Begin typing your search above and press return to search.

నోబెల్ ఆర్థిక నిపుణుడిని టీంలోకి తీసుకున్న రేవంత్ రెడ్డి

ప్రఖ్యాత ఆర్థిక శాస్త్ర నిపుణుడు, నోబెల్ అవార్డు గ్రహీత ప్రొఫెసర్ అభిజిత్ బెనర్జీ... తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో శనివారం మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు

By:  Tupaki Desk   |   18 May 2025 9:54 AM
నోబెల్ ఆర్థిక నిపుణుడిని టీంలోకి తీసుకున్న రేవంత్ రెడ్డి
X

ప్రఖ్యాత ఆర్థిక శాస్త్ర నిపుణుడు, నోబెల్ అవార్డు గ్రహీత ప్రొఫెసర్ అభిజిత్ బెనర్జీ... తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో శనివారం మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. బంజారాహిల్స్ లోని ఇంటిగ్రేటేడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ లో జరిగిన ఈ సమావేశంలో రాష్ట్రంలో కాంగ్రెస్ సారథ్యంలోని ప్రజా ప్రభుత్వం చేపట్టిన వివిధ పథకాలు, ప్రస్తుత ఆర్థిక స్థితిగతులపై ఇరువురూ సమగ్రంగా చర్చించారు.

ఈ కీలక భేటీలో ముఖ్యమంత్రితో పాటు రాష్ట్ర ఐటీ, ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధ‌ర్ బాబు, ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి శాంతి కుమారి, ఆర్థిక శాఖ ముఖ్య కార్య‌ద‌ర్శి సందీప్ కుమార్ సుల్తానియా, సీఎం ప్రత్యేక కార్యదర్శి అజిత్ రెడ్డి, హైద‌రాబాద్ పోలీస్ క‌మిష‌న‌ర్ సీవీ ఆనంద్ తో పాటు ఇత‌ర ఉన్న‌తాధికారులు పాల్గొన్నారు.

రాష్ట్ర ఆర్థిక వృద్ధిని వేగవంతం చేయడం, ఆదాయ వనరులను పెంపొందించడం, ఆర్థిక క్రమశిక్షణ పాటించడం, పట్టణాభివృద్ధి, నైపుణ్యాభివృద్ధి ద్వారా యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడం వంటి కీలక అంశాలపై చర్చ జరిగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, శ‌తాబ్దాల చ‌రిత్ర ఉన్న హైద‌రాబాద్ న‌గ‌ర విశిష్ట‌త‌ను, ఇక్క‌డ త‌యార‌య్యే ఉత్ప‌త్తులకు ప్ర‌పంచ వ్యాప్తంగా ఉన్న ఆద‌ర‌ణ‌ను అభిజిత్ బెనర్జీకి వివరించారు. తెలంగాణ ప్రత్యేకత‌ను, ఇక్కడున్న సానుకూలతలను ప్ర‌పంచానికి చాటిచెప్పాల్సిన అవ‌స‌రం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. మ‌హిళా స్వ‌యం స‌హాయ‌క సంఘాల బలోపేతం, రైతుల సాధికారత, యువతకు ఉద్యోగ అవకాశాల కల్పన, స్కిల్ డెవెలప్మెంట్ దిశగా ప్రభుత్వం చేప‌డుతున్న విప్ల‌వాత్మ‌క చ‌ర్య‌లను ఆయన ప్రస్తావించారు.

తెలంగాణ రైజింగ్ విజ‌న్ బోర్డులో భాగస్వామ్యానికి ఆహ్వానం:

రాష్ట్ర ప్ర‌భుత్వం త్వరలో ఏర్పాటు చేయనున్న తెలంగాణ రైజింగ్ విజ‌న్ బోర్డులో భాగస్వామ్యం పంచుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. అభిజిత్ బెనర్జీని సాదరంగా ఆహ్వానించారు. భవిష్యత్తు విజన్ రూపకల్పనలో ఇతర ప్రముఖులతో పాటు తమ విలువైన అనుభవాలను, సలహాలను అందించాలని ఆయన కోరారు. ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి దార్శనికత‌ను ప్ర‌శంసించిన అభిజిత్బెనర్జీ, ఈ ప్రతిష్టాత్మక బోర్డులో చేర‌డానికి తన అంగీకారాన్ని తెలియజేశారు.

ముఖ్యంగా, పోలీస్, మున్సిపల్ శాఖల్లో ట్రాన్స్జెండర్ల నియామకం, ఔట‌ర్ రింగ్ రోడ్డు లోపల ఉన్న హైద‌రాబాద్ కోర్ అర్బ‌న్ ఏరియాను సర్వీస్ సెక్టార్ గా అభివృద్ధి చేసే ప్ర‌ణాళిక, స్కిల్ యూనివ‌ర్సిటీ, స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేయాల‌నే ముఖ్యమంత్రి నిర్ణ‌యాలు ఆయన దార్శనికత‌కు అద్దం పట్టాయని అభిజిత్ బెన‌ర్జీ అభినందించారు.

అభిజిత్ బెనర్జీ సూచనలు:

'భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీ' భావనలో ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్, సృజనాత్మ‌క‌త‌ను భాగం చేయాలని అభిజిత్ బెనర్జీ సూచించారు. సంప్ర‌దాయ చేతివృత్తుల వారిని ఆధునిక వ్యాపార‌వేత్త‌లుగా మార్చేందుకు ప్ర‌త్యేక స్వ‌ల్ప‌కాలిక కోర్సులు నిర్వహించాలని ఆయన అభిప్రాయ‌ప‌డ్డారు. అత్యాధునిక సాంకేతికత, సోషల్ మీడియా, మార్కెటింగ్ నైపుణ్యాలతో వారికి శిక్షణ ఇవ్వడం ద్వారా వారిని వృద్ధి చేయాలని ఆయన పేర్కొన్నారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దార్శనికతను ప్ర‌శంసించిన అభిజిత్ బెన‌ర్జీ, రాష్ట్ర ఆర్థిక ప్రగతికి తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని హామీ ఇచ్చారు. ఈ భేటీతో తెలంగాణ అభివృద్ధి ప్రణాళికల్లో నోబెల్ గ్రహీత వంటి అంతర్జాతీయ నిపుణుల భాగస్వామ్యం ఖాయమైనట్లు తెలుస్తోంది.