మమతకు మేనల్లుడి మంట.. మోడీకి పంట!
పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ(టీఎంసీ) అధినేత్రి మమతా బెనర్జీకి ఆమె మేనల్లుడు , పార్లమెంటు సభ్యుడు అభిషేక్ బెనర్జీ చేస్తున్న రాజకీయాలు తీవ్ర స్థాయిలో ఇబ్బంది పెడుతున్నాయి.
By: Garuda Media | 10 Jun 2026 1:00 PM ISTఇప్పటికే అధికారం కోల్పోయి తీవ్ర ఇబ్బందుల్లో ఉన్న పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ(టీఎంసీ) అధినేత్రి మమతా బెనర్జీకి ఆమె మేనల్లుడు , పార్లమెంటు సభ్యుడు అభిషేక్ బెనర్జీ చేస్తున్న రాజకీయాలు తీవ్ర స్థాయిలో ఇబ్బంది పెడుతున్నాయి. పార్టీ ఇప్పటికే రెండుగా చీలిపోయిన పరిస్థితి కూడా కనిపిస్తోంది. పార్లమెంటు లోక్‌సభలో టీఎంసీ పార్టీకి 23 మంది ఎంపీలు ఉండగా 20 మంది పార్టీతో విభేదించి బయటకు వచ్చారు. వీరంతా తమ ప్రధాని మోడీ నేతృత్వంలోని ఎన్డీఏకి మద్దతు తెలుపుతున్నామని స్పష్టం చేశారు.
నేరుగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై ప్రశంసలు గుప్పించక పోయినప్పటికీ ప్రస్తుతం అధికారంలో ఉన్న ఎన్‌డీఏ కూటమికి మద్దతుగా వ్యవహరిస్తామని ఈ 20 మంది ఎంపీలకు నేతృత్వం వహిస్తున్న కకోలి ఘోష్ వెల్లడించడం విశేషం. దీనంతటికీ కారణం మమత మేనల్లుడు అభిషేక్ బెనర్జీ. ఆయన చేసిన ఆధిపత్య, నిరంకుశ రాజకీయాలు కారణమని నాయకులు ఆరోపిస్తున్నారు. అంతేకాదు పార్టీలో ఎంతో సీనియర్లుగా ఉండి పార్టీ పునాదుల నుంచి పని చేసిన తమను ఏ మాత్రం పట్టించుకోలేదని ఆరోపిస్తున్నారు.
ప్రధానంగా రాష్ట్రంలో అధికారం కోల్పోయిన తర్వాత.. ఈ తరహా పరిస్థితులు టిఎంసిని తీవ్రస్థాయిలో ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. మరోవైపు టిఎంసి పరిణామాలు కేంద్రంలోని మోడీ ప్రభుత్వానికి కలిసి వచ్చిన అంశంగా మారాయి. పార్లమెంట్లో ప్రస్తుతం 293 మంది సభ్యులతో ఉన్న ఎన్డీఏ కూటమి టీఎంసీ ఎంపీల మద్దతుతో 313 కు చేరనుంది. దీంతో ఇటు పార్లమెంట్లోనూ అటు బయట కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి భారీ మద్దతు చేకూరడం విశేషం. అది కూడా మూడోసారి అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో ఆయనకు 20 మంది ఎంపీలు గుండు గుత్తుగా మద్దతు పలకడం జాతీయ రాజకీయ వర్గాల్లో ఆశ్చర్యకరంగా మారింది.
ఈ పరిణామాలను కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండీగా కూటమి నిశితంగా గమనిస్తోంది మరోవైపు బిజెపి సంబరాలు చేసుకుంటోంది. తమను ఎన్డీఏ కూటమి భాగస్వామ్య పక్షంగా గుర్తించాలని కోరుతూ 20 మంది టీఎంసీ చీలిక వర్గం ఎంపీలు స్పీకర్ ఓంబిర్లాకు లేఖ రాశారు. సహజంగానే ఇటువంటి లేఖలను ఆమోదించడం పెద్ద విశేషమేమీ కాదు. గతంలోనూ అనేక పార్టీలను ఇటు రాజ్యసభలోనూ అటు పార్లమెంట్లోనూ బిజెపికి అనుకూలంగా మార్చుకున్న సంగతి తెలిసిందే. మొత్తంగా మేనల్లుడిని కంట్రోల్ చేసి ఉంటే మమత రాజకీయం వేరుగా ఉండేది. అలా చేయని కారణంగానే ఇప్పుడు టిఎంసి పరిస్థితి దారుణంగా మారింది అన్నది రాజకీయ విశ్లేషకులు చెబుతున్న మాట.
