Begin typing your search above and press return to search.

ఏసీల కు కొత్త రూల్.. 20 డిగ్రీల కంటే తక్కువ పెట్టే వీలుండదు

ఏసీ వినియోగం మీకు కొత్త కాదు. అవసరమైతే 18 డిగ్రీలు.. మరింత కనిష్ఠం కావాలంటే 16 డిగ్రీల సెల్సియస్ వరకు పెట్టుకునే వీలుంటుంది.

By:  Tupaki Desk   |   11 Jun 2025 8:30 AM
ఏసీల కు కొత్త రూల్.. 20 డిగ్రీల కంటే తక్కువ పెట్టే వీలుండదు
X

ఏసీ వినియోగం మీకు కొత్త కాదు. అవసరమైతే 18 డిగ్రీలు.. మరింత కనిష్ఠం కావాలంటే 16 డిగ్రీల సెల్సియస్ వరకు పెట్టుకునే వీలుంటుంది. ఇకపై అలా కుదరదు. ఏసీల టెంపరేచర్ కు సంబంధించి కొత్త నిబంధనలు తీసుకొచ్చేందుకు కేంద్రం సిద్ధమైంది. టెంపరేచర్ ను సెట్ చేసుకునేందుకు ఇప్పటివరకు ఉన్న ఫీచర్లను మార్చబోతున్నారు. ఇప్పటివరకు ఏసీలను కనిష్ఠంగా 16 డిగ్రీల నుంచి మొదలు కాక.. కొత్తగా తీసుకున్న నిర్ణయం ప్రకారం కనిష్ఠం 20 డిగ్రీల నుంచి మొదలు కానుంది. గరిష్ఠంగా 28 డిగ్రీల సెల్సియస్ మించకుండా ఉండేలా కొత్తగా తయారయ్యే ఏసీలకు ప్రమాణాల్ని నిర్దేశిస్తూ నిర్ణయం తీసుకున్నారు.

ఈ విషయాన్ని కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ వెల్లడించారు. ఏసీల్లో ఎంత టెంపరేచర్ ఉండాలన్న దానికి ప్రభుత్వం ఈ తరహా నిర్ణయాన్ని ఎందుకు తీసుకుంటున్నట్లు? అన్న ప్రశ్నకు.. తగిన కారణాలు ఉన్నట్లుగాచెబుతున్నారు. ఏసీల వినియోగంలో యూనిఫాం పద్దతిని తీసుకురావటం ద్వారా.. అధిక విద్యుత్ వినియోగాన్ని తగ్గించటమే అసలు ఉద్దేశంగా చెబుతున్నారు.

దేశంలో చాలా ఇళ్లల్లోనూ.. ఆఫీసుల్లోనూ 20 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువలోనే ఏసీల్ని వినియోగిస్తున్నట్లుగా కేంద్ర మంత్రి పేర్కొన్నారు. ఏసీల వినియోగం తీరు తెన్నుల అంశంపై బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియెన్సీ ఒక సర్వేను నిర్వహించింది. ఇందులో అధిక ఏసీలు 20-21 డిగ్రీల మధ్యనే నడుస్తున్నట్లుగా గుర్తించారు.

వాస్తవానికి ఏసీల్ని 24-26 డిగ్రీల మద్యన వినియోగిస్తే ఆ మేర విద్యుత్ ఆదా అవుతుంది. ఒక్కో డిగ్రీ సెల్సియస్ పెంచుకుంటూ వెళ్లటం కారణంగా ఆరు శాతం విద్యుత్ ఆదా అవుతుంది. ఇలా చేయటం వల్ల కరెంటు బిల్లుతో పాటు.. కర్బన ఉద్గారాల్ని తగ్గించేందుకు సాయం చేస్తుంది. అందుకే.. ఇకపై వచ్చే ఏసీల్లో కనిష్ఠ టెంపరేచర్ 20 డిగ్రీలనుంచి షురూ కానుంది. పాత ఏసీలకు గిరాకీ పెరుగుతుందని చెప్పక తప్పదు.