టీడీపీకి ఏబీవీ తలనొప్పి.. రిటైర్డ్ డీజీని దారి తెచ్చుకోవడం ఎలా?
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం విపక్షానికి మించిన రీతిలో స్వపక్షం నుంచి విమర్శలు ఎదుర్కొంటుండటం చర్చనీయాంశం అవుతోంది.
By: Tupaki Desk | 4 Aug 2025 4:35 PM ISTరాష్ట్రంలో కూటమి ప్రభుత్వం విపక్షానికి మించిన రీతిలో స్వపక్షం నుంచి విమర్శలు ఎదుర్కొంటుండటం చర్చనీయాంశం అవుతోంది. ప్రధానంగా ముఖ్యమంత్రి చంద్రబాబు విధానాలను తప్పుబడుతూ రిటైర్డ్ డీజీపీ ఏబీ వెంకటేశ్వరరావు ప్రత్యేక కార్యాచరణకు దిగడం సంచలనం రేపుతోంది. తెలుగుదేశం పార్టీతో ఆయనకు నేరుగా సంబంధాలు లేకపోయినా, రాష్ట్రంలో ఆయనను టీడీపీ నుంచి వేరుగా చూసిన పరిస్థితి లేదని అంటున్నారు. అంతేకాకుండా గత ప్రభుత్వంలో ఆయన ఎదుర్కొన్న ఇబ్బందులు, అవమానాలను దృష్టిలో పెట్టుకుని టీడీపీ కేడర్ ఏబీవీతో బాగా కనెక్ట్ అయింది. దీంతో ఆయన వాదనను టీడీపీ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం చేస్తోంది. అయితే ఇప్పుడు ఆయన టీడీపీ ప్రభుత్వానికే ఎదురు తిరుగుతున్నట్లు వ్యవహరిస్తుండటంతో కలకలం రేగుతోందని అంటున్నారు.
ఏబీవీ వైఖరిని గమనిస్తున్న టీడీపీ హైకమాండ్ ఆయన విషయంలో ఏం చేయాలో తేల్చుకోలేకపోతోందని అంటున్నారు. కొద్ది నెలల క్రితం తాను రాజకీయాల్లోకి వస్తున్నట్లు ప్రకటించారు ఏబీవీ. అంతేకాకుండా తన ప్రధాన లక్ష్యం మాజీ ముఖ్యమంత్రి జగన్ అంటూ స్పష్టం చేశారు. అయితే ఆయన గురి తప్పి ఎక్కువగా టీడీపీనే టార్గెట్ చేస్తున్నారని పసుపు సైన్యం వాపోతోంది. ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రతిపాదిస్తున్న పోలవరం-బనకచర్ల ప్రాజెక్టును ఆయన తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ ప్రాజెక్టు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆలోచన కాదని చెబుతున్న ఏబీవీ.. ఓ ఇంజనీరింగ్ సంస్థ తన సొంత ప్రయోజనం కోసం ఈ ప్రాజెక్టును ప్రతిపాదిస్తోందని ఆయన ఆరోపిస్తున్నారు. బనకచర్ల వల్ల రాష్ట్ర ప్రజలకన్నా ఎక్కువగా మాజీ ముఖ్యమంత్రి జగన్, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రమే లాభపడతారని ఏబీవీ వాదిస్తున్నారు.
కొద్ది రోజుల క్రితం విజయవాడ వేదికగా బనకచర్లపై తన ఆలోచనలను బయటపెట్టిన ఏబీవీ మరికొంత మంది మేథావులతో కలిసి బనకచర్ల ప్రాజెక్టును విరమించుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. బనకచర్లపై ప్రభుత్వం ముందుకు వెళితే రాష్ట్ర వ్యాప్త ఉద్యమం లేవనెత్తుతామని అప్పట్లో హెచ్చరించారు. అయితే ఏబీవీ హెచ్చరికలను ప్రభుత్వం పెద్దగా పట్టించుకోలేదని భావిస్తున్న ఆయన తాజాగా ప్రాజెక్టు బాట పేరిట రాయలసీమ ప్రాంతంలో పర్యటించేందుకు షెడ్యూల్ ప్రకటించారు. దీంతో ఏబీవీ వైఖరిపై టీడీపీలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. రిటైర్డ్ డీజీతో ఎందుకొచ్చిందీ తలనొప్పి అంటూ టీడీపీ నేతలు తమ అంతర్గత సంభాషణల్లో చర్చించుకుంటున్నారు. హైకమాండ్ ఒకసారి ఆయనతో మాట్లాడితే సరిపోతుంది కదా? అంటూ సలహాలిస్తున్నారు.
వాస్తవానికి కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏబీవీతో కొంత గ్యాప్ వచ్చిందని ప్రచారం జరుగుతోంది. టీడీపీ సానుభూతిపరుడిగా ముద్రపడిన తాను గత ఐదేళ్లు తీవ్ర ఇబ్బందులు పడ్డానని, ఇప్పుడు కూడా తనకు మేలు జరగడం లేదని ఏబీవీ అసంతృప్తిగా ఉన్నట్లు చెబుతున్నారు. దీనిపై కొద్ది రోజుల క్రితం ఒక ట్వీట్ లో తన ఆవేదన ఆయన వెల్లగక్కారు. తనకు జరిగిన ఆర్థిక నష్టాన్ని పూడ్చడానికి మంచి ప్రభుత్వానికి తొమ్మిది నెలలు పట్టిందని ఆయన ఆ ట్వీట్ లో చురక వేశారని అంటున్నారు. దీంతో ప్రభుత్వం దిగివచ్చి ఆయనను సంతృప్తి పరిచేలా అన్ని చర్యలు తీసుకున్నా, ఏబీవీ ఆందోళన బాట వీడకపోవడమే ఆసక్తి రేపుతోంది. అయితే ఏబీవీ సన్నిహితులు మాత్రం ఆయన పోరాటం కూటమి ప్రభుత్వంపై కాదని, కేవలం బనకచర్ల ప్రతిపాదనపైనే వ్యతిరేకంగా ఉన్నారని అంటున్నారు. బనచర్లవల్ల రాష్ట్రం మరింత అప్పుల పాలవుతోందన్న ఆవేదనతోనే ఆయన ఆలోచనలు పంచుకుంటున్నారని అంటున్నారు. ఇదే సమయంలో రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేయాలంటే ప్రజలు ఒకే ప్రభుత్వాన్ని స్థిరంగా గెలిపించాలని కోరుతున్నారని గుర్తు చేస్తున్నారు. అంటే ముఖ్యమంత్రి చంద్రబాబు బనకచర్ల ప్రతిపాదన విరమించుకోవాలన్న డిమాండ్ తోనే ఏబీవీ ఒత్తిడి పెంచుతున్నారని చెబుతున్నారు.
