Begin typing your search above and press return to search.

రాయి ఉదంతంలో దుర్గారావు రిలీజ్.. హెబియస్ కార్పస్ ఎఫెక్టు!

సాధారణంగా నేరం ఏదైనా.. అనుమానితుడ్ని అదుపులోకి తీసుకున్న 24 గంటల వ్యవధిలో న్యాయస్థానం ముందు ప్రవేశ పెట్టాల్సి ఉంటుంది

By:  Tupaki Desk   |   21 April 2024 5:30 AM GMT
రాయి ఉదంతంలో దుర్గారావు రిలీజ్.. హెబియస్ కార్పస్ ఎఫెక్టు!
X

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై గులకరాయి విసిరిన ఉదంతానికి సంబంధించి ఇప్పటికే సతీష్ ను రిమాండ్ కు తరలించగా.. ఇదే ఉదంతంలో దుర్గారావును పోలీసులు అదుపులోకి తీసుకోవటం.. నాలుగు రోజులైన తర్వాత కూడా అతడి ఆచూకీ బయటకు రాకపోవటం తెలిసిందే. ఈ నేపథ్యంలో దుర్గారావు విడుదల కోసం పెద్ద ఎత్తున ఆందోళన.. నిరసన వ్యక్తమైనా పోలీసులు స్పందించలేదు. అయితే.. దుర్గారావు ఆచూకీని తెలియజేయాలని కోరుతూ హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ ను దాఖలు చేయటంతో పోలీసులు.. దుర్గారావు ఆచూకీ తెలియజేయటంతో పాటు.. అతడ్ని విడుదల చేశారు.

సాధారణంగా నేరం ఏదైనా.. అనుమానితుడ్ని అదుపులోకి తీసుకున్న 24 గంటల వ్యవధిలో న్యాయస్థానం ముందు ప్రవేశ పెట్టాల్సి ఉంటుంది. అందుకు భిన్నంగా దుర్గారావును నాలుగు రోజులుగా పోలీసులు తమ అదుపులోనే ఉంచుకోవటం.. చట్టపరమైన అనుమతులు తీసుకోని వైనంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సీఎంపై గులకరాయి విసిరిన ఉదంతంలో అనుమానితుడిగా ఉన్న దుర్గారావును పోలీసులు విడుదల చేశారు.

ఇదిలా ఉండగా దుర్గారావు ఆచూకీ తెలియజేయాలని అతడి భార్య.. ఇద్దరు పిల్లలతో పాటు.. వారి బంధువులంతా రోడ్ల మీదకు వచ్చి నిరసన వ్యక్తం చేయటం.. ఆందోళనలు చేపట్టటంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో 160 సీఆర్పీసీ కింద నోటీసు ఇచ్చి.. అవసరమైతే స్టేషన్ కు పిలుస్తామని.. అందుబాటులో ఉండాలని పేర్కొంటూ దుర్గారావును విడుదల చేశారు.

పోలీసుల నుంచి బయటకు వచ్చిన దుర్గారావు కొంతమంది మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. ఏప్రిల్ పదహారున సింగ్ నగర్ డాబాకొట్ల రోడ్ లోని టీకొట్టు వద్ద తాను టీ తాగుతుంటే.. పోలీసులు అక్కడికి వచ్చారన్న దుర్గారావు.. ‘‘మాట్లాడాల్సిన పని ఉందని చెప్పి బండి ఎక్కమంటూ పోలీసుల జీపులో తీసుకెళ్లారు. సీసీఎస్ లో నన్ను.. సతీశ్ ను పక్క పక్క గదుల్లో ఉంచి విచారించారు. సతీశ్ తో నాకు పరిచయం లేదని చెప్పా. దీంతో ఇద్దరిని కలిసి విచారించారు. నేను చెప్పింది నిజమన్న విషయాన్ని పోలీసులు గుర్తించారు. అందుకు విడిచి పెట్టారు. నన్ను పోలీసు వాహనంలో ఎక్కించిన తర్వాత విజయవాడ సీసీఎస్ కు తీసుకెళ్లారు. మధ్యాహ్నం మూడు గంటల వరకు అక్కడే ఉంచారు. తర్వాత మైలవరంలోని సీఐ కార్యాలయానికి తీసుకెళ్లారు. శనివారం మధ్యాహ్నం 2 గంటల వరకు అక్కడే ఉంచారు. మళ్లీ విజయవాడ సీసీఎస్ కు తీసుకొచ్చారు. ఇప్పుడు ఇంటి కుటుంబ సభ్యులకు అప్పజెప్పారు’’ అంటూ తనను పోలీసులు అదుపులోకి తీసుకున్న తర్వాతేం జరిగిందో చెప్పుకొచ్చాడు దుర్గారావు మరి ఇప్పుడు అసలు ఏ2 ఎవరు అన్న ఉత్కంఠ నెలకొన్నది.