Begin typing your search above and press return to search.

ఓవైపు రామాలయం నిర్మాణం.. వీరికి ఇదేం పాడు బుద్ధి!

ఈ నాటకంలో సీత పాత్ర ధరించిన ఓ పురుషుడు సిగరెట్‌ తాగుతున్నట్టు, ఆ సిగరెట్‌ ను రాముడి పాత్రలో ఉన్న వ్యక్తి అగ్గిపుల్ల వెలిగిస్తున్నట్టు చేశారు.

By:  Tupaki Desk   |   4 Feb 2024 4:03 AM GMT
ఓవైపు రామాలయం నిర్మాణం.. వీరికి ఇదేం పాడు బుద్ధి!
X

రామజన్మభూమి (అయోధ్య)లో రామాలయ నిర్మాణంతో ఎన్నో దశాబ్దాల భారతీయుల కల నెరవేరింది. రాముడికి ఆలయం నిర్మించడం, అందులో రాముడి విగ్రహాన్ని ప్రతిష్టించడంతో దేశవ్యాప్తంగా ఆబాలగోపాలం సంతోష సంబరాల్లో మునిగితేలుతోంది. ఇంకా ఆ ఆనందోత్సాహాల నుంచి ప్రజలు తేరుకున్నదీ లేదు.. కానీ ఇంతలోనే మహారాష్ట్రలో కొందరు తమ పాడు బుద్ధిని ప్రదర్శించారు.

రామాయణాన్ని కించపరుస్తూ నాటకాన్ని ప్రదర్శించారు. ఇదెవరూ పనిపాటా లేనివారు చేసింది కాదు. ఏకంగా ఒక ప్రొఫెసర్, ఆయన ఆధ్వర్యంలో కొందరు యూనివర్సిటీ విద్యార్థులు ఇందుకు తెగించారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా వివాదం రేపడంతో పోలీసులు ప్రొఫెసర్‌ తోపాటు ఐదుగురు విద్యార్థులను కూడా అరెస్టు చేశారు.

వివరాల్లోకి వెళ్తే.. పుణెలోని సావిత్రీభాయ్‌ ఫూలే విశ్వవిద్యాలయంలోని లలిత కళా పరిషత్‌ లో రామాయణం నాటకాన్ని ప్రదర్శించారు. ఇందులో రామాయణ పాత్రధారులు తెర వెనుక ఎలా ప్రవర్తిస్తారనే ఊహాజనిత కోణంలో ఈ నాటకాన్ని రూపొందించారు.

ఈ నాటకంలో సీత పాత్ర ధరించిన ఓ పురుషుడు సిగరెట్‌ తాగుతున్నట్టు, ఆ సిగరెట్‌ ను రాముడి పాత్రలో ఉన్న వ్యక్తి అగ్గిపుల్ల వెలిగిస్తున్నట్టు చేశారు. అంతేకాకుండా లక్ష్మణుడి పాత్రధారి అసభ్యంగా మాట్లాడినట్టు నాటకాన్ని ప్రదర్శించారు. దీంతో అఖిల భారత విద్యార్థి పరిషత్‌ (ఏబీవీపీ) కార్యకర్తలు అభ్యంతరం తెలిపారు. నాటకాన్ని ఆపివేయాలని కోరారు.

ఈ క్రమంలో నిందితులు ఏబీవీపీ కార్యకర్తలపై దాడికి పాల్పడ్డారు. దీంతో పోలీసులకు ఫిర్యాదు వెళ్లింది. యూనివర్సిటీకి చేరుకున్న పోలీసులు రామాయణంలోని పాత్రలను కించపరిచేలా నాటకాన్ని ప్రదర్శించి, మత విశ్వాసాలను దెబ్బతీశారనే ఆరోపణలపై సావిత్రీభాయ్‌ ఫూలే విశ్వవిద్యాలయానికి చెందిన ఓ ప్రొఫెసర్‌ తోపాటు ఐదుగురు విద్యార్థులను అరెస్టు చేశారు.