Begin typing your search above and press return to search.

తమిళ పాలిటిక్స్ లో ట్విస్ట్.. ఒంటరిగా టీవీకే విజయ్! సక్సెస్ అవుతారా?

తమిళ రాజకీయాలు ఎప్పుడూ విలక్షణంగా ఉంటాయి. ఈ రాష్ట్రంలో ప్రధాన రాజకీయ పక్షాలైన డీఎంకే, అన్నాడీఎంకేతోపాటు అనేక చిన్నచితకా పార్టీలు ఎన్నికల్లో ప్రభావం చూపుతుంటాయి.

By:  Tupaki Desk   |   11 March 2026 1:00 AM IST
తమిళ పాలిటిక్స్ లో ట్విస్ట్.. ఒంటరిగా టీవీకే విజయ్! సక్సెస్ అవుతారా?
X

తమిళ రాజకీయాలు ఎప్పుడూ విలక్షణంగా ఉంటాయి. ఈ రాష్ట్రంలో ప్రధాన రాజకీయ పక్షాలైన డీఎంకే, అన్నాడీఎంకేతోపాటు అనేక చిన్నచితకా పార్టీలు ఎన్నికల్లో ప్రభావం చూపుతుంటాయి. ఇక జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ ఏదో ఒక ప్రాంతీయ కూటమిలో చేరి తమ ఉనికి చాటుకోవాల్సిన పరిస్థితులు ఎదుర్కొంటున్నాయి. ఈ పరిస్థితుల్లో డీఎంకే, అన్నా డీఎంకే పార్టీల నేతృత్వంలో కూటములే ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేయనున్నాయని అంటున్నారు. గత కొన్ని దశాబ్దాలుగా ఈ రాష్ట్రంలో అన్ని పార్టీలు రెండు కూటములుగా ఏర్పడటం జరుగుతోంది. ఈ కూటములను కాదని ఒంటరిగా పోటీ చేసి గెలవడం చాలా అరుదుగా చెబుతున్నారు.

ఇక త్వరలో జరగబోయే ఎన్నికల్లో కూడా అధికార డీఎంకే, ప్రధాన ప్రతిపక్షం ఏఐడీఎంకే కూటముల మధ్యే పోటీ జరగనుందని అంటున్నారు. అయితే కొత్తగా ఆవిర్భవించిన తమిళర వెట్రి కగజం (టీవీకే) పార్టీ కూడా పోటీలో ఉన్నానంటూ హడావుడి చేస్తుండటం ఆసక్తి రేపుతోంది. సినీ నటుడు విజయ్ ఆధ్వర్యంలో ఏర్పడిన టీవీకే తొలుత కూటమిగా ఏర్పడేందుకు ప్రయత్నంచిందని, కానీ, ఆ పార్టీతో జట్టు కట్టేందుకు ఎవరూ ముందుకు రాలేదని చెబుతున్నారు. అయితే దళపతి విజయ్ సినీ గ్లామర్, ఆయన పర్యటనకు వస్తున్న ప్రజాదరణతో టీవీకే పార్టీ ఏమైనా సంచలనం నమోదు చేస్తుందా? అనే చర్చ ఎక్కువగా జరుగుతోంది.

దళపతి విజయ్ తోపాటు మరో సినీ నటుడు శ్రీమాన్ స్థాపించిన నామ్ తమిళర్ కట్చి కూడా ఒంటరిగా పోటీ చేయనుంది. 2010లో నామ్ తమిళర్ కట్చి పార్టీని శ్రీమాన్ ప్రారంభించారు. 2009లో శ్రీలంక అంతర్యుద్ధం ముగిసిన తర్వాత, తమిళ ఈలం అంశంపై ఆయన తీవ్రంగా స్పందించారు. ఆ సమయంలోనే ఆయన పూర్తిస్థాయి రాజకీయ నాయకుడిగా మారారు. తన పదునైన ప్రసంగాలతో యువతను బాగా ఆకర్షిస్తున్నారు. ఆయన ప్రసంగాలు చాలా ఉద్వేగభరితంగా ఉంటాయని చెబుతారు. ఇప్పుడు విజయ్ కూడా శ్రీమాన్ ను మించేలా మాట్లాడుతున్నారు. ఆయన సభలు, పర్యటనలకు వస్తున్న జనాదరణ ఉత్కంఠ రేపుతోంది.

అయితే తమిళనాడు ఎన్నికల చరిత్ర పరిశీలిస్తే ఇప్పటివరకు ఒంటరిగా పోటీ చేసిన వారెవరూ అధికారంలోకి వచ్చిన దాఖలాలు లేవంటున్నారు. ఒక్క ఏఐఎండీకే అధినేత్రి జయలలిత మాత్రమే పదేళ్ల క్రితం జరిగిన అసెంబ్లీ (2016) ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసి రికార్డు స్థాయి విజయాన్ని సాధించారని గత రికార్డులు తెలియజేస్తున్నాయి. ఆ ఎన్నికల్లో 134 స్థానాలను గెలుచుకుని ఏఐడీఎంకే సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. తమిళనాడు రాజకీయాల్లో ఒకే పార్టీ వరుసగా రెండోసారి పీఠాన్ని దక్కించుకోవడం 1984 తర్వాత 2016లోనే జరిగింది.

కూటములపై ఆధారపడకుండా ఒంటరిగా గెలవడం అనేది తమిళనాడులో కేవలం జయలలిత వంటి బలమైన వ్యక్తిత్వం ఉన్న నాయకులకు మాత్రమే సాధ్యమైంది. మారుతున్న రాజకీయాల్లో ఇప్పడు విజయ్ వంటి వారు అదే బాటలో నడవాలని ప్రయత్నిస్తున్నారు. విజయ్ మాదిరిగా సినీ నేపథ్యంతో నటుడు విజయకాంత్ 2005లో డీఎండీకే పార్టీని స్థాపించారు. ఏడాది తర్వాత, 2006లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని స్థానాల్లో ఒంటరిగా పోటీ చేశారు. అయితే కేవలం 8 శాతం ఓట్లతోనే సరిపెట్టుకున్నారు. ఈ ఎన్నికల్లో విజయకాంత్ ఒక్కరే గెలిచారు.

అదేవిధంగా 2016 అసెంబ్లీ ఎన్నికల్లో అన్బుమణి రామదాస్‌ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించి పీఎంకే ఒంటరిగా పోటీ చేసింది. అయితే, ఆ ఎన్నికల్లో ఆ పార్టీ ఒక్క సీటు కూడా గెలవలేకపోయింది. ఇక శీమాన్ నాయకత్వంలోని నామ్ తమిళర్ కట్చి (NTK) పార్టీ గత కొన్ని ఎన్నికల నుంచి ఒంటరిగానే పోటీ చేస్తోంది. ఈ పార్టీకి సీట్లు రాకపోయినప్పటికీ, ప్రతి ఎన్నికల్లోనూ ఓట్ల శాతం పెరుగుతూ వస్తోంది. ఈ పరిస్థితుల్లో విజయ్ సొంతంగా పెట్టిన పార్టీ ఒంటరి పోరాటం చేస్తానని ప్రకటించడం ఆసక్తి రేపుతోంది. నిజానికి కూటమి కట్టడానికి శతవిధాల విజయ్ ప్రయత్నించారని, కానీ ఆయన ప్రయత్నాలకు ముఖ్యమంత్రి స్టాలిన్ గండి కొట్టారని అంటున్నారు. ఈ పరిస్థితుల్లో విజయ్ రాజకీయ వ్యూహాలు ఉత్కంఠ రేకెత్తిస్తున్నాయి.