Begin typing your search above and press return to search.

అబ్బయ్య చౌదరి వైసీపీకి షాకిస్తారా ?

దెందులూరు నుంచి 2019 ఎన్నికల్లో కొఠారు అబ్బయ్య చౌదరి వైసీపీ తరఫున గెలిచారు. ఆయన అయిదేళ్ళ పాటు డైనమిక్ గా ఉన్న లీడర్.

By:  Tupaki Desk   |   6 Jun 2025 10:04 PM IST
అబ్బయ్య చౌదరి వైసీపీకి షాకిస్తారా ?
X

దెందులూరు నుంచి 2019 ఎన్నికల్లో కొఠారు అబ్బయ్య చౌదరి వైసీపీ తరఫున గెలిచారు. ఆయన అయిదేళ్ళ పాటు డైనమిక్ గా ఉన్న లీడర్. ఆయన వైసీపీ అధినేత జగన్ కి అత్యంత సన్నిహితులుగా పేరు గడించారు. వైసీపీ అధికారంలో ఉన్న కాలంలో ఆయన పేరు మంత్రి పదవికి కూడా పరిశీలనకు వచ్చింది.

అలా వైసీపీలోనూ పశ్చిమ గోదావరి జిల్లాలోనూ ఎంతో కీలకమైన నేతగా ఉన్న అబ్బయ్య చౌదరి మీద ఇటీవల కాలంలో పుకార్లు షికారు చేస్తున్నాయి. ఆయన పార్టీ మారుతారని, కూటమి వైపు చేరిపోతున్నారని. దానికి కారణం ఆయన ఇటీవల కాలంలో పెద్దగా పార్టీ కార్యక్రమాలలో చురుకుగా పాలు పంచుకోవడం లేదు.

దెందులూరులో టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేగా సీనియర్ నేత చింతమనేని ప్రభాకర్ ఉన్నారు. ఆయన రాజకీయం వేరే లెవెల్ లో ఉంటుంది. ఇక 2019 నుంచి 2024 మధ్యలో ఆయన మీద కేసులు పెట్టి జైలుకు కూడా వైసీపీ ప్రభుత్వం పంపించింది దాంతో ఆయన కసి మీద ఉన్నారని అంటారు.

దాంతో కూటమి నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన చింతమనేని తన దూకుడు రాజకీయం చూపిస్తున్నారు. దీంతో దెందులూరులో వైసీపీ తీవ్ర ఇబ్బందులు పడుతోంది. ఇక మాజీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి కూడా కొంత నిరాసక్తతతో ఉన్నారని ప్రచారమూ సాగింది.

ఈ క్రమంలోనే ఆయన పార్టీ మార్పు అన్నది పెద్ద ఎత్తున సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతోంది. అయితే దీని మీద అమెరికా నుంచే ఒక వీడియో బైట్ వదిలారు అబ్బయ్య చౌదరి. తాను పార్టీ మారేది లేదని ఆయన స్పష్టం చేశారు. తన మీద వస్తున్న వార్తలు అన్నీ పుకార్లే అని ఆయన అన్నారు.

తాను పార్టీ మారే పరిస్థితి ఉండదని అన్నారు. తాను తన తండ్రి గత రెండు దశాబ్దాలుగా వైఎస్సార్ కుటుంబంతో కలసి ఉంటున్నామని అన్నారు. ఇక తాను 2017లో ప్రత్యక్ష రాజకీయాలలోకి వచ్చాను అని గుర్తు చేశారు. మరి ఆనాడు వైసీపీ ప్రతిపక్షంలోనే ఉంది కదా అని ఆయన అన్నారు.

తాను ప్రతిపక్షంలో ఉన్నందుకు ఏమీ ఇబ్బంది పడడం లేదని అన్నారు. అధికారం అన్నది ఎవరికీ శాశ్వతం కాదని ఆయన అన్నారు. తన కుటుంబం మీద తన వారి మీద అధికార పార్టీ వారు దాడులు చేస్తున్నారని ఆయన అంటూ ఇది మంచి విధానం కాదని అన్నారు.

ఎవరెన్ని ఇబ్బందులు పెట్టినా భయపడేది లేదని అన్నారు. మీకు అవకాశం ఉంది చేస్తారు, అధికారం అడ్డం పెట్టుకుని ఈ రోజు సాధిద్దామని అనుకుంటున్నారని ఆయన విమర్శించారు. తాను దెందులూరుని ఎంతో అభివృద్ధి చేశామని అన్నారు. తాను రాజకీయంగా గట్టిగానే ఇవన్నీ ఎదుర్కొంటాను అని అన్నారు. తాను కొన్ని వ్యక్తిగత కారణాల వల్లనే కొన్ని రోజుల పాటు రాజకీయాల మీద దృష్టి పెట్టలేదని అన్నారు.

అంత మాత్రం చేత అబ్బయ్య చౌదరి పార్టీ మారుతున్నారని విష ప్రచారం చేయడం దారుణం అన్నారు. దెందులూరు ప్రజలతోనే తన ప్రయాణం అని ఆయన స్పష్టం చేశారు. తాను పార్టీ మారేది లేదని వైసీపీని మళ్ళీ దెందూలూరులో పటిష్టం చేసే కార్యక్రమాలు నిర్వహిస్తామని అన్నారు. కూటమి ప్రభుత్వం మంచి చేయాలని ఆయన కోరారు.

ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియగం చేసుకోవాలని ఆయన సూచించారు. రాజకీయ కక్షలకు దిగడం మంచి విధానం కాదని అన్నారు. అధికారం ఎవరికీ శాశ్వతం కాదని అహంకారంతో ప్రవర్తించాలనుకుంటే కాలమే జవాబు చెబుతుందని ఆయన అన్నారు. హుందాతనంతో కూడిన రాజకీయం చేయాలని ఆయన కోరారు.