Begin typing your search above and press return to search.

రేర్ సీన్: బస్సులో వెళుతున్న ఆమె ఆ పోలీస్ సారు ను చూసి పరుగున వచ్చింది

తాజాగా మహంకాళి ఏసీపీ రవీందర్ సికింద్రాబాద్ రాష్ట్రపతి రోడ్డులో జరిగిన ఒక కార్యక్రమానికి సంబంధించి బందోబస్తు కార్యక్రమంలో ఉన్నారు.

By:  Tupaki Desk   |   28 Aug 2023 5:40 AM GMT
రేర్ సీన్: బస్సులో వెళుతున్న ఆమె ఆ పోలీస్ సారు ను చూసి పరుగున వచ్చింది
X

ఖాకీ అంటే కఠినంగా ఉంటారన్న నెగిటివ్ ఫీలింగ్ చాలామందిలో ఉంటుంది. అందుకు తగ్గట్లే కొందరి పోలీసుల తీరుతో.. డిపార్టు మెంట్ మీదా.. అందులో పని చేసే పోలీసుల మీదా తప్పుడు అభిప్రాయం చాలామందిలో ఉంటుంది. దీనికి తోడు.. వెళ్లక వెళ్లక తమ జీవితంలో ఒకట్రెండుసార్లు స్టేషన్ కు వెళ్లిన సమయంలోనే.. చేదు అనుభవాలు ఎదురవుతుంటాయి కొందరికి. ఏతావాతా పోలీసులు అన్నంతనే.. మనకెందుకులే కాస్తంత దూరంగా ఉందామన్న భావన కలుగుతుంది. అలాంటి ఫీలింగ్ ను పటాపంచలు చేసే ఉదంతం ఒకటి హైదరాబాద్ లో చోటు చేసుకుంది.

తాజాగా మహంకాళి ఏసీపీ రవీందర్ సికింద్రాబాద్ రాష్ట్రపతి రోడ్డులో జరిగిన ఒక కార్యక్రమానికి సంబంధించి బందోబస్తు కార్యక్రమంలో ఉన్నారు. అదే సమయంలో కార్వాన్ కు చెందిన కవిత అనే మహిళ.. ఆర్టీసీ బస్సులో వెళుతున్నారు.

రోడ్డు మీద ఏసీపీ రవీందర్ ను చూసిన ఆమె.. వెంటనే తాను ప్రయాణిస్తున్న బస్సు నుంచి దిగేసిన ఆమె.. నేరుగా ఏసీపీ సార్ వద్దకు వెళ్లి.. రెండు చేతులు జోడించి ఏడ్చేసింది. సార్.. నేను బతికి ఉన్నానంటే కారణం మీరే అంటూ భావోద్వేగానికి గురైంది. ఆమెను గుర్తించిన రవీందర్ ఆమెను అనునయించి పంపారు.

అదెలానంటే.. దాదాపు పదేళ్ల క్రితం (2014లో) రవీందర్ అప్పట్లో టప్పాఛబుత్ర పోలీస్ స్టేషన్ కు సీఐగా వ్యవహరిస్తున్నారు. ఆ సమయంలో రోడ్డు మీద అనారోగ్యంతో బాధ పడుతున్న కవితను చూసిన ఆయన స్పందించి. వెంటనే ఆసుపత్రిలో చేర్పించారు. ఆమె పరిస్థితి గురించి తెలుసుకొని.. ఆలస్యం చేయకుండా తన సొంత డబ్బులతో చికిత్స చేయించటంతో పాటు.. ఆపరేషన్ చేయించారు. ఈ ఘటన జరిగి దాదాపు పదేళ్లు కావొస్తోంది. ఆదివారం కవిత సికింద్రాబాద్ కు ఆర్టీసీ బస్సులో వెళుతున్న వేళ.. ఏసీపీ సార్ కనిపించేసరికి చప్పున బస్సు దిగేసింది.

వెంటనే ఆయన వద్దకు వెళ్లి.. గతంలో జరిగిన విషయాల్ని గుర్తు చేసి భావోద్వేగానికి గురై.. ఈ ఏడాది తాను రాఖీ కొన్నానని.. తనకు అనుమతిస్తే తాను రాఖీ పండుగ రోజున వచ్చి రాఖీ కడతానని పేర్కొన్నారు. దీనికి స్పందించిన ఏసీపీ రవీందర్ తన ఫోన్ నెంబరును కవితకు ఇచ్చారు. ఈ ఉదంతం గురించి తెలిసిన వారంతా ఏసీపీ రవీందర్ ను అభినందిస్తున్నారు. హేట్సాప్ రవీందర్.