నటుడు శ్రీరామ్ అరెస్ట్ .. తీగలాగితే బయటపడ్డ భారీ స్కామ్స్
తన కుమారుడిని చూసుకోవాల్సిన బాధ్యత ఉందని చెబుతూ శ్రీకాంత్ బెయిల్‌కు దరఖాస్తు చేసుకున్నా, కోర్టు అతని అభ్యర్థనను తిరస్కరించింది.
By: Tupaki Desk | 25 Jun 2025 5:42 PM ISTతమిళ సినీ పరిశ్రమలో పెద్ద ప్రకంపనలు సృష్టించిన కేసులో ప్రముఖ నటుడు శ్రీకాంత్ (శ్రీరామ్)ను చెన్నై పోలీసులు అరెస్ట్ చేశారు. ఇటీవల ఆయన నివాసంపై జరిగిన దాడిలో 7 కొకైన్ క్యాప్సూల్స్, 1 గ్రాము కొకైన్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ అరెస్ట్ వెనుక నకిలీ ప్రభుత్వ ఉద్యోగాల మోసం, డ్రగ్ ట్రాఫికింగ్, సైబర్ బ్లాక్‌మెయిల్ వంటి తీవ్రమైన నేరాలు ఉన్నట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది.
- నకిలీ ప్రభుత్వ ఉద్యోగాల ముఠా భగ్నం
ఈ కేసు మే 22న చెన్నైలోని ఓ నైట్‌క్లబ్‌లో జరిగిన గొడవతో వెలుగులోకి వచ్చింది. దర్యాప్తులో ప్రధాన నిందితుడిగా గుర్తించిన ప్రసాద్ ఇంటిపై పోలీసులు సోదాలు నిర్వహించగా, అతను నకిలీ ఉద్యోగాల ముఠాను నడుపుతున్నట్లు బయటపడింది. చెన్నై కార్పొరేషన్, రైల్వే, పన్ను శాఖల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మబలికి సుమారు 200 మందికి పైగా నిరుద్యోగుల నుంచి రూ. 2 లక్షల నుంచి రూ. 20 లక్షల వరకు వసూలు చేసినట్లు పోలీసులు తెలిపారు.
ఈ ముఠాలో పోలీసు శాఖకు చెందిన వారి భాగస్వామ్యం కూడా వెల్లడవడం మరింత షాకింగ్‌గా మారింది. మదురై మున్సిపల్ ఆర్ముడ్ పోలీస్‌కు చెందిన చీఫ్ కానిస్టేబుల్ సెంథిల్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. బాధితుల కాల్ రికార్డులు, లొకేషన్ డేటాను ఉపయోగించి వారిని బ్లాక్‌మెయిల్ చేసినట్లు సమాచారం.
- శ్రీకాంత్ పాత్ర ఏమిటి?
బ్యాంకు లావాదేవీలు, ఇతర వ్యక్తిగత ఆధారాలను బట్టి ఈ ముఠాతో శ్రీకాంత్‌కు సంబంధం ఉన్నట్లు తేలింది. గత మూడు సంవత్సరాలుగా ప్రసాద్, బెంగళూరుకు చెందిన ప్రదీప్, విదేశీయుడు జాన్‌తో కలిసి డ్రగ్స్ సరఫరా చేస్తున్నాడు.
తన కుమారుడిని చూసుకోవాల్సిన బాధ్యత ఉందని చెబుతూ శ్రీకాంత్ బెయిల్‌కు దరఖాస్తు చేసుకున్నా, కోర్టు అతని అభ్యర్థనను తిరస్కరించింది. ఈ డ్రగ్స్‌కు తనను పరిచయం చేయడంలో ఏఐఏడీఎంకే మాజీ నేత ప్రసాద్ పాత్ర ఉందని శ్రీకాంత్ కోర్టుకు తెలిపాడు. "తీంగిరై" సినిమా షూటింగ్ సమయంలోనే ఈ పరిచయం జరిగిందని అతను వెల్లడించాడు. ప్రస్తుతం శ్రీకాంత్‌ను పుజల్ జైలుకు తరలించారు.
- కేసులో మరిన్ని అరెస్టులు
ఈ కేసులో ప్రముఖులు అజయ్ వందయ్యార్‌తో సహా పలువురు నిందితులు ఇప్పటికే అరెస్టయ్యారు. మరికొందరు నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ కేసులో భూ ఆక్రమణలు, డ్రగ్ మాఫియా, నకిలీ ఉద్యోగ మోసం, సైబర్ బ్లాక్‌మెయిల్ వంటి అనేక తీవ్రమైన నేర కార్యకలాపాలు వెలుగులోకి వచ్చాయి. ఈ కేసు దర్యాప్తులో మరిన్ని ఆసక్తికర విషయాలు బయటపడే అవకాశం ఉంది.
