ఈ సమ్మర్ కు ఏసీ కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా? షాక్ తప్పదు
ఈ వేసవికిఏసీ కొనాలనుకునే వారికి కూల్ షాక్ తప్పదంటున్నారు. ఇటీవల కాలంలో చోటు చేసుకున్న పరిణామాలతో ఏసీల ధరలు పెరగటం ఖాయమంటున్నారు.
By: Garuda Media | 25 Feb 2026 10:25 AM ISTవేసవి వస్తుందంటే చాలు.. కూలర్లు.. ఏసీలు.. ఫ్రిజ్ లకు డిమాండ్ పెరుగుతోంది. గడిచిన పాతికేళ్లలో ఫ్రిజ్ లు తప్పనిసరి కాగా.. గడిచిన పుష్కర కాలంలో ఏసీల పరిస్థితి కూడా అలానే మారుతున్న పరిస్థితి. వాతావరణంలో చోటు చేసుకున్న మార్పుల కారణం.. ఏసీల వినియోగం అంతకంతకూ పెరుగుతోంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రతి మధ్యతరగతి ఇంట్లో కనీసం ఒక ఏసీ తప్పనిసరిగా మారింది. నిత్యవసరంగా మారిన ఏసీ కొనుగోళ్ల నేపథ్యంలో గడిచిన పదేళ్లలో ఏసీ అమ్మకాలు అంతకంతకూ పెరుగుతున్న పరిస్థితి.
ఈ వేసవికిఏసీ కొనాలనుకునే వారికి కూల్ షాక్ తప్పదంటున్నారు. ఇటీవల కాలంలో చోటు చేసుకున్న పరిణామాలతో ఏసీల ధరలు పెరగటం ఖాయమంటున్నారు. అంతర్జాతీయంగా చోటుచేసుకున్న పరిణామాలు ఇందుకు కారణంగా చెబుతున్నారు. రాగి ధరలు పెరగటం.. డాలర్ తో పోలిస్తే రూపాయి బలహీనపడటం కూడా ఏసీల ధరలు పెరగనున్నాయని చెబుతున్నారు.
గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది ఏసీల అమ్మకాల్లో 15 శాతం పెరుగుదల ఉంటుందని భావిస్తున్నారు. అదే సమయంలో ఏసీ ధరల పెరుగుదలలోనూ 15 శాతం.. అంతకంటే ఎక్కువగా ఉన్నా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదంటున్నారు. దీనికి పలు అంశాలు కారణాలుగా చెబుతున్నారు. విద్యుత్ వినియోగ సామర్థ్యాన్ని పెంచేందుకు వీలుగా ఎనర్జీ లేబుల్ మార్పులు కూడా ఏసీ ధరలు పెరగటానికి కారణమంటున్నారు.
దీంతో పాటు.. ఏసీల్లో వినియోగించే రాగి.. ఆల్యూమినియం.. స్టీల్ వంటి మెటల్స్ ధరలు పెరగటం కూడా ఏసీ ధరలు పెరగటానికి కారణమంటున్నారు. గత ఏడాది రాగి ధర టన్ను రూ.8500 డాలర్లు ఉంటే.. ఇప్పుడది ఏకంగా 13 వేల డాలర్లు కావటం అంటున్నారు. దీనికి తోడు ఏసీల్లో వినియోగించే కొన్ని విడి భాగాలు విదేశాల నుంచి దిగుమతి చేసుకునే పరిస్థితి. ఈ కారణంగా కూడా ఏసీ ధరల పెరుగుదల కారణమవుతుందని చెబుతన్నారు.
అయితే.. రానున్న రెండేళ్లలో పలు ఏసీ సంస్థలు దేశీయంగా పలు విడిభాగాల తయారీ దిశగా అడుగులు పడుతున్న వేళ.. భవిష్యత్తులో ధరల పెంపు ఇంత జోరుగా ఉండదంటున్నారు. మొత్తంగా ఏసీల ధరల పెరుగుదల ఈ ఏడాదికి మాత్రం పక్కాగా అని స్పష్టం చేస్తున్నారు. సో.. ఈసారికి ఏసీ కొనుగోలు చేసే వారి పర్సుల మీద మరింత భారాన్ని మోపుతుందని చెప్పక తప్పదు.
