ప్రసన్న జైలుకు వెళ్తే టీడీపీ జనసేనలో చాలా మంది జైలుకు వెళ్ళాలి కదా !
ఇక కోవూరు మాజీ మంత్రి వైసీపీ సీనియర్ నేత నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి టీడీపీ మహిళా ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డిని ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆయనను అరెస్టు చేయాలని కోరుతున్నారు.
By: Tupaki Desk | 17 July 2025 7:00 PM ISTఅసభ్య పదాలు వాడడం నయా పొలిటికల్ ట్రెండ్ అయిపోయిందేమో. తెలంగాణాలో ఒక నాయకుడు కంచం పొత్తు అంటూనే మంచం పొత్తు అనేశారు. అది కూడా ఒక మహిళా నాయకురాలి విషయంలో. ఆలోచిస్తే ఎంత అసభ్యంగా ఆ పద ప్రయోగం ఉందో. కానీ తన ఉద్దేశ్యం అది కాదని తరువాత వివరణ ఇచ్చాడనుకోండి. ఇక ఏపీలో చూస్తే మహిళా రాజకీయ నేతలకు ఎంత గౌరవం ఇస్తున్నారు అన్నది వేరేగా చెప్పాల్సింది లేదు. బాధితులు అటూ ఇటూ అనేక మంది ఉన్నారు. సోషల్ మీడియా వచ్చాక ఎవరి నోరు దురద ఏమిటి తెలుస్తోంది కానీ గతంలోనూ ప్రైవేటుగా చాలా మంది ఇలాగే అనేవారు.
ఇక కోవూరు మాజీ మంత్రి వైసీపీ సీనియర్ నేత నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి టీడీపీ మహిళా ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డిని ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆయనను అరెస్టు చేయాలని కోరుతున్నారు. నిజమే ఆయన తప్పుగానే మాట్లాడారు. అయితే ఒక్క ప్రసన్న మాత్రమే మొదటిసారి ఈ విధంగా మాట్లాడలేదు కదా అన్న చర్చ సాగుతోంది.
గతంలో మంత్రిగా ఉన్న రోజా విషయంలో విశాఖకు చెందిన టీడీపీ సీనియర్ నేత ఏ విధంగా మాట్లాడారో అంతా చూశారు. అంతే కాదు ఒక పార్టీ అధినేత అయితే డైమండ్ రాణి అన్నారు. మరి అది పొగడ్త లేక సెటైరా లేక మరేమిటో ఆయన చెప్పలేదు. అంతే కాదు అదే నాయకుడు మరో వైసీపీ మహిళా మంత్రి మేకప్ మీద కూడా విమర్శలు చేశారు.
అంటే చూడబోతే వారూ వీరూ అని కాదు చాలా కాలంగా ఈ తరహా విమర్శలు అనుచిత వ్యాఖ్యలు చేసుకుంటున్నారు అన్నది అర్థం అవుతోంది కదా. ఇలా అసభ్య పదజాలం వాడారని ప్రసన్నకుమార్ రెడ్డిని జైలు పాలు చేయాలనుకుంటే చాలా మంది టీడీపీ జనసేన నాయకులను జైలుకు పంపాల్సి వస్తుందని అంటున్నారు. ఇక్కడ ప్రసన్నను సమర్ధించడం ఎవరి ఉద్దేశ్యమూ కాదు, కానీ ఒకటే శిక్ష అందరికీ ఉండాలి కదా అన్న సహజ న్యాయ సూత్రం ప్రకారమే ఈ విశ్లేషణ జరుగుతోంది.
కరెక్ట్ గా అవే సెక్షన్లను ఉపయోగించి చాలా మంది టీడీపీ జనసేన నేతలను జైళ్ళకు పంపించాలని అంటున్నారు. అనేక మందికి ఈ మధ్య నోటి దురద ఎక్కువగానే ఉందని అంటున్నారు. ఒకవేళ వారు అధికార పార్టీలో ఉన్నారు, తమ వారు అని తర తమ భేద భావం కనుక కూటమి ప్రభుత్వం పెద్దలు చూపిస్తే కనుక వైసీపీ ఈ విషయంలో ఆందోళన చేసి అయినా పెట్టించాలని చూస్తే అపుడు వారికే ఇబ్బంది అవుతుంది కదా అంటున్నారు.
అంతే కాదు వైసీపీ ప్రైవేట్ కేసులను వేసి కోర్టుల ద్వారా డైరెక్షన్స్ తీసుకుని వచ్చి ఈ తరహా నోటి దురద నేతలను అరెస్ట్ చేయించే ప్రయత్నం చేస్తే అపుడు వారి పరిష్తితి ఏమిటి అన్న చర్చ కూడా సాగుతోంది ఒక మాట అనడం నాలుగు పడడం అన్నది అలవాటుగా మారిపోయింది.
రాజకీయాల్లో ఇపుడు ఎలాంటి సిద్ధాంతపరమైన విమర్శలు లేవు అవతల వారి బలహీనతలనే అడ్డు పెట్టుకుని విమర్శలు చేస్తున్నారు. ఆడవారు అయితే మరీ దారుణంగా విమర్శలు చేస్తున్నారు అలాంటి వారు ఏ పార్టీలో ఉన్నా ఎంతటి పెద్ద స్థానాలలో ఉన్నా కూడా వారిని పట్టుకుని చట్టం ముందు పెట్టినప్పుడే ఈ అనుచితమైన మాటలకు అడ్డుకట్ట పడుతుంది అని అంటున్నారు. ఏకపక్షంగా ఈ చర్యలు ఉంటే మాత్రం ఈ రాజకీయ గబ్బుని ఇంకా చాలా కాలం భరించాల్సి వస్తుందని అంటున్నారు.
