Begin typing your search above and press return to search.

సోషల్ మీడియా యుద్ధంలోికి ఏబీవీ... జగన్ పై వీడియోల పోరు

రిటైర్డ్ పోలీసు అధికారి ఏబీ వెంకటేశ్వరరావు మాజీ ముఖ్యమంత్రి జగన్ పై యుద్ధంలో సోషల్ మీడియాను వేదికగా చేసుకుంటున్నారు.

By:  Tupaki Desk   |   3 May 2025 8:59 PM IST
సోషల్ మీడియా యుద్ధంలోికి ఏబీవీ... జగన్ పై వీడియోల పోరు
X

రిటైర్డ్ పోలీసు అధికారి ఏబీ వెంకటేశ్వరరావు మాజీ ముఖ్యమంత్రి జగన్ పై యుద్ధంలో సోషల్ మీడియాను వేదికగా చేసుకుంటున్నారు. తాను రాజకీయాల్లోకి వస్తానని, జగన్ బాధితులకు అండగా నిలుస్తానని చెబుతున్న ఏబీవీ.. గత ప్రభుత్వంలో తనకు అన్యాయం జరిగిందని ఆరోపిస్తున్నారు. నాటి అన్యాయానికి ప్రతీకారం తీర్చుకోవడమే లక్ష్యంగా గత ప్రభుత్వంలో చోటు చేసుకున్న అంశాలను తెరపైకి తెచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. గత నెలలో ముమ్ముడివరంలో కోడికత్తి కేసు నిందితుడు జనిపల్లి శ్రీనివాసరావు కుటుంబ సభ్యులతో మాట్లాడిన ఏబీవీ, ఆ తర్వాత కాకినాడలో వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు కారు డ్రైవర్ వీధి సుబ్రహ్మణ్యం తల్లిదండ్రులను కలిశారు. ఈ రెండు కేసుల్లో బాధితుల తరఫున న్యాయ పోరాటం చేస్తానని ఏబీవీ చెప్పారు. అయితే అంతకు మించి అన్నట్లు ఇప్పుడు ఆయన కొత్త పద్దతిలో వైసీపీకి సవాల్ విసురుతున్నారు.

2019 ఎన్నికలకు కొద్ది రోజుల ముందు వైసీపీ అధినేత జగన్ పై విశాఖ విమానాశ్రయంలో కోడికత్తితో నిందితుడు జనిపల్లి శ్రీనివాసరావు దాడి చేసిన విషయం తెలిసిందే. అప్పట్లో ఈ సంఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపింది. ఇక దాడి జరిగిన వెంటనే పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. ఈ కేసు దర్యాప్తులో ఏపీ పోలీసులపై తనకు నమ్మకం లేదని వైసీపీ అధినేత జగన్ చెప్పడంతో కేంద్రం ప్రభుత్వం ఎన్ఐఏకి కేసును బదిలీ చేసింది. ఎన్ఐఏ విచారణ పూర్తి చేసినా బాధితుడిగా జగన్ సాక్ష్యం చెప్పడానికి కోర్టుకు వెళ్లకపోవడంతో విచారణ నిలిచిపోయిందని అంటున్నారు. ఇక ఐదేళ్లపాటు జైలులోనే రిమాండు ఖైదీగా ఉండిపోయాడు నిందితుడు. అయితే ఆయన తరఫు న్యాయవాదుల పోరాటం, నేరానికి సంబంధించి శిక్షకు మించి జైలులో ఉండటం వల్ల నిందితుడుని బెయిల్ పై విడుదల చేసింది కోర్టు.

ఇక అప్పట్లో ఏబీవీ ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా పనిచేశారు. జగన్ పై దాడికి అప్పటి ప్రభుత్వ పెద్దలే ప్లాన్ చేశారని వైసీపీ విమర్శలు చేసింది. కానీ, జగన్ అభిమానే ఎన్నికల్లో లబ్ధి కోసం దాడి చేశాడని ఘటన జరిగిన నాడే పోలీసులు ఓ లేఖ బయట పెట్టారు. ఇక నిందితుడు బెయిల్ పై విడుదల అయిన తర్వాత కోడికత్తి కేసు ఈ ఎన్నికల్లోనూ చర్చకు దారితీసింది. మరోవైపు 2019 ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత జగన్.. ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావును సస్పెండ్ చేయించారని అంటారు. తనను అన్యాయంగా సస్పెండ్ చేశారని కోర్టుకు వెళ్లి పోస్టింగు తెచ్చుకున్నారు ఏబీవీ. కానీ, జగన్ ప్రభుత్వంలో ఒక్క రోజు కూడా సర్వీసు చేయకుండానే ఆయన అరెస్టు అయ్యారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆయనకు అన్నిరకాలుగా న్యాయం చేసి పోలీసు హౌసింగు బోర్డు చైర్మన్ పదవిని ఇచ్చినా ఏబీవీ తీసుకోలేదు.

కేవలం తనను వేధించిన మాజీ ముఖ్యమంత్రి జగన్ ను రచ్చకీడ్చమే లక్ష్యంగా పెట్టుకున్న ఏబీవీ.. జగన్ బాధితుల తరఫున పోరాడుతానని ప్రకటించారు. అదే సమయంలో మీడియాకు ఇంటర్వ్యూలిస్తూ జగన్ జమానాపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ విషయంలో జగన్ కు చెందిన సాక్షి మీడియాలో ఏబీవీ లక్ష్యంగా కథనాలు ప్రచురితమైతే, వాటిపై చర్చించేందుకు సిద్ధమంటూ సవాల్ విసురుతున్నారు. ఇదే సమయంలో యూట్యూబ్ చానళ్లకు ఇంటర్వూలు కూడా ఇచ్చారు. అయితే ఇప్పుడు ఏబీవీ మరో రకంగా జగన్ పై యుద్ధానికి సిద్ధమవుతున్నవారు. ప్రస్తుతం యూట్యూబ్ లో ప్రతి ఒక్కరు వీడియోలు అప్ లోడ్ చేస్తూ తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు.

ఈ మార్గంలోనే ఏబీవీ కూడా సొంతంగా వీడియోలు చేస్తున్నారు. కోడికత్తి కేసు డ్రామాగా అభివర్ణిస్తూ ఆయన తాజాగా 45 నిమిషాల నిడివి ఉన్న వీడియోను ఓ యూట్యూబ్ చానల్ ద్వారా అప్ లోడ్ చేశారు. ఇందులో ఏబీవీ ఒక్కరే నాటి సంఘటన మొత్తాన్ని వివరించే ప్రయత్నం చేశారు. దాడి ఎప్పుడు జరిగింది? ఆ సమయంలో ఎవరున్నారు? విచారణకు జగన్ సహకరించిందీ? లేనిదీ? వంటి అన్ని విషయాలను వివరించారు. పోలీసు అధికారిగా అప్పటి డీజీపీ ఏం చేశారు? ఆ తర్వాత ఆయన ఎలాంటి ప్రయోజనం పొందారన్న విషయాలపైనా తన వీడియోల చర్చించారు ఏబీవీ. ఇలా ఈ ఒక్క కేసు కాకుండా మొత్తం జగన్ ప్రభుత్వం చోటుచేసుకున్నాయని చెబుతున్న అనేక అంశాలపై తాను వీడియోలు చేస్తానని ఏబీవీ చెబుతున్నారు. దీంతో ఏబీవీ తీరు చర్చనీయాంశంగా మారింది. గతంలో ఏ ఐపీఎస్ అధికారి ఇలా సోషల్ మీడియా వేదికగా పోరాటం చేయలేదు. ప్రస్తుతం ఎక్కువ మంది సోషల్, డిజిటల్ మీడియానే ఫాలో అవుతుండటం వల్ల ఏబీవీ తన పోరాటానికి సోషల్ మీడియానే వేదికగా ఎంచుకున్నారని చెబుతున్నారు.