ఢిల్లీ నిరసన వేళ అభిజిత్ దీప్కేకు చేదు వార్త.. విషాదంలో సీజేపీ బాస్
సీఈసీ జ్ఞానేష్ కుమార్ రాజీనామా డిమాండ్ తో జంతర్ మంతర్ 2.0 ఆందోళనలకు సీజేపీ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే.
By: Tupaki Desk | 10 Oct 2026 4:35 PM ISTకాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే ఇంట తీవ్ర విషాదం నెలకొంది. సీఈసీకి వ్యతిరేకంగా దేశ రాజధానిలో నిరసనలకు పిలుపునిచ్చిన రోజే అభిజిత్ దీప్కే నాయనమ్మ సావిత్రీ బాయి శంకర్ దీప్కే కన్నుమూశారు. మహారాష్ట్రలోని హింగోలి జిల్లా పింప్రిలో దీప్కే పూర్వీకుల ఇంటిలో సావిత్రీ బాయి నివసిస్తున్నారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె శనివారం కన్నుమూశారని కుటుంబ సభ్యులు మీడియాకు తెలిపారు. ఆదివారం సావిత్రీ బాయి అంత్యక్రియలకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆమె మరణించిన సమయానికి మనవడు అభిజిత్ దీప్కే ఢిల్లీ పోలీసుల నిర్భంధంలో ఉన్నారు.
సీఈసీ జ్ఞానేష్ కుమార్ రాజీనామా డిమాండ్ తో జంతర్ మంతర్ 2.0 ఆందోళనలకు సీజేపీ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ నిరసనల్లో పాల్గొనేందుకు శనివారం ఉదయమే దీప్కే ముంబై నుంచి ఢిల్లీకి వచ్చారు. ఆయనతోపాటు సీజేపీ కీలక నేతలు సౌరవ్ దాస్, అశుతోష్ రాంకా కూడా ఉన్నారు. ఈ ముగ్గురు ప్రయాణిస్తున్న విమానం ఢిల్లీ విమానాశ్రయంలోకి దిగగానే కేంద్ర భద్రతా బలగాల సహకారంతో ఢిల్లీ పోలీసులు విమానంలోనే అరెస్టు చేశారు. జంతర్ మంతర్ కు వెళ్లకుండా అడ్డుకున్నారు. ఇదే సమయంలో మహారాష్ట్ర నుంచి అభిజిత్ దీప్కే ఇంట చోటుచేసుకున్న విషయం పోలీసులకు తెలిసిందని అంటున్నారు.
ఇక పోలీసుల అదుపులో ఉన్న అభిజిత్ దీప్కేకు విషాద వార్తను షేర్ చేసిన పోలీసులు వెంటనే ముంబై వెళ్లేందుకు అనుమతి ఇచ్చినట్లు చెబుతున్నారు. అయితే నిరసనలు కొనసాగించాలా? లేక ముంబై వెళ్లాలా? అనేది అభిజిత్ దీప్కే నిర్ణయం తీసుకుంటారని చెబుతున్నారు. మరోవైపు ఢిల్లీలో జంతర్ మంతర్ 2.0 నిరసనలను పోలీసులు అడ్డుకుంటారని ముందే ఊహించిన అభిజిత్ దీప్కే సీజేపీకి తాత్కాలిక నాయకుడిగా అజింక్య షిండేను ప్రకటించారు. దీంతో దీప్కే గైర్హాజరులోనూ ఉద్యమం కొనసాగే అవకాశం ఉందని అంటున్నారు.
చివరగా గత ఆగస్టులో నాయనమ్మ సావిత్రి బాయిని దీప్కే కలుసుకున్నట్లు చెబుతున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలనే డిమాండ్ తో ఆగస్టు 15న ‘స్కూల్ ఠీక్ కరో’ అనే కార్యక్రమాన్ని చేపట్టింది. ఇందులో భాగంగా దీప్కే తన స్వస్థలం హింగోలి వెళ్లినట్లు చెబుతున్నారు. ఆ సమయంలో నాయనమ్మ ఆశీస్సులు తీసుకున్నారని, తర్వాత మళ్లీ ఆమెను కలుసుకోలేకపోయారని సీజేపీ వర్గాలు చెబుతున్నాయి. ఇక అభిజిత్ దీప్కే ఇంట్లో నెలకున్న విషాదంపై నెటిజన్లు విచారం వ్యక్తం చేస్తున్నారు. అభిజిత్ కు తమ సానుభూతి తెలియజేస్తున్నారు.
