అబ్బయ్య చౌదరి పార్టీ మార్పు... ఇదిగో క్లారిటీ!
దెందులూరు వైసీపీ మాజీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి గురించి రాజకీయ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చ మొదలైన సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 7 Jun 2025 2:49 PM ISTదెందులూరు వైసీపీ మాజీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి గురించి రాజకీయ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చ మొదలైన సంగతి తెలిసిందే. గత కొంతకాలంగా నియోజకవర్గంలో ఆయన కనిపించడం లేదని.. ద్వితీయ శ్రేణి నేతలతోనూ టచ్ లో ఉండటం లేదని.. త్వరలో ఆయన ఫ్యాన్ కింద నుంచి లేచి సైకిల్ ఎక్కే అవకాశం ఉందంటూ ప్రచారం మొదలైంది. ఈ సమయంలో అబ్బయ్య చౌదరి స్పందించారు.
అవును... 2009, 2014 ఎన్నికల్లో వరుసగా గెలిచిన టీడీపీ నేత చింతమనేని ప్రభాకర్.. 2019లోనూ గెలిచి హ్యాట్రిక్ కొడతారని చాలామంది భావించారు. అయితే.. 2019 ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేసిన అబ్బయ్య చౌదరి గెలుపొందారు. 16వేలకు పైచిలుకు ఓట్లతో విజయం సాధించారు. ఇలా చింతమనేనిపై గెలుపొందడంతో ఒక్కసారిగా స్టేట్ వైడ్ ఫోకస్ సంపాదించారు!
అయితే... 2019-24 మధ్య చింతమనేని ప్రభాకర్ పై పలు కేసులు నమోదయ్యాయి. ఈ క్రమంలో ఆయన శ్రీకృష్ణ జన్మస్థలానికీ వెళ్లిన పరిస్థితి! దీంతో.. ఆయన ఫుల్ కసి మీద ఉన్నారని అంటారు. కట్ చేస్తే 2024 ఎన్నికల్లో అబ్బయ్య చౌదరిపై చింతమనేని పాతికవేల పైచిలుకు ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ప్రస్తుతం నియోజకవర్గంలో వార్ వన్ సైడ్ అన్నట్లుగా నడుచుకుంటున్నారని చెబుతారు.
ఈ క్రమంలోనే గత కొంతకాలంగా నియొజకవర్గ ప్రజలకు అబ్బయ్య చౌదరి అందుబాటులో ఉండటం లేదనే చర్చ మొదలైంది. ఈ నేపథ్యంలోనే ఆయన పార్టీ మారే సూచనలు ఉన్నాయని అంటున్నారు. ఈ మేరకు సోషల్ మీడియాలో ప్రచారం మొదలైంది. ఈ క్రమంలో జరుగుతున్న ప్రచారంపై తాజాగా అబ్బయ్య చౌదరి స్పందించారు.
ఇందులో భాగంగా... తాను పార్టీ మారేది లేదని, తనపై వస్తున్న వార్తలు అన్న్నీ పుకర్లేనని స్పష్టం చేశారు. తాను, తన తండ్రి గత రెండు దశాబ్ధాలుగా వైఎస్సార్ ఫ్యామిలీతోనే కలిసి ఉంటున్నామని తెలిపారు. తాను ప్రత్యక్ష రాజకీయాల్లోకి 2017లో వచ్చినప్పుడు వైసీపీ ప్రతిపక్షంలోనే ఉందని తెలిపారు.
తాను అమెరికాలో ఒక టెక్నాలజీ కాన్ఫరెన్స్ లో పాల్గొనడానికి ఇక్కడకి రావడం జరిగిందని తెలిపారు. అంతేతప్ప తనకు పార్టీ మారే ఆలోచన లేదని అన్నారు. పార్టీ మారుతున్నారంటూ తనపై వస్తోన్న వదంతులను ఖండిస్తున్నట్లు తెలిపారు. దెందులూరులో రూ.4000 కోట్లతో అభివృద్ధి పనులు చేసినట్లు తెలిపారు.
ఈ రోజు అధికారం ఉందని అహంకారంతో ప్రవర్తిస్తే కాలమే సమాధానం చెబుతుందని అన్నారు. తానంటే ఏమిటో నియోజకవర్గ ప్రజలకు తెలుసని తెలిపారు. తనను ఇబ్బంది పెట్టాలనో, అవమానపరచాలనో అనేక ప్రయత్నాలు జరిగాయని.. ఇవన్నీ తమను నైతికంగా దెబ్బకొట్టొచ్చనే ఉద్దేశ్యంతో చేస్తున్న దిగజారుడు రాజకీయాలని అన్నారు.
