Begin typing your search above and press return to search.

మణికొండలో ఏసీబీ రైడ్... ప్రస్తుతానికి రూ.100 కోట్లు!!

ఈ సమయంలో.. శివ బాలకృష్ణపై ఆదాయానికి మించి ఆస్తుల కేసును ఏసీబీ నమోదు చేసిందని తెలుస్తుంది.

By:  Tupaki Desk   |   24 Jan 2024 5:35 PM GMT
మణికొండలో ఏసీబీ రైడ్... ప్రస్తుతానికి  రూ.100 కోట్లు!!
X

హెచ్‌.ఎం.డీ.ఏ మాజీ డైరెక్టర్ ఇంట్లో ఏసీబీ సోదాలు కలకలం రేపుతున్నాయి. బుధవారం హైదరాబాద్ మెట్రో డెవలప్ మెంట్ అథారిటీ (హెచ్.ఎం.డీ.ఏ) మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణ ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ సమయంలో.. శివ బాలకృష్ణపై ఆదాయానికి మించి ఆస్తుల కేసును ఏసీబీ నమోదు చేసిందని తెలుస్తుంది. ఈ క్రమంలో బుధవారం ఏసీబీ అధికారులు తనిఖీలు చేపట్టారు.

అవును... హెచ్.ఎం.డీ.ఏ మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణ ఇళ్లలో అవినీతి నిరోధక శాఖ సోదాలు చేస్తోంది! ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 20 ప్రాంతాల్లో ఈ సోదాలు జరుగుతున్నాయని తెలుస్తుంది. ఈ సోదాల్లో ఇప్పటివరకూ సుమారు వంద కోట్ల రూపాయలకు పైగా అక్రమాస్తులను గుర్తించినట్లు కథనాలొస్తున్నాయి. ఇందులో భాగంగా సుమారు 14 టీం లతో బాలకృష్ణ ఇళ్లలో ఏసీబీ రైడ్ చేసిందని తెలుస్తున్న నేపథ్యంలో... గురువారం కూడా ఈ సోదాలు కొనసాగే అవకాశం ఉందని సమాచారం.

ఈ విషయాలపై అందుతున్న సమాచారం ప్రకారం... ఏసీబీ సోదాల్లో బాలకృష్ణ కుటుంబ సభ్యులు సహకరించడం లేదని అంటున్నారు. అయినప్పటికీ తమపని తాము చేసుకుపోతూ ఉన్న ఏసీబీ అధికారులు... ఇప్పటికే సుమారు రూ.100 కోట్లకు పైగా ఆస్తులు, బంగారం, బాంక్ డిపాజిట్స్, బినామీల వివరాలను గుర్తించినట్లు చెబుతున్నారు. ఇదే సమయంలో బ్యాంక్ లాకర్స్ తోపాటు ఇతర ఆస్తులపైనా లోతుగా దర్యాప్తు చేయాల్సి ఉందని సమాచారం.

బుధవారం ఏసీబీ అధికారులు మణికొండలోని హెచ్.ఎం.డీ.ఏ మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణ ఇంట్లో తనిఖీలు మొదలుపెట్టగా.. ఏసీబీ అధికారులకు దిమ్మతిరిగే స్థాయిలో ఆస్తులు బయటపడ్డాయని ప్రచారం జరుగుతుంది. ఈ క్రమంలో బాలకృష్ణ ఆస్తులు సుమారు రూ.500 కోట్లవరకూ ఉండొచ్చని ఏసీబీ అంచనా వేస్తుందని.. ఈ క్రమంలో ఇప్పటివరకూ సుమారు రూ.100 కోట్ల ఆస్తులు గుర్తించారని అంటున్నారు.

ఈ సందర్భంగా కీలక డాక్యుమెంట్లు, ఆభరణాలు, నగదును ఏసీబీ అధికారులు సీజ్ చేశారని అంటున్నారు! హెచ్.ఎం.డీ.ఏ. ప్లానింగ్ విభాగంలో కీలక స్థానంలో పనిచేసిన బాలకృష్ణ సుమారు రూ.500 కోట్ల మేర ఆస్తులు కూడబెట్టినట్లు ఏసీబీ అధికారులు అనుమానిస్తున్నారు!! ఈ దాడులకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.