ నటుడుని రంగంలోకి దింపబోతున్నారని ప్రచారం తెరపైకి వచ్చింది. ఇందులో భాగంగా... సినీనటుడు సుమన్ బరిలోకి గిగబోతున్నారని కథనాలొస్తున్నాయి! ఈ మేరకు ఇప్పటికే వైసీపీ అగ్రనేతలు.. ఈయనతో చర్చించినట్లు చెబుతున్నారు. బీసీ సామాజికవర్గానికి చెందిన సుమన్ వల్ల ఆ వర్గం ఓట్లు గంపగుత్తగా పడే అవకాశం ఉందని భావిస్తున్నారని తెలుస్తుంది.

కాగా... 2014 ఎన్నికల్లో ప్రధానంగా వైసీపీ - టీడీపీ మధ్య జరిగిన పోరులో టీడీపీ నుంచి మురళీ మోహన్ సుమారు 1,67,434 ఓట్ల మెజారిటీతో గెలుపొందగా... 2019లో జరిగిన వైసీపీ - టీడీపీ - జనసేన త్రిముఖ పోరులో వైసీపీ అభ్యర్థి మార్గాని భరత్ 1,21,634 ఓట్ల మెజారిటీతో గెలుపొందిన సంగతి తెలిసిందే. ఈ దఫా... టీడీపీ - జనసేన కూటమిగా బరిలోకి దిగుతున్న నేపథ్యంలో... పోరు హోరా హోరీగా ఉండొచ్చని అంటున్నారు పరిశీలకులు.