Begin typing your search above and press return to search.

చంద్రబాబు ఢిల్లీ టూర్ వేళ... అచ్చెన్న ఆసక్తికర వ్యాఖ్యలు!

చంద్రబాబు ఢిల్లీకి ఎందుకు వెళ్లింది.. ఆయనకు ఆయనే రిక్వస్ట్ చేసుకుని వెళ్లారా.. లేక, బీజేపీ పెద్దలు వారికి వారే ఫోన్ చేసి పిలిపించుకున్నారా అనే విషయాలపై స్పందించారు!

By:  Tupaki Desk   |   8 Feb 2024 5:23 AM GMT
చంద్రబాబు ఢిల్లీ టూర్  వేళ... అచ్చెన్న ఆసక్తికర వ్యాఖ్యలు!
X

ఏపీలో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. ప్రధానంగా వైసీపీ ఒంటరిగా బరిలోకి దిగుతున్న వేళ.. నిన్నమొన్నటివరకూ టీడీపీ - జనసేన మాత్రమే పొత్తులో ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు వీరితో పాటు జతకట్టడానికి బీజేపీ కూడా ఉత్సాహం చూపిస్తుందని అంటున్నారు. అయితే బీజేపీ నేతలు మాత్రం.. ఇరువర్గాల ప్రయోజనాల కోసమే ఈ కూటమి అని వ్యాఖ్యానిస్తున్నారు. ఈ సమయంలో అచ్చెన్న స్పందించారు.

అవును... ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ ఏపీలో రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. ఇందులో భాగంగా ఏపీలో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదని.. అందుకోసం టీడీపీ - జనసేనతో పాటు బీజేపీ కూడా జతకట్టాలని పవన్ కోరుకున్న సంగతి తెలిసిందే. లోలోపల బాబు కూడా ఇదే కోరికతో ఉన్నారని అంటున్నారు! అయితే... ఆ వేచి చూసిన సమయం వచ్చేసింది!! ప్రస్తుతం ఢిల్లీలో బీజేపీ పెద్దలతో చంద్రబాబు, పవన్ ల భేటీ.. అనంతరం ప్రెస్ మీట్ ఉండొచ్చని అంటున్నారు.

ఈ సందర్భంగా స్పందించిన ఏపీ టీడీపీ చీఫ్ అచ్చెన్నాయుడు... చంద్రబాబు ఢిల్లీకి ఎందుకు వెళ్లింది.. ఆయనకు ఆయనే రిక్వస్ట్ చేసుకుని వెళ్లారా.. లేక, బీజేపీ పెద్దలు వారికి వారే ఫోన్ చేసి పిలిపించుకున్నారా అనే విషయాలపై స్పందించారు! ఇందులో భాగంగా... బీజేపీ పెద్దల ఆహ్వానం మేరకే చంద్రబాబు ఢిల్లీ వెళ్లారని అచ్చెన్నాయుడు తెలిపారు. వీరి భేటీ అనంతరం చంద్రబాబే వివరాలు వెళ్లడిస్తారని అన్నారు.

ఇక ఈ సందర్భంగా పొత్తులపై మాట్లాడిన అచ్చెన్నాయుడు... తాము ఎవరితో పొత్తు పెట్టుకున్నా అది రాష్ట్ర ప్రయోజనాలకోసమే.. ఇదే సమయంలో ఐదుకోట్ల ఆంధ్రుల కోసమే అని చెప్పడం గమనార్హం.

ఆ సంగతి అలా ఉంటే... మరోవైపు పవన్ కళ్యాణ్ కు కూడా ఢిల్లీ రావాలని ఆహ్వానం అందడంతో... ఈ పొత్తుల చర్చలపై మరింత ఆసక్తి నెలకొంది. దీంతో చంద్రబాబు, పవన్ తో అమిత్ షా, జేపీ నడ్డా సమావేశమై సీట్ల సర్దుబాట్లపై ఒక డెసిషన్ కి వస్తారని అంటున్నారు. ఈ నేపథ్యంలో టీడీపీ - జనసేన - బీజేపీ పొత్తు ఆల్ మోస్ట్ ఫైనల్ అయినట్లే అనే కామెంట్లు వినిపిస్తున్నాయి. మరి ఈ సందర్భంగా సీట్ల సర్దుబాటు విషయంలో చంద్రబాబు... బీజేపీ, టీడీపీలకు ఎన్నేసి కేటాయిస్తారనేది వేచి చూడాలి!!