Begin typing your search above and press return to search.

అభిషేక్ మను సింఘ్వీ: లాయర్ గా కోర్టుకు రావాలంటే రూ.15 లక్షలు ఛార్జ్

రాజ్యసభకు జరుగుతున్న ఎన్నికల్లో తెలంగాణ నుంచి తన ఇద్దరు అభ్యర్థుల్నిఅధికారికంగా ప్రకటించింది కాంగ్రెస్ పార్టీ.

By:  Garuda Media   |   5 March 2026 11:02 AM IST
అభిషేక్ మను సింఘ్వీ: లాయర్ గా కోర్టుకు రావాలంటే రూ.15 లక్షలు ఛార్జ్
X

రాజ్యసభకు జరుగుతున్న ఎన్నికల్లో తెలంగాణ నుంచి తన ఇద్దరు అభ్యర్థుల్నిఅధికారికంగా ప్రకటించింది కాంగ్రెస్ పార్టీ. అందులో మొదటివారు ప్రముఖ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ. దేశంలోనే ప్రముఖ న్యాయవాదిగా.. సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాదిగా ఆయనకున్న పేరుప్రఖ్యాతులు తక్కువేం కావు. ఆయన స్థాయిని సింఫుల్ మాటల్లో.. అందరికి అర్థమయ్యేలా చెప్పాలంటే.. ఆయన లాయర్ గా కోర్టుకు హాజరయ్యేందుకు ఇవ్వాల్సిన ఫీజ్ దగ్గరదగ్గర రూ.15 లక్షల వరకు ఉంటుంది. కాంగ్రెస్ పార్టీలో ముఖ్యనేతల్లో ఆయన ఒకరు.

2006 నుంచి రాజ్యసభ సభ్యుడిగా వ్యవహరిస్తున్న ఆయనకు కాంగ్రెస్ పార్టీ మరోసారి రాజ్యసభకు పంపేందుకు సిద్ధమైంది. సుప్రీంకోర్టులో అత్యధిక పారితోషికం తీసుకునే న్యాయవాదుల్లో ఒకరిగా ఆయనకు పేరుంది. గతంలో భారత అదనపుసొలిసిటర్ జనరల్ గా పని చేశారు. పార్టీ న్యాయ, మానవహక్కుల విభాగానికి ఛైర్మన్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. కేంబ్రిడ్జ్ వర్సిటీ నుంచి పీహెచ్ డీ పట్టా పొందిన ఆయనకు గెలుపోటములు కొత్త కాదు. గతంలో హిమాచల్ ప్రదేశ్ నుంచి రాజ్యసభ ఎన్నికల్లో ఓడారు. 2024 ఫిబ్రవరిలో హిమాచల్ ప్రదేశ్ నుండి జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ కారణంగా ఆయన అనూహ్యంగా ఓడారు. పార్టీకి అత్యంత విధేయుడైన సీనియర్ నేతకు సముచిత స్థానం కల్పించాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ సురక్షితమైన తెలంగాణ స్థానాన్ని కేటాయించింది. ప్రముఖ లాయర్ గా ఆయన ఛార్జ్ చేసే ఫీజు విషయంపై ఆసక్తికర విషయాలు చెబుతుంటారు.

కోర్టులో ప్రతి అపీరియన్స్ కు ఆయన కనిష్ఠంగా రూ.6 లక్షలు..గరిష్ఠంగా రూ.15 లక్షలు వసూలు చేస్తారని.. సాధారన కేసు విచారణలకు రూ.16.5 లక్షలు ఆయన ఫీజు ఉంటుందని చెబుతారు. కీలక విచారణ కోసం కోర్టుకు హాజరయ్యేందుకు ఏకంగా రూ.25 లక్షలు ఆయన ఫీజు ఉంటుందంటారు. ఆయన వార్షిక ఆదాయం రూ.10 నుంచి రూ.15 కోట్ల వరకు ఉంటుందంటారు. 2024 నాటి ఆయన వెల్లడించిన ఆస్తుల ప్రకారం ఆయన.. ఆయన కుటుంబ సభ్యులు మొత్తం ఆస్తుల విలువ రూ.1872 కోట్లు కావటం గమనార్హం. కేంబ్రిడ్జ్, హార్వర్డ్ వంటి ప్రతిష్టాత్మక విశ్వవిద్యాలయాలలో చదువుకున్న ఆయన.. న్యాయవాదిగా దశాబ్దాల అనుభవం ఆయన సొంతం. ఈ కారణంగానే దేశంలోనే అత్యంత ఖరీదైన లాయర్లలో ఆయన ఒకరన్న పేరుంది.

అభిషేక్ మను సింఘ్వీకి పేరు తెచ్చిన ముఖ్యమైన కేసుల విషయానికి వస్తే.. కొన్నింటి గురించి ప్రత్యేకంగా ప్రస్తావించాల్సిందే. అందులో కీలకమైనవి..

డీకే బసు వర్సెస్ పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం

ఇది సింఘ్వీ కెరీర్‌లో అత్యంత కీలకమైన కేసు. అరెస్టులు.. పోలీస్ కస్టడీలో హింసను నిరోధించటానికి సుప్రీంకోర్టు ఈ కేసులో చారిత్రాత్మక మార్గదర్శకాలను ఇచ్చింది. ఈ కేసులో ఆయన 'అమికస్ క్యూరీ'గా వ్యవహరించి కోర్టుకు సహకరించారు.

శబరిమల కేసు

శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశానికి సంబంధించిన కేసులో ఆయన వాదనలు వినిపించారు. ఈ కేసులో ఆయన ఆలయ సంప్రదాయాల తరపున వాదించడం గమనార్హం.

టెలికాం రంగం

టెలికాం రంగంలో సంస్కరణలు తెచ్చిన అనేక కేసులను ఆయన వాదించారు. 1997లో మొబైల్ కంపెనీలపై లెవీ విధించే విషయంలో ఆయన వినిపించిన వాదనలతో ట్రాయ్ (టెలికం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా) ఏర్పాటుకు కారణమైంది. 2జీ స్కామ్ కేసుల్లో ఎయిర్‌సెల్.. వొడాఫోన్ తరపున వాదనలు వినిపించారు.

టాటా వర్సెస్ సైరస్ మిస్త్రీ

కార్పొరేట్ రంగంలో సంచలనం సృష్టించిన టాటా సన్స్ మరియు సైరస్ మిస్త్రీ వివాదంలో ఆయనది కీలక పాత్ర

మహారాష్ట్ర.. కర్ణాటక రాజకీయ సంక్షోభాలు

ప్రభుత్వాల ఏర్పాటులో గవర్నర్ల నిర్ణయాలను సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో ప్రతిపక్షాల తరపున వాదనలు వినిపించారు.

అరవింద్ కేజ్రీవాల్ కేసు

ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో అరవింద్ కేజ్రీవాల్‌కు బెయిల్ కోరుతూ.. ఈడీ చర్యలను వ్యతిరేకిస్తూ వాదనలు వినిపిస్తున్నారు.

నేషనల్ ఫ్లాగ్ కేసు

ప్రతి పౌరుడికి జాతీయ జెండాను ఎగురవేసే హక్కు ఉందని ఫ్రూవ్ చేసిన కేసులో వాదనలు వినిపించింది ఆయనే.

ఇలా ఎన్నో కీలక అంశాలకు సంబంధించి తన అద్భుతమైన వాదనలు వినిపించిన ఆయనపై కొన్ని మరకలు కూడా ఉన్నాయి. ఆయన తీరుపై పలు విమర్శలు.. ఆరోపణలు ఉన్నాయి. వాటి విషయానికి వస్తే.. 2012లో సింఘ్వీకి సంబంధించి ఒక వివాదాస్పద వీడియో బయటకు వచ్చింది. ఇదో పెను సంచలనంగా మారింది. ఒక మహిళా సహోద్యోగిని జడ్జిని చేస్తామన్న ఆశను చూపి ఆమెతో సన్నిహితంగా ఉన్నట్లు ఆరోపణలు ఉన్నట్లు చెబుతారు. దీంతో కాంగ్రెస్ పార్టీకి అధికార ప్రతినిధిగా ఉన్న ఆయన తన పదవికి రాజీనామా చేశారు.అంతేకాదు పార్లమెంటరీ కమిటీ ఛైర్మన్ పదవికి రాజీనామా చేశారు. అయితే.. ఆ వీడియోను తన మాజీ డ్రైవర్ ఫోర్జరీ చేశాడని.. బ్లాక్ మొయిల్ చేసేందుకు ప్రయత్నించినట్లుగా కోర్టును ఆశ్రయించిన ఆయన.. ఆ తర్వాత ఈ అంశంపై ఆయన కోర్టు వెలుపల రాజీ కుదుర్చుకున్నట్లుగా చెబుతారు.

2014లో ఆదాయపు పన్నుశాఖ సింఘ్వీపై సుమారు ₹57 కోట్ల జరిమానా విధించింది. ఆయన తన ఆఫీసు ఖర్చుల కోసం దాదాపు రూ.5 కోట్లతో 1250 ల్యాప్‌టాప్‌లు కొన్నట్లు.. ఇతర ఖర్చులు భారీగా చూపించారని ఐటీ శాఖ గుర్తించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ ఖర్చులకు సంబంధించిన పత్రాల్ని అడిగితే.. తన ఆఫీసులో చెదలు పట్టటంతో రికార్డులు పాడైనట్లుగా సమాధానం ఇవ్వటం అప్పట్లో రాజకీయంగా పెద్ద విమర్శకు తావిచ్చింది. కేరళలో లాటరీ మాఫియాగా ఆరోపణలు ఎదుర్కొన్న శాంటియాగో మార్టిన్ తరపున సింఘ్వీ కోర్టులో వాదించడంపై అప్పట్లో కేరళ కాంగ్రెస్ నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. పార్టీ ప్రయోజనాలకు విరుద్ధంగా ఆయన వ్యవహరించారనే విమర్శలు వచ్చాయి.