Begin typing your search above and press return to search.

బాబు కోసం రవిబాబు... ప్రభుత్వానికి హితవు!

స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో అరెస్టైన చంద్రబాబు ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న సంగతి తెలిసిందే.

By:  Tupaki Desk   |   30 Sep 2023 5:55 AM GMT
బాబు కోసం రవిబాబు... ప్రభుత్వానికి హితవు!
X

స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో అరెస్టైన చంద్రబాబు ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న సంగతి తెలిసిందే. ఆయన సుమారు 21 రోజులుగా జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు. ఈ క్రమంలో బాబు అరెస్ట్ పై టాలీవుడ్ నుంచి ఊహించిన, ఆశించిన స్థాయిలో రియాక్షన్ రాలేదనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఈ సమయంలో డైరెక్టర్ రవిబాబు స్పందించారు.

అవును... చంద్రబాబు అరెస్ట్ పై టాలీవుడ్ నుంచి ఊహించిన స్థాయిలో రియాక్షన్ రాలేదని కామెంట్లు వినిపిస్తున్నాయి. వేళ్లమీద లెక్కపెట్టే స్థాయిలోనే బాబు అరెస్ట్ పై స్పందించారు. పైగా స్పందించిన వారంతా ప్రత్యక్షంగానో, పరోక్షంగానో చంద్రబాబుతోనో, టీడీపీతోనో అనుబంధం ఉన్నవారు కాబట్టి తప్పలేదు అనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి!

ఈ నేపథ్యంలో డైరెక్టర్ రవిబాబు స్పందించారు. ఇందులో భాగంగా ఒక వీడియోను విడుదల చేశారు. ఈ వీడియోలో మాట్లాడుతూ... "జీవితంలో ఏదీ శాస్వతం కాదండీ.. సినిమా వాళ్ల గ్లామర్ కానీ, రాజకీయ నాయకుడి పవర్ కానీ ఏదీ శాస్వతం కాదు.. అలాగే చంద్రబాబుకి వచ్చిన కష్టాలు కూడా శాస్వతం కాదు" అని మొదలుపెట్టారు.

అనంతరం... రామారావు గారి ఫ్యామిలీ, చంద్రబాబు ఫ్యామిలీ.. తన ఫ్యామిలీకి చాలా ఆప్తులని చెప్పిన రవిబాబు... చంద్రబాబు ఒకపనిచేసే ముందు వంద యాంగిల్స్ లో చూస్తారని.. అందరినీ సంప్రదించి, ఎవ్వరికీ ఇబ్బంది కగలకుండా డెసిషన్ తీసుకుంటారని అన్నారు. ఇదే సమయంలో చంద్రబాబుకి భూమిమీద ఇవాళే ఆఖరి రోజు అని తెలిసినా కూడా నెక్స్ట్ 50 సంవత్సరాల గురించి ప్లాన్స్ వేస్తారని చెప్పుకొచ్చారు.

ఇదే సమయంలో... చంద్రబాబు డబ్బు కోసం కక్కుర్తి పడే మనిషి కాదని అన్నారు. అలాంటి మనిషిని సరైన ఆధారం లేకుండా జైల్లో పెట్టి ఎందుకు వేధిస్తున్నారో తనకు అర్ధం కావడం లేద‌ని తెలిపారు. ఇక రాజకీయాల్లో ఎత్తులు పైఎత్తులూ అత్యంత సహజం అని చెప్పిన రవిబాబు... 73ఏళ్ల వయసున్న వ్యక్తిని జైల్లో పెట్టి హింసించడం అది ఏ ఎత్తో పైఎత్తో అయితే మాత్రం అది చాలా దారుణం అని అభిప్రాయపడ్డారు.

ఇదే క్రమంలో... “అశాస్వతమైన పవర్ ఉన్నవాళ్లకి హంబుల్ రిక్వస్ట్” అని చెప్పిన ఆయన... ఏ పవర్ వాడి చంద్రబాబుని జైల్లో పెట్టారో, దయచేసి అదే పవర్ ని ఉపయోగించి ఆయన్ని వదిలేయండి అని అడగడం గమనార్హం. “మీరు చిటికెస్తే అది జరిగిపోతుందని అందరికీ తెలుసు అని, ఆయన్ని బయట ఉంచి ఇష్టమొచ్చినట్లు ఇన్వెస్టిగేషన్ చేసుకోండని” హితవు ఇచ్చారు.

అదేవిధంగా... చంద్రబాబు అయితే దేశాన్ని వదిలి కచ్చితంగా పారిపోడని భరోసా ఇచ్చారు! ఈ సందర్భంగా "దేశం మిమ్మల్ని ఎలా గుర్తుంచుకోవాలనుకుంటున్నారు"? అని ప్రశ్నించిన రవిబాబు... “కక్షతో రగిలిపోయే కసాయివాళ్ల లాగానా.. లేక, జాలి మనసు ఉన్న మంచి నాయకుడిలాగానా?” అని ప్రశ్నించారు. ఫైనల్ గా ... దయచేసి చంద్రబాబు నాయుడిని వదిలిపెట్టమని, అందుకు అంతా కృతజ్ఞతగా ఉంటారని చెప్పుకొచ్చారు!

దీంతో రవిబాబు ఎవరిని ఉద్దేశించి ఈ మాటలు పలికారు.. ఎవరిని ఉద్దేశించి రిక్వస్ట్ చేశారు? బాబుని అరెస్ట్ చేసిన ఏపీ సీఐడీనా.. ఈ కేసును మొదలుపెట్టిన ఈడీనా.. లేక, న్యాయస్థానాలనా.. అనేది ఆసక్తికరంగా మారింది!