సౌదీ జైలు నుంచి తిరిగి వచ్చిన రహీమ్..ఎమోషనల్ మోమెంట్ వైరల్!
ఒక మనిషి ప్రాణాన్ని కాపాడుకోవడానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న మలయాళీలు చూపించిన మానవత్వానికి నిదర్శనమే ఈ విజయం. ఆ విశేషాలు చూద్దాం..
By: Madhu Reddy | 28 May 2026 2:52 PM ISTదశాబ్దాల సుదీర్ఘ నిరీక్షణకు తెరపడింది. సౌదీ అరేబియా జైలులో 20 ఏళ్ల పాటు మగ్గిన కేరళకు చెందిన అబ్దుల్ రహీమ్, ఎట్టకేలకు గురువారం ఉదయం తన మాతృభూమికి చేరుకున్నారు. కరిపూర్ విమానాశ్రయంలో దిగిన రహీమ్‌ను చూడగానే కుటుంబ సభ్యులు, స్నేహితులు భావోద్వేగానికి గురయ్యారు.. ఆయన రాకతో విమానాశ్రయం ప్రాంగణం ఉద్వేగపూరిత వాతావరణంతో నిండిపోయింది. ఒక మనిషి ప్రాణాన్ని కాపాడుకోవడానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న మలయాళీలు చూపించిన మానవత్వానికి నిదర్శనమే ఈ విజయం. ఆ విశేషాలు చూద్దాం..
అసలు ఏం జరిగింది?:
అబ్దుల్ రహీమ్ 2006లో ఉపాధి కోసం సౌదీ అరేబియా వెళ్లారు. అక్కడ ఒక బాలుడి మరణానికి సంబంధించిన కేసులో ఆయన అనుకోకుండా చిక్కుకుని అరెస్ట్ అయ్యారు. అప్పటి నుంచి 20 ఏళ్ల పాటు ఆయన జైలు లోనే వున్నాడు. కోర్టు ఆయనకు మరణశిక్ష కూడా విధించింది. దాంతో రహీమ్ జీవితం ముగిసిపోయిందనే అందరూ అనుకున్నారు.
కదిలించిన 'రూ. 34 కోట్ల' బ్లడ్ మనీ:
అయితే, మరణశిక్ష నుంచి రహీమ్‌ను కాపాడేందుకు ఒకే ఒక మార్గం మిగిలింది. మృతుడి కుటుంబం ‘దియా’ స్వీకరించడానికి అంగీకరించింది. కానీ, ఆ మొత్తం అక్షరాలా రూ. 34 కోట్లు! అంత పెద్ద మొత్తాన్ని సమకూర్చడం సామాన్యమైన విషయం కాదు. ఇక్కడే మలయాళీలు తమ గొప్ప మనసును చాటుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా విరాళాల సేకరణ చేపట్టి, రూపాయి రూపాయి పోగు చేసి ఆ మొత్తాన్ని చెల్లించారు. దాంతో 2024 జూలైలో రహీమ్ మరణశిక్ష రద్దయ్యింది.
చివరి నిమిషం వరకు ఉత్కంఠ:
రహీమ్ జైలు శిక్ష అధికారికంగా మే 19నే ముగిసినప్పటికీ, సౌదీ జైలు అధికారులు హజ్ విధుల్లో బిజీగా ఉండటంతో విడుదల ఆలస్యమైంది. అయితే, ఈ కేసులోని తీవ్రతను గుర్తించిన సౌదీ అధికారులు, ప్రత్యేక ప్రోటోకాల్‌లను అమలు చేసి విడుదల ప్రక్రియను వేగవంతం చేశారు. బుధవారం అర్ధరాత్రి అన్ని లాంఛనాలను పూర్తి చేసి, రహీమ్‌ను ఇండియాకు పంపే ఏర్పాట్లు చేశారు.
విమానాశ్రయంలో కన్నీటి క్షణాలు:
రియాద్ నుంచి ఎయిర్ ఇండియా విమానంలో ఉదయం 8 గంటలకు కరిపూర్ విమానాశ్రయానికి చేరుకున్న రహీమ్, బయటకు రాగానే భావోద్వేగానికి లోనయ్యారు. సుదీర్ఘ కాలం పాటు తనకు తోడుగా నిలిచిన ప్రతి ఒక్కరికీ చేతులు జోడించి కృతజ్ఞతలు తెలిపారు. ఇక అనంతరం, 20 ఏళ్లుగా దూరం అయిన కన్నతల్లిని కలవాలన్న తపనతో ఆయన నేరుగా తన స్వగృహానికి బయలుదేరారు.
డబ్బులు ఉంటేనే ఏ పనైనా జరుగుతుందనే ఈ రోజుల్లో.. ఒక అపరిచిత వ్యక్తి ప్రాణాన్ని కాపాడటానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న వేలాది మంది చేతులు కలపడం నిజంగా గ్రేట్. మానవత్వం ఇంకా బతికే ఉందని నిరూపించిన ఈ ఘటన, రహీమ్ కుటుంబంలోనే కాకుండా ప్రతి ఒక్కరి గుండెల్లో ఒక ఎమోషనల్ మార్క్ గుసగుసలాడుతోంది.
